మీ కిడ్స్ స్మార్ట్ కావాలంటే.. | make your kids so smart | Sakshi
Sakshi News home page

మీ కిడ్స్ స్మార్ట్ కావాలంటే..

Published Mon, Jan 18 2016 12:02 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

మీ కిడ్స్ స్మార్ట్ కావాలంటే.. - Sakshi

మీ కిడ్స్ స్మార్ట్ కావాలంటే..

తమ పిల్లలు అన్నింట్లోనూ రాణించాలని ప్రతి తల్లిదండ్రీ కోరుకుంటారు. అన్ని అంశాల్లోనూ విపరీతమైన పోటీ నెలకొన్న ఈ రోజుల్లో పిల్లలను చిన్నప్పటినుంచే తగిన రీతిలో తీర్చిదిద్దడం చాలా అవసరం. ముఖ్యంగా ఇది స్మార్ట్ యుగం కాబట్టి వారిని మరింత స్మార్ట్ కిడ్స్‌గా మార్చాలి. చిన్నప్పటి నుంచే వారిపై శ్రద్ధపెట్టి సరైన స్థాయిలో రాణించేలా చూడాలి. ఈ విషయంలో పిల్లల్ని స్మార్ట్ కిడ్స్‌గా మార్చేందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం...
 
క్రీడల్లో ప్రవేశం..

పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యం. ఆటల వల్ల వారికి మంచి ఆరోగ్యం సమకూరుతుంది. ఆరోగ్యంగా ఉన్న పిల్లలే చదువులోనూ రాణించేందుకు వీలుంటుంది. అందుకే మీ పిల్లల్ని క్రీడల దిశగా ప్రోత్సహించండి. చిన్నప్పటినుంచి కనీసం ఒక్క క్రీడలోనైనా ప్రవేశం ఉండేలా చూడండి. ఆటలతో శరీరం దృఢంగా తయారవుతుంది. దీంతో వారు సరిగ్గా ఎదుగగలుగుతారు. ఆటలు ఆడిన తర్వాత కానీ, వ్యాయామం చేసిన తర్వాత కానీ పిల్లలు కొత్త పదాల్ని 20 శాతం త్వరగా నేర్చుకుంటారని పలు పరిశోధనల్లో వెల్లడైంది. క్రీడలతో పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. గ్రూప్‌తో కలిసి సమన్వయంతో ఎలా విజయం సాధించవచ్చో వారు తెలుసుకోగలుగుతారు. నాయకత్వ పటిమ, పోరాట పటిమ కూడా పెరిగేందుకు క్రీడలు తోడ్పడతాయి.

ఒక హాబీ తప్పనిసరి..

చిన్నప్పటినుంచే ఏదైనా ఒక హాబీని వారికి తప్పనిసరిగా అలవాటు చేయండి. మ్యూజిక్, డాన్స్, పెయింటింగ్, మార్షల్ ఆర్ట్స్.. ఇలాంటి హాబీ ఏదైనా సరే వారిలో సృ జనాత్మక శక్తి పెరిగేందుకు ఉపకరిస్తుంది. మంచి హాబీలు కలిగి ఉన్న పిల్లలు చదువుతో పాటు ఇతర అంశాల్ని త్వరగా నేర్చుకోగలుగుతారు. వీటితో ఎన్నో మానసిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.  పిల్లలు హాబీగా మొదలు పెట్టినా అంశంలోనే వారు రాణించి కీర్తి ప్రతిష్టలు పొందే వీలుంది. బాల్యంలో హాబీగా మొదలెట్టిన అంశాలతోనే ప్రపంచ గుర్తింపు పొందినవారు చరిత్రలో ఎందరో ఉన్నారు. పిల్లల్ని కేవలం చదువుకే పరిమితం చేయకుండా వారికి ఏదైనా ఒక ప్రయోజనకరమైన హాబీని అలవర్చండి. ఈ హాబీల వల్ల పిల్లల ఖాళీ సమయం కూడా సద్వినియోగం అవుతుంది.
 
చాలినంత నిద్ర..

మీ చిన్నారుల్ని వారికి తగినంత సమయం నిద్రపోనివ్వండి. ఎందుకంటే నిద్రతో అనేక ప్రయోజనాలున్నాయి. చాలినంత నిద్ర పోవడం వల్ల పిల్లల మెదడు సక్రమంగా, సరైన స్థాయిలో ఎదుగుతుందని పలు పరిశోధనల్లో తేలింది. నిద్ర విషయంలో చిన్నారులకు స్వేచ్ఛనివ్వండి. వ్యాయామం, ఆహారం లాగే నిద్ర కూడా ఆరోగ్యానికి చాలా అవసరం. మెదడు సరిగ్గా పనిచేసేందుకు, త్వరగా నేర్చుకునేందుకు నిద్ర ఉపయోగపడుతుంది.

ఆసక్తిని ప్రోత్సహించండి..

మనం క్రీడల్ని, చదువుని, ఇతర హాబీల్ని వారికి తప్పనిసరిగా నేర్పించేందుకు ప్రయత్నిస్తాం. అందులో తప్పులేదు కానీ వారు మరేదైన అంశంపై ఆసక్తి చూపిస్తున్నారేమో గమనించండి. మనం సూచించిన మార్గంలోనే కాకుండా, వారికి నచ్చిన మార్గంలో వెళ్లేందుకు కూడా వారిని ప్రోత్సహించండి. వాళ్లు ఆసక్తి కనబరిచిన రంగం ఏదైనా మీరు తగిన ప్రోత్సాహం అందిస్తే అందులోనే వారు మరింతగా రాణించే వీలుంది. అది మీకు గతంలో సంబంధం లేని రంగమైనా సరే ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించే వీలుంది.
 
సంతోషమే సగం భలం..

పిల్లలు సంతోషంగా ఉన్నప్పుడే ఏ విషయాన్నైనా త్వరగా నేర్చుకోగలుగుతారు. మీ పిల్లల్ని మీరు వీలైనంత సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించండి. అతిగా బెదిరించడం, ఆంక్షలు విధించడం సరికాదు. వారి ఆలోచనల్ని గౌరవించండి. ఎక్కువ సమయం మీ చిన్నారులతో గడిపేందుకోసం ప్రయత్నించండి. తల్లిదండ్రుల సాంగత్యం, ప్రేమాభిమానాలు చిన్న వయసు పిల్లల మెదడుపై విపరీతమైన ప్రభావం చూపిస్తాయి. పిల్లల్లో సానుకూల, ఆశావహ దృక్పథం ఏర్పడేందుకూ కారణమవుతుంది. ఎప్పడూ ఆనందంగా ఉండే పిల్లలే చదువులో ఎక్కువగా రాణిస్తున్నారు. కుటుంబ సభ్యులతో సరైన సంబంధాలు కలిగినవారు మంచి విద్యార్థులుగా పేరు తెచ్చుకుంటున్నారు.

వారితోపాటే చదవండి..
మీ పిల్లల్ని చదవమని చెప్పి మీరు మాత్రం టీవీ చూస్తూనో, మరో పని చేస్తూనే ఉంటే ప్రయోజనం ఉండదు. మీ పిల్లలు చదువుకునే సమయంలో వీలైనంత వరకు వారికి దగ్గర్లోనే ఉండండి. మీరు ఏదైనా న్యూస్ పేపరో, పుస్తకమో చదువుతుంటే వాటివైపు మీ పిల్లలు తొంగిచూస్తూ అందులోని అంశాల గురించి, కొత్త పదాల గురించి ఆసక్తిగా అడుగుతారు కదూ! మీరు ఇలా చేయడం వల్ల వారిలో చదువుపై ఆసక్తి పెంచిన వారవుతారు. మీ పిల్లల్తోపాటే మీరు కూడా ఏదైనా చదువుకునేలా చూడండి. అలాగే వారికొచ్చే సందేహాల్ని నివృత్తి చేయండి. దీనివల్ల వారు చదువును భారంగా కాకుండా, ఆసక్తిగా ఫీలవుతారు.

సాక్షి, స్కూల్ ఎడిషన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement