
కరెంట్ అఫైర్స్
రాష్ట్రీయం
జీవశాస్త్ర విధానాన్ని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్‌లో ఫిబ్రవరి 17-19తేదీల మధ్య మూడు రోజులపాటు బయో ఏషియా-14 సదస్సు జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవశాస్త్ర విధానాన్ని ప్రకటించింది. ఈ విధానం వల్ల రూ. 20వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి.
50 వేల ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయి. రూ.60వేల కోట్ల ఎగుమతులకు అవకాశముంటుంది. జీవ శాస్త్ర రంగాన్ని పారిశ్రామిక రంగం కేటగిరీ కింద పరిగణిస్తారు. ఏక గవాక్ష విధానంలో సంస్థలకు అనుమతులిస్తారు. ఇతర పరిశ్రమలకిచ్చే విద్యుత్ రాయితీలు కల్పిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో విజ్ఞాన కేంద్రాన్ని నెలకొల్పుతారు.
ఉత్తమ వారసత్వ నగరంగా తిరుపతి
కేంద్ర ప్రభుత్వం 2012-13 సంవత్సరానికి ఉత్తమ వారసత్వ నగరంగా తిరుపతిని ఎంపిక చేసింది. తిరుమల-తిరుపతి దేవస్థానం వల్ల తిరుపతికి ఈ గుర్తింపు లభించింది. ఫిబ్రవరి 18న రాష్ట్రపతి నుంచి టీటీడీ అధికారి ఈ అవార్డును అందుకున్నారు. 2010-11లో హైదరాబాద్, 2011-12లో వరంగల్ ఉత్తమ వారసత్వ నగరాలుగా ఎంపికయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ విభజనకు లోక్‌సభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీంతో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడనుంది. రాష్ట్ర విభజనకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ ఫిబ్రవరి 18న ఆమోదం తెలపగా, రాజ్యసభ ఫిబ్రవరి 20న ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోదం లభించిన తర్వాత నోటిఫికేషన్‌లో పేర్కొన్న తేదీ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కొనసాగుతాయి. రాజ్యసభలో బిల్లు ఆమోదం సందర్భంగా రెండు రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధికి పన్ను రాయితీలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలు, పోలవరం ప్రాజెక్టును కేంద్ర నిధులతో పూర్తి చేయడంతోపాటు ఆంధ్రప్రదేశ్ తొలి ఏడాది ఆదాయ లోటు కేంద్ర బడ్జెట్ నుంచి భర్తీ చేస్తామని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటించారు.
ముఖ్యమంత్రి రాజీనామా
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014ను లోక్‌సభ ఆమోదించినందుకు నిరసనగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఫిబ్రవరి 19న తన పదవికి రాజీనామా చేశారు. ఈయన ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రిగా 39 నెలలు పనిచేశారు. 2010 నవంబర్ 25న నాటి ముఖ్యమంత్రి కె.రోశయ్య స్థానంలో ఎన్నికయ్యారు.
క్రీడలు
టెస్ట్ సిరీస్ కివీస్‌దే
భారత్, న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ను ఆతిథ్య న్యూజిలాండ్ గెలుచుకుంది. ఫిబ్రవరి 18న జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగియడంతో మొదటి టెస్టులో విజయం పొందిన కివీస్ విజేతగా నిలిచింది.
నాదల్‌కు రియో టైటిల్
ప్రపంచ నెంబర్‌వన్ రఫెల్ నాదల్ రియో ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. రియో డి జెనెరోలో ఫిబ్రవరి 24న జరిగిన ఫైనల్‌లో ఉక్రెయిన్‌కు చెందిన అలెగ్జాండర్ డొల్గోపోలోను ఓడించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను కురుమీనారా గెలుచుకుంది. ఫైనల్లో క్లారా జెకోపలోవాపై విజయం సాధించింది.
దేవ్ వర్మన్‌కు ఢిల్లీ ఓపెన్ టైటిల్
ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్‌ను భారత్‌కు చెందిన సోమ్‌దేవ్‌వర్మన్ గెలుచుకున్నాడు. ఫిబ్రవరి 23న ఢిల్లీలో జరిగిన ఫైనల్‌లో కజకిస్థాన్‌కు చెందిన అలెగ్జాండర్ నెదోవ్ యెసోవ్‌ను దేవ్ వర్మన్ ఓడించాడు. డబుల్స్ టైటిల్‌ను భారత్‌కు చెందిన సన మ్ సింగ్, సాకేత్ మైనేనీ గెలుచుకున్నారు. ఫైనల్స్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన సాంచయ్, సోన్‌చాట్ రతివతనాలను ఓడించారు.
ఢిల్లీకి హాకీ ఇండియా లీగ్ ట్రోఫీ
హాకీ ఇండియా లీగ్ (హెచ్.ఐ.ఎల్) ట్రోఫీని ఢిల్లీ వేవ్ రైడర్స్ జట్టు గెలుచుకుంది. ఫిబ్రవరి 23న ఢిల్లీలో జరిగిన అంతిమ పోరులో పంజాబ్ వారియర్స్‌ను ఢిల్లీ వేవ్‌రైడర్స్ ఓడించి విజేతగా నిలిచింది.
వింటర్ ఒలింపిక్స్‌లో రష్యాకు అగ్రస్థానం
సోచిలో పదిహేను రోజులపాటు జరిగిన వింటర్ ఒలింపిక్స్ ఫిబ్రవరి 23న ముగిశాయి. ఈ పోటీల్లో ఆతిథ్య రష్యా ఎక్కువ పతకాలను సాధించి అగ్రస్థానంలో నిలిచింది. 13 స్వర్ణపతకాలతో రష్యా ప్రథమస్థానం కైవసం చేసుకుంది. 11 స్వర్ణాలతో నార్వే, 10 స్వర్ణాలతో కెనడా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. భారత్ తరపున పాల్గొన్న ముగ్గురు క్రీడాకారులకు ఒక పతకం కూడా దక్కలేదు. కాగా 2018 వింటర్ ఒలింపిక్స్ దక్షిణకొరియాలోని ప్యాంగ్‌చాంగ్‌లో జరగనున్నాయి.
సీసీఎల్-4 విజేతగా కర్ణాటక
సెలబ్రిటీ క్రికెట్ లీగ్(సీసీఎల్) విజేతగా డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక బుల్డోజర్‌స నిలిచింది. ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లో జరిగిన ఫైనల్స్‌లో కేరళ స్ట్రైకర్‌సను కర్ణాటక ఓడించింది.
జాతీయం
సిక్కింకు జాతీయ పర్యాటక అవార్డు
2012-13 సంవత్సరానికి జాతీయ పర్యాటక అవార్డు సిక్కిం రాష్ట్రానికి లభించింది. గ్రామీణ పర్యాటక ప్రాజెక్టుల అమలులో ఉత్తమ రాష్ట్రంగా సిక్కిం నిలిచింది. కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి శశిథరూర్... సిక్కిం రాష్ట్ర ప్రభుత్వానికి ఫిబ్రవరి 18న న్యూఢిల్లీలో అవార్డును ప్రదానం చేశారు. సిక్కిం రూ. 140 కోట్లతో అనేక పర్యాటక సౌకర్యాలను అభివృద్ధి చేసింది. కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కర్నాటక రాష్ట్రాలతో పర్యాటకులను ఆకర్షించేందుకు ఒప్పందాలు కుదుర్చుకొని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తోంది. ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సంయుక్తంగా నిలిచాయి.
రాజీవ్ హంతకులకు శిక్ష తగ్గింపు
మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న ముగ్గురికి విధించిన మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా తగ్గిస్తూ ఫిబ్రవరి 18న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వారి క్షమాభిక్ష పిటిషన్‌పై 11 ఏళ్లుగా కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడం వల్ల శిక్ష తగ్గిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. క్షమాభిక్ష జాప్యం జరిగినందువల్ల తమ శిక్షను పునస్సమీక్షించాలంటూ నిందితులైన సంతన్, మురుగన్, పెరారివాలన్ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఇదిలాఉండగా ఈ కేసులో శిక్షను అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం ఫిబ్రవరి 19న నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయంపై సుప్రీం స్టే విధించింది. 1991లో రాజీవ్‌గాంధీ హత్య జరిగిన తరువాత 1998లో టాడాకోర్టు దోషులుగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. ఈ శిక్షను 1999లో సుప్రీం ఖరారు చేసింది.
ఒడియా భాషకు ప్రాచీన హోదా
ఒడియా భాషకు ప్రాచీన హోదా కల్పించేందుకు కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 20న ఆమోదం తెలిపింది. దీంతో ఈ హోదా ఉన్న భాషల సంఖ్య ఆరుకు చేరింది. సంస్కృతం, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషలకు ఇప్పటి వరకు ఈ హోదా ఉంది. ఈ హోదా దక్కితే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ఆర్థిక సాయం అందుతుంది. స్కాలర్స్‌కు రెండు అవార్డులు ఏర్పాటు చేసి అందించవచ్చు. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో భాషా పీఠాల ఏర్పాటుకు వీలుంటుంది.
ఆకాశ్ క్షిపణి పరీక్ష విజయవంతం
ఆకాశ్ క్షిపణిని రక్షణ శాఖ ఒడిశాలోని చాందీపూర్ సమీకృత పరీక్షా కేంద్రం నుంచి ఫిబ్రవరి 24న విజయవంతంగా పరీక్షించింది. మానవరహిత విమానం నుంచి వేలాడే లక్ష్యాన్ని ఆకాశ్ ఛేదించింది. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే ఈ క్షిపణిని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఒ.) పూర్తి స్వదీశీ పరిజ్ఞానంతో నిర్మించింది. 25 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే ఈ క్షిపణి 60 కిలోల పేలుడు పదార్థాలను మోసుకుపోతుంది.
విష్ణు నార్లికర్‌కు నాయుడమ్మ అవార్డు
ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్త, పద్మ విభూషణ్ జయంత్ విష్ణు నార్లికర్ 2013 నాయుడమ్మ అవార్డుకు ఎంపికయ్యారు. ఇతర గ్రహాల్లో జీవుల ఉనికిని, అంతరిక్ష రహస్యాలను కనుక్కోవడానికి ఆయ న చేసిన కృషికి గాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు గుంటూరులోని నాయుడమ్మ ట్రస్ట్ ఫిబ్రవరి 22న ప్రకటించింది. మహారాష్ట్రకు చెందిన విష్ణు నార్లికర్‌ను 1965లో పద్మభూషణ్, 2004లో పద్మ విభూషణ్‌తో భారత ప్రభుత్వం గౌరవించింది.
అంతర్జాతీయం
భారత పర్యటనలో బహ్రెయిన్ రాజు
బహ్రెయిన్ రాజు హమద్‌బిన్ ఇసా అల్ ఖలీఫా భారత పర్యటనలో ఫిబ్రవరి 20న ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌తో చర్చలు జరిపారు. వాణిజ్యం, వ్యాపార రంగాల్లో సహకారాన్ని విస్తరించుకొనేందుకు మూడు ఒప్పందాలపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. ద్వైపాక్షిక వాణిజ్యంపై ఇరు దేశాల నాయకులు సమీక్షించారు. భారత కంపెనీలు తమ దేశం లో పెట్టుబడులు పెట్టాలని బహ్రెయిన్ కోరింది.
ఇటలీ ప్రధానిగా మటెనో రెంజీ
ఇటలీ ప్రధానమంత్రిగా మటెనోరెంజీ ఫిబ్రవరి 22న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 16 మంది మంత్రులు కూడా బాధ్యతలు స్వీకరించారు. 39 ఏళ్ల రెంజీ ఇటలీకి అత్యంత పిన్న వయసులో ప్రధాని అయిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. రెంజీ గతంలో ఫ్లోరెన్‌స గవర్నర్‌గా పనిచేశారు.
ఏడీబీ ట్రిబ్యునల్ ప్రెసిడెంట్‌గా లక్ష్మీ స్వామినాథన్
ఫిలిప్పీన్స్‌లోని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) ట్రిబ్యునల్ ప్రెసిడెంట్‌గా భారత్‌కు చెందిన లక్ష్మీ స్వామినాథన్ ఫిబ్రవరి 21న ఎంపికయ్యారు. ఈమె మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఏడీబీ ట్రిబ్యునల్‌కు ఈమె ఏడో అధ్యక్షురాలు. 1992లో ఏడీబీ ట్రిబ్యునల్ ఏర్పాటైన తర్వాత ఈ పదవి భారత్‌కు దక్కడం ఇదే తొలిసారి. 2010లో ట్రిబ్యునల్‌లో సభ్యులుగా నియమితులైన లక్ష్మీ స్వామినాథన్ 2013 ఆగస్టు నుంచి తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవ హ రిస్తున్నారు.