నేపాల్ ప్రధామంత్రిగా సుశీల్ కొయిరాలా
నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు సుశీల్ కొయిరాలా(75) ఆ దేశ ప్రధాన మంత్రిగా 2014 ఫిబ్రవరి 10న ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో ఆయనకు మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మెజార్టీ లభించింది. సీపీఎన్-యూఎంఎల్ మద్దతుతో ఆయన విజయం సాధించారు. 2008లో నేపాల్‌లో రాజరికం రద్దయ్యాక సుశీల్ కొయిరాలా ఆరో ప్రధానమంత్రి.
బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు
64వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2014 ఫిబ్రవరి 15న బెర్లిన్‌లో ముగిసింది. 11 రోజులపాటు సాగిన ఈ చిత్రోత్సవంలో 400 చిత్రాలను ప్రదర్శించారు. ఇందులో కాంపిటీషన్ కేటగిరీలో 23 చిత్రాలు ఉన్నాయి.
గోల్డెన్ బేర్ అవార్డు గెలుచుకున్న ఉత్తమ చిత్రం: బాయ్ రి యాన్ హూ (బ్లాక్ కోల్, థిన్ ఐస్) చైనా చిత్రం సిల్వర్ బేర్ అవార్డు పొందిన చిత్రం: గ్రాండ్ బుదాఫెస్ట్ హోటల్ ఆడియన్‌స అవార్డు: డి ఫ్రెట్ (ఇథియోపియా చిత్రం)
ఉత్తమ నటుడు: లియావో ఫాన్ (చిత్రం - బ్లాక్ కోల్, థిన్ ఐస్)
ఉత్తమ నటి: హరూ కురోకి (జపాన్ చిత్రం - ద లిటిల్ హౌస్)
ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన చిత్రం హైవే కూడా ఈ చిత్రోత్సవాల్లో
ప్రదర్శితమైంది.
క్రీడలు
కర్ణాటకకు ఇరానీ కప్
క్రికెట్ ఇరానీ కప్‌ను కర్ణాటక గెలుచుకుంది. బెంగళూరులో 2014 ఫిబ్రవరి 12న జరిగిన ఫైనల్స్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియాను కర్ణాటక ఓడించింది. కర్ణాటక చివరగా 1998లో ఈ కప్‌ను గెలుచుకుంది.
ఐ.పి.ఎల్-7లో యువరాజ్‌సింగ్‌కు 14 కోట్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్-7) కోసం బెంగళూరులో 2014 ఫిబ్రవరి 12న జరిగిన వేలంలో యువరాజ్‌సింగ్‌ను బెంగళూరు రూ. 14 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మొత్తం తీసుకున్న తొలి క్రీడాకారుడిగా యువరాజ్‌సింగ్ నిలిచాడు. యువరాజ్ తర్వాత దినేశ్ కార్తీక్ అత్యధిక ధర పలికాడు. కార్తీక్‌ను ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ.12.5 కోట్లకు దక్కించుకుంది. తర్వాత ఇంగ్లండ్‌కు చెందిన కెవిన్ పీటర్సన్‌ను ఢిల్లీ జట్టు రూ. 9 కోట్లకు పొందింది.
ఏఐఎఫ్‌ఎఫ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా సునీల్ ఛెత్రీ
ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్‌ఎఫ్) ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును సునీల్ ఛెత్రీకి 2014 ఫిబ్రవరి 13న ప్రదానం చేశారు. భారత ఫుట్‌బాల్ టీం కెప్టెన్ ఛెత్రీ 2007, 2011లో కూడా ఈ అవార్డును సాధించారు. మహిళా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా ఒయినమ్ బెంబెమ్ దేవి, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా జేజే లాల్‌పెక్‌లు అవార్డులు అందుకున్నారు.
ఫిక్కీ స్పోర్‌ట్స అవార్డులు
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్‌స అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) అవార్డులను న్యూఢిల్లీలో
2014 ఫిబ్రవరి 13న ప్రదానం చేశారు.
స్పోర్‌ట్స పర్సన్ ఆఫ్ ద ఇయర్: దీపికా కుమారి (ఆర్చరీ)
కోచ్ ఆఫ్ ద ఇయర్: బల్దేవ్ సింగ్ (హాకీ)
బ్రేక్‌త్రూ స్పోర్‌ట్స పర్సన్ ఆఫ్ ద ఇయర్: పి.వి. సింధూ (బ్యాడ్మింటన్)
టీం ఆఫ్ ద ఇయర్: ఇండియన్ ఉమెన్‌స ఆర్చరీ టీం
లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు: రాహుల్ ద్రావిడ్
భారత్‌పై నిషేధం ఎత్తివేసిన ఐఓసీ
భారత్ ఒలింపిక్ సంఘం(ఐఓఏ)పై ఉన్న నిషేధాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) 2014 ఫిబ్రవరి 11న ఎత్తివేసింది. ఐఓఏలో ప్రభుత్వ జోక్యం, ఒలింపిక్ చార్టర్‌కు విరుద్ధంగా పదవుల్లో కళంకిత వ్యక్తుల నియామకాలు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఐఓఏపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 2012 డిసెంబర్ 4న నిషేధం విధించింది. 2014 ఫిబ్రవరి 9న ఐఓసీ సూచనల ప్రకారం ఐఓసీ పరిశీలకుల ఆధ్వర్యంలో ఐఓఏకి ఎన్నికలు జరిగాయి. పరిశీలకులు ఇచ్చిన సమాచారంతో తృప్తిపడిన ఐఓసీ భారత్‌పై నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో రష్యాలోని సోచిలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ముగ్గురు భారత క్రీడాకారులు స్వతంత్ర ఆటగాళ్లుగా కాకుండా భారత్ తరఫున ఆడేందుకు వీలుంటుంది. ముగింపు కార్యక్రమంలో భారత్ పతాకంతో పాల్గొంటారు.
ఆర్థికం
17,63,214 కోట్లతో కేంద్ర మధ్యంతర బడ్జెట్ 2014-15 సంవత్సరానికి కేంద్ర ఆర్థికమంత్రి పి. చిదంబరం మధ్యంతర బడ్జెట్‌ను 2014 ఫిబ్రవరి 17న లోక్‌సభకు సమర్పించారు.
ముఖ్యాంశాలు:
మొత్తం బడ్జెట్: రూ. 17,63,214 కోట్లు,
ప్రణాళికేతర వ్యయం: రూ. 12,07,892 కోట్లు
ప్రణాళికా వ్యయం: రూ. 5,55,322 కోట్లు
రెవెన్యూ లోటు: రూ. 3,82,923 కోట్లు
ద్రవ్యలోటు: రూ. 5,28,631 కోట్లు
ప్రాథమిక లోటు: రూ. 1,01,620 కోట్లు
కార్లు, బైకులు, టీవీలు, ఫ్రిజ్‌లపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు
2009 ఏప్రిల్ ముందు నాటి విద్యా రుణాలపై వడ్డీపై మారటోరియం
సైన్యంలో ఒకే హోదాకు ఒకే పింఛను వర్తింపు
శాస్త్ర, సాంకేతిక రంగాలకు తోడ్పడేందుకు రీసెర్‌చ ఫండింగ్ ఆర్గనైజేషన్
{పధాన కేటాయింపులు:
{V>-Ò$-×ాభివృద్ధి: రూ. 82,200 కోట్లు
మానవ వనరుల అభివృద్ధి: రూ. 67,398 కోట్లు
ఆరోగ్యం కుటుంబ సంక్షేమం: రూ. 33,725 కోట్లు
రక్షణ: రూ. 2,24,000 కోట్లు, తాగునీరు, పారిశుధ్యం: రూ. 15,260 కోట్లు
ఆహారం, ఇంధనం, ఎరువుల సబ్సిడీ: రూ. 2,46,397 కోట్లు
ఎస్సీ ఉప ప్రణాళిక: రూ. 48,638 కోట్లు, ఎస్టీ ఉప ప్రణాళిక: రూ. 30,726 కోట్లు
రైల్వేలకు బడ్జెట్ మద్దతు: రూ. 29,000 కోట్లు
2014-15 రైల్వే మధ్యంతర బడ్జెట్
రైల్వేశాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే 2014-15 మధ్యంతర రైల్వే బడ్జెట్‌ను 2014 ఫిబ్రవరి 12న లోక్‌సభలో సమర్పించారు.
73 కొత్త రైళ్లు ప్రకటించారు. ఇందులో జైహింద్ పేరుతో 17 ప్రీమియం రైళ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు రెండు డబుల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రకటించారు. ఇవి కాచిగూడ-తిరుపతి, కాచిగూడ- గుంటూరు మధ్య నడుస్తాయి.
రైల్వేల అభివృద్ధి, ఆధునికీకరణ కోసం ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కోసం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రయాణ, రవాణా చార్జీలను సహేతుకంగా నిర్ణయించడంలో సలహా ఇచ్చేందుకు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న రైల్వే టారిఫ్ అథారిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైల్వే నెట్‌వర్‌కలోకి మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లను తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. కొత్త లైన్లు, డబ్లింగ్‌ల కోసం 24 సర్వేలు చేపడతారు.
బడ్జెట్ స్వరూపం: స్థూల ట్రాఫిక్ వసూళ్లు: 1,60,000 కోట్లు
నిర్వహణ వ్యయం: 1,44,199 కోట్లు, నికర ఆదాయం: 19,655 కోట్లు
డివిడెండ్: 9,117 కోట్లు, నిర్వహణ నిష్పత్తి: 89.9 కోట్లు
మొత్తం మిగులు: 12,728 కోట్లు
జాతీయం
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాజీనామా
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి 2014 ఫిబ్రవరి 14న రాజీనామా చేశారు. శాసనసభ రద్దుకు సిఫార్సు చేశారు. వెంటనే శాసనసభకు ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. దీంతో రాష్ర్టపతి పాలన విధించాలని గవర్నర్ చేసిన సిఫార్సును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. రాష్ర్టపతి ఆమోదంతో ఫిబ్రవరి 17 నుంచి రాష్ర్టపతి పాలన అమల్లోకి వచ్చింది.
జన లోక్‌పాల్ బిల్లును ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టలేకపోవడంతో ఆయన రాజీనామా చేశారు. 70 మంది సభ్యులు ఉన్న సభలో బిల్లును ప్రవేశపెట్టేందుకు 42 మంది వ్యతిరేకించారు. సభలో ఆమ్ ఆద్మీ పార్టీకి 28 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో అరవింద్ కేజ్రీవాల్ 2013 డిసెంబర్ 28న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం 48 రోజులు కొనసాగింది.
న్యూఢిల్లీలో ప్రపంచ ఆగ్రో - ఫారెస్ట్రీ కాంగ్రెస్
న్యూఢిల్లీలో 2014 ఫిబ్రవరి 10న ప్రపంచ అటవీ వ్యవసాయ (ఆగ్రో-ఫారెస్ట్రీ) సమావేశం జరిగింది. అధిక పెట్టుబడులను ఆకర్షించేందుకు అటవీ వ్యవసాయ విధానంలో కొత్త విధానాలు అవలంభించాలని రాష్ర్టపతి సూచించారు. ఈ రంగం పర్యావరణ పరంగా సుస్థిర ఆహార ఉత్పత్తి విధానంగా అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు. వ్యవసాయం, అటవీ పంటలను సమీకృతం చేయడం వల్ల భూమి క్షీణతను అరికట్టడమే కాకుండా గ్రామీణ ప్రజలకు అవసరమైన కలప, వంటచెరకును అందించవచ్చని పేర్కొన్నారు.
రాష్ర్టపతి ఏడు రాష్ట్రాలకు కృషి కర్మణ్ అవార్డులు ప్రదానం చేశారు. 2012-13లో ఆహారధాన్యాల ఉత్పత్తిలో ఉత్తమ పనితీరు కనబరిచిన మధ్యప్రదేశ్, ఒడిశా, మణిపూర్, చత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు ఈ అవార్డులు దక్కాయి.
చిరుధాన్యాల ఉత్పత్తిలో మంచి ఫలితాలను సాధించినందుకు ఆంధ్రప్రదేశ్‌కు కూడా కృషి కర్మణ్ అవార్డు లభించింది. ఈ అవార్డును రాష్ర్టపతి నుంచి రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అందుకున్నారు.
పత్రికా స్వేచ్ఛలో భారత్‌కు 140వ స్థానం
పత్రికా స్వేచ్ఛలో ప్రపంచంలో అత్యంత దయనీయంగా ఉన్న దేశాల సరసన భారత్ చేరింది. పారిస్ కు చెందిన రిపోర్టర్‌స విత్ ఔట్ బోర్డర్‌స 2014 ఫిబ్రవరి 12న విడుదల చేసిన నివేదికలో భారత్‌కు 140వ స్థానం దక్కింది. 180 దేశాల జాబితాలో పాకిస్తాన్ 158, చైనా 175, నేపాల్ 120, అఫ్గానిస్తాన్ 128 స్థానాల్లో ఉన్నాయి. ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలువగా అగ్రరాజ్యం అమెరికా 46 స్థానంలో, బ్రిటన్ 33 స్థానంలో నిలిచాయి. 2013లో భారత్‌లో ఎనిమిది మంది జర్నలిస్టులు, ఒక మీడియా వర్కర్ మరణించినట్లు ఆ నివేదిక పేర్కొంది.
దర్శకుడు బాలు మహేంద్ర మృతి
ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు బాలు మహేంద్ర(75) చెన్నైలో 2014 ఫిబ్రవరి 13న మరణించారు. నెల్లు అనే మలయాళ చిత్రం ద్వారా 1974లో ఛాయాగ్రాహకుడిగా పరిచయమమ్యారు. 27 చిత్రాలకు ఫొటోగ్రఫీ అందించారు. కన్నడ చిత్రం కోకిల ద్వారా దర్శకుడయ్యారు. 22 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా మనవూరి పాండవులు, నిరీక్షణ చిత్రాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్నారు.
ఎయిడ్‌స నియంత్రణ కార్యక్రమం నాలుగో దశ ప్రారంభం
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులామ్ నబీ ఆజాద్ జాతీయ ఎయిడ్‌స నియంత్రణ కార్యక్రమం నాలుగో దశను 2014 ఫిబ్రవరి 12న ప్రారంభించారు. ఇందుకు రూ. 14,295 కోట్లు కేటాయించారు. తొలిసారి ఎయిడ్‌స నియంత్రణకు అంతర్జాతీయ దాతలు, సంస్థలు అందించే నిధుల కంటే ప్రభుత్వం అందించే నిధులు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం ప్రభుత్వ మద్దతు 63 శాతంగా... అంటే రూ. 11,934 కోట్లు ఉంది.
అంతర్జాతీయం కరెంట్ అఫైర్స్
Published Wed, Feb 19 2014 10:18 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement