జయక్‌వాడీ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది? | Jayakwadi What is the project? | Sakshi
Sakshi News home page

జయక్‌వాడీ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?

Published Wed, Dec 31 2014 11:14 PM | Last Updated on Sat, Sep 2 2017 7:02 PM

జయక్‌వాడీ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?

జయక్‌వాడీ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?

భారతదేశం - బహుళార్థ సాధక ప్రాజెక్టులు
 ‘ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు’ అని భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అన్నమాట నాటికి, నేటికీ అక్షర సత్యం. మన దేశ ప్రగతిని సరికొత్త మలుపు తిప్పినవి బహుళార్థ సాధక ప్రాజెక్టులే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి దేశంలో మొదటి పంచవర్ష ప్రణాళిక
 (1951) నుంచి వివిధ ప్రాంతాల్లో పలు బహుళార్థ సాధక ప్రాజెక్టులను నిర్మించారు.
     ఒకటి కంటే ఎక్కువ సదుపాయాల కల్పనకు ఉద్దేశించి నిర్మించిన ప్రాజెక్టునే బహుళార్థ సాధక ప్రాజెక్టు అంటారు.
     భారతదేశంలో వ్యవసాయ నీటిపారుదల, గృహ, పరిశ్రమ అవసరాలకు నీటి సరఫరా, విద్యుదుత్పాదన, వరద నివారణ, స్థానిక రవాణా, భూ సంరక్షణ, మత్స్య పరిశ్రమ అభివృద్ధి, విహారయాత్ర, కృత్రిమ వనాల పెంపకం మొదలైన అనేక ప్రయోజనాల కోసం ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు.
     బెంగాల్‌లో 1948లో వరదలను, వాటి అనుబంధ సమస్యలను అదుపు చేయడానికి దామోదర్ నదీ, దాని ఉపనదులపైన ప్రాజెక్టులు కట్టడం కోసం మొట్టమొదటి నదీలోయ ప్రాజెక్టు సంస్థను ఏర్పాటు చేశారు.
     ఈ సంస్థను అమెరికాలోని టెన్నిస్ వేలీ అథారిటీ (టీవీఏ) నమూనా ఆధారంగా ఏర్పాటు చేశారు.
     1948 ఫిబ్రవరి 18న భారత పార్లమెంట్ ఈ సంస్థను ఆమోదించడంతో ఇది దామోదర్ లోయ కార్పొరేషన్ (డీవీసీ)గా వాస్తవ రూపం దాల్చింది.
     డీవీసీ ఏర్పడక ముందు బెంగాల్ దుఃఖదాయినులుగా దామోదర్, దాని ఉపనదులు ఉన్నాయి. తర్వాత వాటిపై ప్రాజెక్టులు నిర్మించడంతో బెంగాల్ వరదాయినులుగా మారాయి.
     భారతదేశంలోని నీటి పారుదల ప్రాజెక్టులను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి...
     1) భారీ నీటిపారుదల పథకాలు
     2) మధ్య తరహా నీటి పారుదల పథకాలు
     3) చిన్న తరహా నీటి పారుదల పథకాలు
     {పాజెక్టు కల్పించే నీటి పారుదల విస్తీర్ణం బట్టి ప్రాజెక్టులను విభజించారు.
 
 1.    భారీ నీటిపారుదల పథకాలు
     10,000 హెక్టార్ల కంటే ఎక్కువ ఆయకట్టు ప్రాంతం ఉన్న పథకాలు.
     వీటిని ప్రధానంగా నదులపై నిర్మిస్తారు.
 2.    మధ్య తరహా నీటిపారుదల పథకాలు
     2,000 నుంచి 10,000 హెక్టార్ల వరకు ఆయకట్టు ప్రాంతం ఉన్న పథకాలు.
     వీటిని నదులపై, ఉపనదులపై నిర్మిస్తారు.
 3.    చిన్న తరహా నీటిపారుదల పథకాలు
     2,000 హెక్టార్ల కంటే తక్కువ ఆయకట్టు గల పథకాలు.
     భూగర్భ జల పథకాలు, ఉపరితల జల పథకాలు ఈ తరహా పథకాల్లోకి వస్తాయి.
     భూగర్భ జల పథకాలు: సాధారణ బావులు, గొట్టపు బావులు.
     ఉపరితల జల పథకాలు: చెరువులు, జలాశయాల నుంచి నీటిని మళ్లించే పథకాలు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు.
 ఆయకట్టు ప్రాంత అభివృద్ధి పథకం
     నీటి పారుదల ఆవశక్యత, ఉత్పత్తి, వినియోగాల మధ్య అంతరాన్ని పూడ్చే ఉద్దేశంతో
 1974-75లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
     భారతదేశంలో 1990లో జాతీయ జల మండలిని ఏర్పాటు చేశారు.
     2008 నవంబర్ 4న గంగానదిని ‘జాతీయ నది’గా ప్రకటించారు.
 
 దేశంలోని కొన్ని ప్రధాన బహుళార్థ సాధక ప్రాజెక్టులు
 1.    భాక్రానంగల్ ప్రాజెక్టు
     ఈ ప్రాజెక్టు దేశంలో నిర్మించిన మొట్టమొదటిది, అన్నిటికంటే పెద్దది.
     దీన్ని భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1962 అక్టోబర్ 22న జాతికి అంకితం చేశారు.
     ఈ ప్రాజెక్టు పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల ఉమ్మడి పథకం. ఈ మూడు రాష్ట్రాలతో పాటు హిమాచల్‌ప్రదేశ్ కూడా లబ్ధి పొందుతోంది.
     సట్లేజ్ నదిపై హిమాచల్ ప్రదేశ్‌లో భాక్రా అనే ప్రాంతంలో భాక్రా ఆనకట్ట (226 మీటర్లు), పంజాబ్‌లోని నంగల్ ప్రాంతం వద్ద నంగల్ ఆనకట్ట(29 మీటర్లు)ను నిర్మించారు.
     ఈ ప్రాజెక్టు 1204 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తుంది.
 
 2.    హీరాకుడ్ ప్రాజెక్టు
     ఈ ప్రాజెక్టును ఒడిశాలో మహానదిపై నిర్మించారు.
     ఈ ప్రాజెక్టు 4801 మీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అతి పొడవైన ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది.
     దీన్ని విద్యుదుత్పాదన, నీటి పారుదల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేశారు.
 
 3.    నాగార్జున సాగర్ ప్రాజెక్టు
     తెలంగాణలోని నల్గొండ జిల్లాలో నందికొండ గ్రామ సమీపంలో కృష్ణానదిపై నిర్మించారు.
     ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ  ఉమ్మడి రాష్ట్రాల పథకం.
     దీనికి భారత తొలి ప్రధాని నెహ్రూ 1955 డిసెంబర్ 10న శంకుస్థాపన చేశారు.
     ఈ ప్రాజెక్టు 1450 మీటర్ల పొడవుతో, రాతి కట్టడపు ఆనకట్టల్లో ప్రపంచంలోనే ప్రథమ స్థానం పొందింది.
     దీని కుడి కాలువను జవహర్ కాలువ అంటారు. ఈ కాలువ 204 కి.మీ. పొడవుఉంది. ఇది గుంటూరు, కృష్ణా జిల్లాలకు నీరు అందిస్తుంది.
     దీని ఎడమ కాలువను లాల్ బహదూర్ కాలువ అంటారు. ఈ కాలువ 179 కి.మీ. పొడవుతో నల్గొండ, ఖమ్మం జిల్లాలకు నీటిని సరఫరా చేస్తోంది.
     ఈ ప్రాజెక్టు పూర్తిగా భారతీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంది.
 
 4.    దామోదర్ నదీలోయ ప్రాజెక్టు
     ఈ ప్రాజెక్టు పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల ఉమ్మడి పథకం.
     ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం బెంగాల్ ప్రాంతాన్ని.. దామోదర్ నది, దాని ఉపనదుల వల్ల వచ్చే వరదల నుంచి కాపాడడం.
     ఈ పథకంలో భాగంగా తిలయ్యా, మైథాన్ ఆనకట్టలు - బరాకర్ నదిపై, పంచట్‌హిట్ ఆనకట్ట - దామోదర్ నదిపై, కోనార్ ఆనకట్ట - కోనార్ నదిపై నిర్మించారు.
 
 5.    బియాస్ పథకం
     ఇది పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల ఉమ్మడి పథకం.
     ఇది బియాస్ జలాలను సట్లేజ్ జలాలతో కలుపుతుంది.
     బియాస్ నదిపై ‘పోంగ్’ వద్ద ఈ ఆనకట్టను నిర్మించారు.
 
 6.    కోసి ప్రాజెక్టు
     దీన్ని బీహార్ - నేపాల్ సరిహద్దులోని హనుమాన్‌నగర్ సమీపంలో ‘కోసి’ నదిపై నిర్మించారు.
     ఇది అంతర్జాతీయ పథకం
 
 7.    గండక్ పథకం
     దీన్ని బీహార్‌లోని వాల్మీకినగర్ వద్ద గండక్ నదిపై నిర్మించారు.
     ఇది బీహార్, ఉత్తరప్రదేశ్, నేపాల్‌ల ఉమ్మడి పథకం.
 
 8.    చంబల్ పథకం
     ఇది మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల ఉమ్మడి పథకం.
     దీన్ని చంబల్ నదిపై నిర్మించారు.
     ఈ పథకంలో మూడు ఆనకట్టలున్నాయి.
     అవి ...
     1) గాంధీసాగర్ ఆనకట్ట
     2) రాణా ప్రతాప్‌సాగర్ ఆనకట్ట
     3) జవహర్ సాగర్ ఆనకట్ట
 
 9.    తెహ్రీడ్యామ్ ప్రాజెక్టు
     ఈ ప్రాజెక్టు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ రాష్ట్రాల ఉమ్మడి పథకం.
     దీన్ని ‘భాగీరథి’ నదిపై హిమాలయ ప్రాంతం(ఉత్తరాఖండ్)లోని భూకంపాలు సంభవించే ప్రదేశంలో నిర్మించడం వల్ల ఇది వివాదాస్పదమైంది.
     తెహ్రీడ్యామ్ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన వ్యక్తి - సుందర్‌లాల్ బహుగుణ.
 
 10.    ఇందిరాసాగర్ ప్రాజెక్టు
     ఇది నర్మద నదిపై ఉంది.
     దీన్ని గుజరాత్‌లోని పూర్ణసా ప్రాంతంలో నిమొరి జిల్లాలో నిర్మించారు.
     ఇది మధ్యప్రదేశ్, గుజరాత్‌ల ఉమ్మడి ప్రాజెక్టు
 
 11.    సర్దార్ సరోవర్ ప్రాజెక్టు
     దీన్ని నర్మద నదిపై, గుజరాత్‌లోని బరూచ్ జిల్లాలో బడగావ్ అనే ప్రాంతంలో
     నిర్మించారు.
     ఇది రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ర్ట, గుజరాత్‌ల ఉమ్మడి ప్రాజెక్టు.
     ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మేథాపాట్కర్ చేపట్టిన ఉద్యమమే- నర్మదా బచావో.
 
 మరికొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు
 
     {పాజెక్టు పేరు    నది    రాష్ట్రాలు    ఇతర అంశాలు
 1.    బాగ్లీహార్ ప్రాజెక్టు    చీనాబ్    జమ్మూ - కాశ్మీర్    భారత్, పాకిస్థాన్‌ల మధ్య
 2.    ధూల్‌హస్తి    చీనాబ్    జమ్మూ - కాశ్మీర్    -వివాదాస్పదమైంది
 3.    నాథ్‌పాజాక్రి    సట్లేజ్    హిమాచల్ ప్రదేశ్    -
 4.    రిహాండ్    రిహాండ్    ఉత్తరప్రదేశ్    -
 5.    రామ్‌గంగా    రామ్‌గంగా    ఉత్తరప్రదేశ్    ఢిల్లీ నగరానికి 200 క్యూసెక్కుల
                         నీటి సరఫరా
 6.    సువర్ణరేఖ    సువర్ణరేఖ    బీహార్    -
 7.    ఫరక్కా    హుగ్లీ    పశ్చిమ బెంగాల్    -
 8.    మయూరాక్షి    మురళీ    పశ్చిమ బెంగాల్    -
 9.    జయక్‌వాడీ    గోదావరి    మహారాష్ర్ట    -
 10.    బాబ్లీ    గోదావరి    మహారాష్ర్ట    -
 11.    ఆల్మట్టి    కృష్ణా    కర్ణాటక    -
 12.    ఇడుక్కి    పెరియార్    కేరళ    -
 13.    శబరిగిరి    పంప    కేరళ    -
 14.    మెట్టూరు    పైకారా    తమిళనాడు    పైకారా నది కావేరి నదికి ఉపనది
 15.    ఉకాయ్    తపతి    గుజరాత్    -
 16.    కాక్రపార    తపతి    గుజరాత్    -
 17. శ్రీరాంసాగర్    గోదావరి    తెలంగాణ    దీని కాలువ కాకతీయ కాలువ.
 దీన్ని నిజామాబాద్ జిల్లాలోని
పోచంపాడు వద్ద నిర్మించారు.
 18.    సుంకేసుల     తుంగభధ్ర    ఆంధ్రప్రదేశ్    కర్నూలు జిల్లాలో ఉంది
 19.    పులిచింతల    కృష్ణానది    ఆంధ్రప్రదేశ్    గుంటూరు జిల్లాలో ఉంది. దీని పేరు కెఎల్.రావు సాగర్
 20.    జంఝావతి    జంఝావతి నది    ఆంధ్రప్రదేశ్    విజయనగరం
 21.    ఎల్లంపల్లి(శ్రీ పాదసాగర్)    గోదావరి    తెలంగాణ    కరీంనగర్
 
 మాదిరి ప్రశ్నలు
 1.    ‘మెట్టూరు జల విద్యుత్ కేంద్రం’ ఏ నదిపై ఉంది?
     1) తుంగభద్ర    2) మహానది
     3) కావేరి    4) గోదావరి
 2.    కిందివాటిలో ‘దామోదర్ వ్యాలీ కార్పొరేషన్’ లో భాగాలైన ఆనకట్టలు ఏవి?
     1) తిలైయా    2) మైథాన్
     3) పంచట్    4) పైవన్నీ
 
 3.    భారతదేశ జాతీయ నది?
     1) గోదావరి    2) గంగా
     3) కృష్ణా    4) నర్మద
 
 4.    ఆల్మట్టి ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?
     1) గోదావరి    2) కృష్ణా
     3) పెన్‌గంగా    4) పూర్ణ
 
 5.    దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు ఒక?
     1) జలవిద్యుత్        2) నీటిపారుదల
     3) బహుళార్థ సాధక    4) ఏదీకాదు
 
 6.    కింది వాటిలో ఏ జల విద్యుత్ కేంద్రం ఉత్తరప్రదేశ్‌లో ఉంది?
     1) మయూరాక్షి    2) రిహాండ్
     3) కంగ్సబతి    4) హీరాకుడ్
 
 7.    అత్యధిక ప్రాజెక్టులను ఏ నదిపై నిర్మించారు?
     1) గోదావరి    2) గంగా
     3) నర్మద    4) కావేరి
 
 8.    భారతదేశంలో కెల్లా అత్యంత ఎత్తై ప్రాజెక్టు?
     1) నాథ్ ప్రాజెక్టు    2) భాక్రా ప్రాజెక్టు
     3) నాగార్జున ప్రాజెక్టు  4) హీరాకుడ్ ప్రాజెక్టు
 
 9.    కిందివాటిలో అంతర్జాతీయ ప్రాజెక్టు?
     1) కోసి    2) చంబల్
     3) తెహ్రీడ్యామ్    4) మయూరాక్షి
 
 10.    {పపంచంలో అతి పెద్ద రాతికట్టడపు ఆనకట్ట ఏది?
     1) భాక్రానంగల్        2) హీరాకుడ్
     3) నాగార్జున సాగర్        4) కోసి
 
 11.    భారతదేశంలో జాతీయ జల మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
     1) 1975    2) 1948      3) 1951    4) 1990
 
 సమాధానాలు
     1) 3;    2) 4;    3) 2;    4) 2;
     5) 3;    6) 2;    7) 3;    8) 2;
     9) 1;    10) 3;    11) 4.
 
 గతంలో వచ్చిన ప్రశ్నలు
 
 1.    ‘సుంకేసుల’ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మిస్తున్నారు?    (కానిస్టేబుల్-2012)
     1) గోదావరి    2) నాగావళి
     3) తుంగభధ్ర    4) పెన్నా
 
 2.    ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాలో జంఝావతి రబ్బర్ డ్యాం ఉంది? (కానిస్టేబుల్-2009)
     1) వరంగల్    2) శ్రీకాకుళం
     3) విశాఖపట్నం    4) విజయనగరం
 
 3.    పులిచింతల ప్రాజెక్టు ఎవరి పేరుతో నిర్మించారు? (కానిస్టేబుల్-2009)
     1) డి. సంజీవయ్య        2) కె.ఎల్.రావు
     3) కోట్ల విజయభాస్కర్ రెడ్డి
     4) జె. చొక్కారావు
 
 4.    ఇందిరాసాగర్ ఆనకట్టను ఏ నదిపై నిర్మించారు?    (కానిస్టేబుల్-2013)
     1) మహానది    2) చంబల్
     3) నర్మద    4) యమున
 
 5.    జపాన్ సహాయంతో పూర్తి చేసిన పైథాన్ (జయక్‌వాడీ) జల విద్యుత్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?(కానిస్టేబుల్ - 2013)
     1) గంగ    2) గోదావరి
     3) నర్మద    4) కావేరి
 
 సమాధానాలు
     1) 3;    2) 4;    3) 2;    4) 3;    5) 2.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement