స్ట్రాటో ఆవరణకు చేరిన భారతీయుడు | indian reachesd to stratosphere | Sakshi
Sakshi News home page

స్ట్రాటో ఆవరణకు చేరిన భారతీయుడు

Published Thu, Sep 18 2014 3:28 PM | Last Updated on Sat, Sep 2 2017 1:35 PM

indian reachesd to stratosphere

ఆకేపాటి
 శ్రీనివాసులు రెడ్డి
 కరెంట్ అఫైర్స్ నిపుణులు
 
 
 క్రీడలు
 యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత మారిన్
 యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా క్రొయేషియాకు చెందిన మారిన్ సిలిక్ నిలిచాడు. ఫైనల్లో జపాన్‌కు చెందిన తార కియ్ నిషికోరిపై విజయం సాధించాడు.
 
 పాక్ స్పిన్నర్ అజ్మల్‌పై ఐసీసీ నిషేధం
 పాకిస్థాన్ స్పిన్నర్ సయీద్ అజ్మల్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేధం విధించింది. అజ్మల్ బౌలింగ్ శైలి నిబంధనలకు విరుద్ధంగా ఉందని తెలిపింది. ఆగస్టులో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో అజ్మల్ బౌలింగ్ తీరుపై సందేహం వ్యక్తం చేస్తూ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌క ఐసీసీకి నివేదించారు. దీంతో అజ్మల్‌కు పరీక్షలు నిర్వహించడంతో అతని బౌలింగ్ అక్రమమని తేలింది.
 
 నిషాకు జాతీయ మహిళల చెస్ చాంప్
 జాతీయ మహిళల చాలెంజర్స్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను నిషా మెహతా గెలుచుకుంది. పనాజీ(గోవా)లో సెప్టెంబర్ 15న ముగిసిన పోటీల్లో నిషా మెహతా స్వర్ణపతకం సాధించింది. విజయలక్ష్మికి రజతం, తెలంగాణకు చెందిన హిందూజ రెడ్డి కాంస్యం గెలుచుకున్నారు.
 
 ప్రణయ్‌కు ఇండోనేషియా మాస్టర్స్ టైటిల్
 భారత షటిలర్ హెచ్.ఎస్.ప్రణయ్ ఇండోనేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టైటిల్ గెలుచుకున్నాడు. పాలెమ్‌బాంగ్ (ఇండోనేషియా)లో సెప్టెంబర్ 14న జరిగిన ఫైనల్లో అబ్దుల్ కోలిక్ (ఇండోనేషియా)ను ఓడించాడు. అతనికిది తొలి గ్రాండ్ ప్రి గోల్డ్‌టైటిల్.
 
 
 జాతీయం
 వికలాంగులకు 3 శాతం
 రిజర్వేషన్ ఇవ్వాలన్న సుప్రీం
 అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్ కల్పించాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 12న తీర్పునిచ్చింది. సమాన అవకాశాలు, రక్షణ, పూర్తి భాగస్వామ్యం కల్పిస్తూ వికలాంగుల చట్టం 1995లో ఆమోదం పొందినప్పటికీ అమలు కాలేదని ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం. లోధా నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.
 
 భారత్ -వియత్నాం మధ్య ఏడు ఒప్పందాలు
 భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వియత్నాం పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 15న ఏడు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. చమురు గ్యాస్ రంగాల్లో సహకారం, భారత్ నుంచి రక్షణ కొనుగోళ్ల కోసం 10 కోట్ల డాలర్ల రుణం, ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు, కస్టమ్స్, యువజన వ్యవహారాలు, నైపుణ్యాల అభివృద్ధి, పశు వైద్యం వీటిలో ప్రధాన అంశాలు. ఈ పర్యటనలో రాష్ట్రపతి వియత్నాం అధ్యక్షుడు ట్రూన్ టాన్ సంగ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్ఛా నౌకాయానానికి ఇరు దేశాలు పిలుపునిచ్చాయి.
 
 పీఎస్‌యూల వాటా విక్రయం
 ప్రభుత్వ రంగ సంస్థలు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ (ఓఎన్‌జీసీ), కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పోరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ)లలో వాటాలను విక్రయించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సెప్టెంబర్ 10న ఆమోదం తెలిపింది. ఈ మూడు కంపెనీల్లో వాటాల విక్రయం వల్ల రూ. 43,800 కోట్లు సమకూరనున్నాయి.
 
 7.8 శాతానికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
 రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 7.8 శాతంగా నమోదైంది. ఇది జూలైలో 7.96 శాతంగా ఉన్నట్లు సెప్టెంబర్ 12న విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి.  కాగా టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఆగస్టులో 3.74 శాతంగా నమోదైంది. ఇది గత ఐదేళ్లలో అతి తక్కువ స్థాయికి చేరింది. ఉల్లి, కూరగాయలతోపాటు ఆహారోత్పత్తుల ధరలు భారీగా తగ్గడం వల్ల మొత్తం ద్రవ్యోల్బణం తక్కువగా నమోదైంది.
 
 
 అంతర్జాతీయం
 బాల్య వివాహాల్లో భారత్‌ది రెండో స్థానం: ఐరాస
 భారతదేశం బాల్య వివాహాల్లో రెండో స్థానంలో ఉందని ఐక్య రాజ్యసమితి నివేదిక వెల్లడించింది. 2000-12 మధ్యలో ఐదేళ్ల లోపున్న బాలల వివరాలు నమోదు చేయని విషయంలో కూడా భారత్ మొదటి స్థానంలో ఉందని ‘బాలల జీవితాల అభివృద్ధి, భవిష్యత్తు మార్పు- 25 ఏళ్లుగా దక్షిణాసియాలో బాలల హక్కులు’ అనే అంశంపై వెల్లడైన యూనిసెఫ్ నివేదిక తెలిపింది. 2000-12 మధ్యలో 71 మిలియన్ల ఐదేళ్లలోపు బాలల వివరాలు భారత్ నమోదు చేయలేదని వెల్లడించింది. బాల్య వివాహాల్లో బంగ్లాదేశ్ తొలి స్థానంలో ఉండగా, భారత్, నేపాల్, అఫ్గానిస్థాన్‌లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
 
 ఆసియాన్‌తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
 ఆసియాన్‌తో సేవలు, పెట్టుబడులకు సంబంధించిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్ సెప్టెంబర్ 8న సంతకం చేసింది. ఆసియాన్ కూటమిలోని బ్రూనై, కాంబోడియా, లావోస్, మలేసియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం దేశాల పార్లమెంట్లు ఈ ఒప్పందాన్ని ఆమోదించాల్సి ఉంది. ఈ ఒప్పందం వల్ల భారత్‌కు ఆర్థిక, విద్య, ఆరోగ్యం, ఐటీ, టెలికమ్యూనికేషన్స్, రవాణా రంగాల్లో ఎక్కువ అవకాశాలు పెరుగుతాయి.
 
 
 అవార్డులు
 ప్రొ. కమల్‌బవాకు
 మిడోరి పురస్కారం
 భారతీయ పర్యావరణ శాస్త్రవేత్త, బోస్టన్‌లోని మసాచుసెట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కమల్ బవా ప్రతిష్టాత్మక మిడోరి-2014 పురస్కారానికి ఎంపికయ్యారు. జపాన్‌కు చెందిన పర్యావరణ ఫౌండేషన్ జీవ వైవిధ్యంలో కృషి చేసిన వారికి ఈ అవార్డును అందిస్తుంది. హిమాలయాల్లో వాతావరణ మార్పులపై పలు పరిశోధనలు చేసినందుకు కమల్‌బవా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన బెంగళూరులోని అశోకా ట్రస్టు ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. బహుమతికి ఎంపికైన వారిలో ఘనా నేషనల్ బయో డైవర్సిటీ కమిటీ చైర్మన్ ఆల్‌ఫ్రెడ్ ఓటెంగ్-యెబోహ, అర్జెంటీనా జాతీయ పరిశోధన మండలి ప్రధాన పరిశోధకుడు బిబియానా విలో కూడా ఉన్నారు. ఈ అవార్డును జపాన్‌లోని అయోన్ ఎన్విరాన్‌మెంటల్ ఫౌండేషన్, కన్వెన్షన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ సెక్రటేరియట్ 2010 నుంచి అందజేసున్నాయి. అవార్డుకు ఎంపికైన వారికి లక్ష డాలర్ల బహుమతి ప్రదానం చేస్తారు. అక్టోబర్ 15న దక్షిణ కొరియాలోని పియాంగ్ చాంగ్‌లో జరిగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్)-12లో పురస్కారాన్ని అందజేస్తారు.
 
 బంగ్లాదేశ్, తూర్పు తైమూర్‌లకు
 ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రజారోగ్య పురస్కారాలు
 ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రజారోగ్య పురస్కారానికి బంగ్లాదేశ్ కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ జాతీయ సలహా కమిటీ చైర్‌పర్సన్ సైమా హుస్సేన్ ఎంపికయ్యారు. దక్షిణాసియాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా అటిజం (నాడీ సంబంధిత వ్యాధి)పై విస్తృత అవగాహన కల్పించినందుకు ఈమెకు ఈ అవార్డు దక్కింది. కాగా తైమూర్ దేశానికి చెందిన జాతీయ మలేరియా నివారణ కార్యక్రమం ప్రాంతీయ విభాగంలో అవార్డుకు ఎంపికయింది. దేశంలో మలేరియాను అరికట్టడానికి చేపట్టిన సమర్థమెన చర్యలకు ఈ గౌరవం లభించింది. సెప్టెంబర్ 10న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఈ అవార్డుల ప్రదానం చేశారు.
 
 ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు
 సాక్షర భారత్ పురస్కారం
 ప్రకాశం జిల్లా కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయ్‌కుమార్ సాక్షర భారత్ - 2014 పురస్కారాన్ని అందుకున్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో సెప్టెంబర్ 8న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. అక్షర విజయం కార్యక్రమం ద్వారా ప్రకాశం జిల్లాలో కేవలం 9 నెలల కాలంలో 4.75 లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దినందుకు జాతీయ సాక్షరతా మిషన్ ఈ పురస్కారానికి ఎంపిక చేసింది.
 
 నీలేకనికి వి.కృష్ణమూర్తి ఎక్స్‌లెన్స్ అవార్డు
 హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ ఆర్గనైజేషన్ డెవలప్
 మెంట్‌ను నెలకొల్పిన వి.కృష్ణమూర్తి ఎక్సలెన్స్ అవార్డు-
 2014కు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, యూఐడీఏఐ మాజీ చైర్మన్ నందన్ నీలేకని ఎంపికయ్యారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య చేతులమీదుగా అవార్డును అందుకున్నారు.
 
 
 రాష్ట్రీయం
 హైకోర్టులో ఐదుగురు శాశ్వత న్యాయమూర్తులు
 తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టులో జస్టిస్ ఎ. రాజశేఖరరెడ్డి, జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ సరసా వెంకట నారాయణ భట్టి, జస్టిస్ ఎ.వి.శేషసాయి, జస్టిస్ చల్లా. కోదండరామ్‌లను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా సెప్టెంబర్ 5న వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు.
 
 తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ  జయంతి
 ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి (సెప్టెంబర్ 9)ని తెలంగాణ భాషా దినోత్సవంగా ఖరారు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సెప్టెంబర్ 9న ప్రకటించారు.  కాళోజీ శత జయంతి వేడుకల్లో భాగంగా వరంగల్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అదేవిధంగా ఇక్కడ నిర్మించనున్న కాళోజీ కళా కేంద్రానికి కూడా శంకుస్థాపన చేశారు.
 
 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొత్త ఎలక్ట్రానిక్స్ విధానం
 ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబ ర్ 9న కొత్త ఎలక్ట్రానిక్స్ విధానం 2014-2020 ప్రకటించింది. ఈ విధానం ద్వారా రూ. 30వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని నిర్ణయించింది.
 
 ఆంధ్రాలో నైపుణ్యాల అభివృద్ధి సంస్థ ఏర్పాటు
 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర నైపుణ్యాల అభివృద్ధి సంస్థ (స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్)ను ఏర్పాటు చేసింది. దీనికి ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డెరైక్టర్‌గా ఐటీ రంగ నిపుణులు గంటా సుబ్బారావును, సంచాలకులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణలను నియమిస్తూ సెప్టెంబర్ 10న ఉత్తర్వులు జారీచేసింది.
 
 
 వార్తల్లో వ్యక్తులు
 ప్రపంచ బ్యాంకు ఈడీగా సుభాష్‌చంద్ర గార్గ్
 భారత్ తరపున ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా సుభాష్‌చంద్ర గార్గ్ సెప్టెంబర్ 10న నియమితులయ్యారు.
 మూడేళ్ల పాటు ఈ హోదాలో కొనసాగుతారు. ఆయన రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.
 
 అస్కి చైర్మన్‌గా నరేంద్ర అంబ్వానీ
 అడ్వర్‌టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (అస్కి) చైర్మన్‌గా ఆగ్రోటెక్ ఫుడ్స్ డెరైక్టర్ నరేంద్ర అంబ్వానీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రకటనలకు ప్రమాణాలు నిర్దేశించే విషయంలో అస్కి కృషి చేస్తుంది.
 
 విద్యావేత్త కీర్తి జోషి మృతి
 విద్యావేత్త, కేంద్ర ప్రభుత్వ మాజీ విద్యా సలహాదారు కీర్తిజోషి (83) పుదుచ్చేరిలో సెప్టెంబర్ 14న మరణించారు. 1976లో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆయనను భారత ప్రభుత్వ విద్యాసలహాదారుగా నియమించింది. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివ ర్సిటీ, పాండిచ్చేరి యూనివర్సిటీ ఏర్పాటు ఆలోచన కీర్తిజోషిదే.
 
 
 సైన్స్ అండ్ టెక్నాలజీ
స్ట్రాటో ఆవరణకు చేరిన
 ఇస్రో శాస్త్రవేత్త సురేశ్‌కుమార్
 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సీనియర్ శాస్త్రవేత్త టి.ఎన్.సురేశ్‌కుమార్ భూ వాతావరణంలో రెండో పొర స్ట్రాటో ఆవరణ వరకు ప్రయాణించారు. దీంతో స్ట్రాటో ఆవరణ చేరిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కారు. ఆయన ఈ ఏడాది ఆగస్టు 15న రష్యాలోని సొకోల్ వైమానిక స్థావరం నుంచి మిగ్-29లో 17,100 మీటర్ల ఎత్తుకు చేరుకున్నారు. ఈ నౌక 45 నిమిషాల్లో 1,850 కి.మీ వేగంతో స్ట్రాటో ఆవరణను చేరింది.  రష్యాలోని కంట్రీ ఆఫ్ టూరిజం లిమిటెడ్ అనే స్పేస్ ట్రావెల్ సంస్థ ద్వారా కుమార్ అంతరిక్ష యాత్రకు వెళ్లారు. ప్రపంచంలో ఈ యాత్ర చేపట్టిన వారిలో కుమార్ 259వ వ్యక్తి. ఎడ్జ్ ఆఫ్ స్పేస్ అనే ఈ యాత్రను ఆరేళ్ల కిందట ప్రారంభించారు.
 
 అగ్ని-1 క్షిపణి పరీక్ష విజయవంతం
 పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అగ్ని-1 క్షిపణిని రక్షణశాఖ సెప్టెంబర్ 10న ఒడిశాలోని బాలాసోర్ వద్ద గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించింది. అణుసామర్థ్యం గల ఈ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయాణిస్తుంది. 700 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. రోడ్డు, రైల్ మొబైల్ లాంఛర్ల నుంచి ప్రయోగించవచ్చు. 1000 కిలోల సంప్రదాయ, అణు ఆయుధాలను మోసుకుపోగలదు. సెకనుకు 2.5 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. 15 మీటర్ల పొడవు గల ఈ క్షిపణి బరువు 12 టన్నులు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement