నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ).. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రతి ఏటా నిర్వహించే ‘నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్‌టీఎస్‌ఈ, మొదటి దశ) 2013-14 కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న సమయంలో ప్రిపరేషన్ తదితర అంశాలపై ఫోకస్..
అర్హత:
ప్రస్తుత విద్యా సంవత్సరం (2013-14)లో ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో పదో తరగతి చదువుతుండాలి. ఎనిమిదో తరగతిలో ఎన్‌టీఎస్‌ఈ స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన విద్యార్థులు మాత్రం ఈ పరీక్షకు అనర్హులు.
స్కాలర్‌షిప్:
దేశ వ్యాప్తంగా నిర్వహించే రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసిన 1,000 మంది విద్యార్థులకు 11వ తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు నెలకు రూ.500 స్కాలర్‌షిప్‌ను అందజేస్తారు. ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్‌మెంట్, లా వంటి ప్రొఫెషనల్ కోర్సులకు మాత్రం పోస్ట్‌గ్రాడ్యుయేషన్ (second degree level) వరకు ఈ సౌకర్యం కల్పిస్తారు. ప్రభుత్వ నిబంధనలకనుగుణంగా రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఎంపిక విధానం:
రెండు దశల్లో నిర్వహించే రాత పరీక్ష ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. విద్యార్థి ఆస్తకిని బట్టి తెలుగు/ఇంగ్లిష్/ ఉర్దూ/ హిందీలలో.. ఏదైనా ఒక మాధ్యమాన్ని పరీక్ష కోసం ఎంచుకోవచ్చు. మొదటి దశ పరీక్ష రాష్ట్ర స్థాయిలో ఉంటుంది. ఈ దశను మన రాష్ట్రంలో డెరైక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్-హైదరాబాద్ నిర్వహిస్తుంది. ఇందులో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (మ్యాట్), స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సాట్) అనే రెండు విభాగాలు ఉంటాయి. రెండో దశను జాతీయ స్థాయిలో ఎన్‌సీఈఆర్‌టీ నిర్వహిస్తుంది. ఈ దశ కూడా మ్యాట్, సాట్ విభాగాల్లోనే ఉంటుంది. దేశ వ్యాప్తంగా దాదాపు నాలుగు వేల మంది విద్యార్థులకు (రాష్ట్రాల వారీగా ఇంత మంది విద్యార్థులు అనే కోటా నిబంధన మేరకు) మాత్రమే ఈ దశ కోసం అవకాశం కల్పిస్తారు.
కొత్తగా లాంగ్వేజ్ టెస్ట్:
గతంతో పోల్చితే ప్రస్తుత సంవత్సరం నుంచి ఎన్‌టీఎస్‌ఈ నిర్వహణ విధానంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో మ్యాట్ విభాగంలో 90 ప్రశ్నలు, సాట్‌లో 90 ప్రశ్నలు ఇచ్చేవారు. కానీ విద్యార్థుల భాష సామర్థ్యాన్ని పరీక్షించే ఉద్దేశంతో ఈసారి లాంగ్వేజ్ టెస్ట్ అనే విభాగాన్ని కొత్తగా చేర్చారు. మ్యాట్ విభాగంలో ప్రశ్నల సంఖ్యను 90 నుంచి 50కి తగ్గించారు. లాంగ్వేజ్ విభాగం నుంచి 40 ప్రశ్నలు ఇవ్వనున్నారు. సాట్ విభాగానికి సంబంధించి ఎటువంటి మార్పులు లేవు.
తేడా: మొదటి దశ మ్యాట్, సాట్‌లో రాష్ట్ర స్థాయి బోర్డులు 9, 10 తరగతులకు నిర్దేశించిన సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి (9వ తరగతి సిలబస్ మారినప్పటికీ.. పాత సిలబస్ ఆధారంగానే ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు). ఇందులో అర్హత సాధించిన విద్యార్థులను మాత్రమే రెండో దశకు అనుమతి ఇస్తారు. మొదటి దశతో పోల్చితే రెండో దశలో ప్రశ్నల క్లిష్టత పెరుగుతుంది. ఈ దశలో సీబీఎస్‌ఈ, ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఇస్తారు. ఇక్కడ గమనించాల్సిన అంశం నిర్ణీత సిలబస్ అంటూ ఏమి ఉండదు. దాన్ని ఆధారంగా చేసుకుని అప్లికేషన్ పద్ధతిలో మాత్రమే ప్రశ్నలు ఇస్తారు.
మ్యాట్:
ఇది విద్యార్థి ఆలోచనా శక్తిని, నైపుణ్యాలను పరీక్షించే విభాగం. అంతేకాకుండా మిగతా విభాగాలు అకడమిక్ నేపథ్యంతో ఉంటాయి. కాబట్టి ఇందులో సాధించిన మార్కులే రెండో దశకు అర్హత సాధించడంలో కీలకపాత్ర పోషిస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ఈ విభాగంపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఈ విభాగంలో విశ్లేషణ సామర్థ్యం, రెండు అంశాల మధ్య తేడాను గుర్తించే నేర్పు, నిర్ణయాత్మక సామర్థ్యం, విచక్షణ భావనల ఆధారంగా ప్రశ్నలను రూపొందిస్తారు. ఈ క్రమంలో కోడింగ్-డికోడింగ్, అనాలజీస్, క్లాసిఫికేషన్, సిరీస్, బ్లాక్ అసెంబ్లీ, హిడెన్ ఫిగర్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్యాట్రన్ పర్‌సెప్షన్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇటువంటి అంశాలు మనకు సిలబస్‌లో ఉండవు. కాబట్టి ప్రాక్టీస్ ద్వారానే ఇందులో పట్టు సాధించడం సాధ్యం. మార్కెట్లో లభించే ప్రామాణిక మెటీరియల్‌లోని నమూనా ప్రశ్నలను వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఉదాహరణకు ఈ విభాగంలో ఒక ప్రశ్నను పరిశీలిస్తే..
లాంగ్వేజ్ టెస్ట్:
విద్యార్థిలోని భాష సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగం లాంగ్వేజ్ టెస్ట్. ఇందులో ఎంచుకున్న భాషకు సంబంధించి తార్కిక విశ్లేషణ, రీడింగ్ కాంప్రెహెన్షన్, వ్యాఖ్యానం చేసే నేర్పు, అంచనా వేసే సామర్థ్యం ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. ఈ క్రమంలో రీడింగ్ కాంప్రెహెన్షన్, వాక్యాలను వరుస క్రమంలో రాయడం, ఖాళీలను పూరించడం (ఫిల్ ఇన్ ది బ్లాంక్స్), తప్పులను సరిదిద్ది వాక్యాలను తిరిగి రాయడం, సరైన ఫ్రేజెస్‌ను ఉపయోగించి అసంపూర్తిగా ఉన్న వాక్యాలను పూరించడం వంటి ప్రశ్నలు వస్తూంటాయి. ఈ విభాగాన్ని విద్యార్థి ఆసక్తిని బట్టి తెలుగు/ఇంగ్లిష్/ఉర్దూ భాషలో రాసే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకు ఈ విభాగానికి సంబంధించి ఇంగ్లిష్‌లో ఒక ప్రశ్నను పరిశీలిస్తే..
సాట్:
సాట్‌లో సెన్సైస్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ), మ్యాథమెటిక్స్, సోషల్ సెన్సైస్ (భౌగోళిక శాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, ఆర్థిక శాస్త్రం) నుంచి ప్రశ్నలు వస్తాయి.
సెన్సైస్‌కు సంబంధించి 35 ప్రశ్నలు ఇస్తారు. వీటిల్లో భౌతిక శాస్త్రం-12, రసాయన శాస్త్రం-11, జీవ శాస్త్రం-12 ప్రశ్నలు వస్తాయి.
మ్యాథమెటిక్స్ నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు.
సోషల్ సెన్సైస్ నుంచి 35 ప్రశ్నలు వస్తాయి. ఇందులో భౌగోళికశాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం నుంచి 10 ప్రశ్నలు చొప్పున, ఆర్థికశాస్త్రం నుంచి 5 ప్రశ్నలు వస్తాయి.
సాట్ విభాగంలో సైన్స్, మ్యాథమెటిక్స్‌ల నుంచి అడిగే ప్రశ్నల్లో కనీసం 15 శాతం ప్రశ్నలు అడ్వాన్స్‌డ్‌గా ఉంటాయి. వీటిని సాధించడానికి అప్లికేషన్ సామర్థ్యం అవసరమవుతుంది. ఇందుకోసం సీబీఎస్‌ఈ 9, 10 తరగతుల్లోని పుస్తకాల్లో ఉండే అడ్వాన్స్‌డ్ ప్రాబ్లమ్స్‌ను సాధించాలి.
ఉదాహర ణకు మ్యాథమెటిక్స్‌లోని ఒక ప్రశ్నను పరిశీలిస్తే..
సోషల్ స్టడీస్ విషయానికొస్తే మొదటి దశ కోసం హిస్టరీ, సివిక్స్, జాగ్రఫీ, ఎకనామిక్స్‌లోని అంశాలపై కనీస అవగాహన సరిపోతుంది. ఇందుకోసం రాష్ట్ర స్థాయి పుస్తకాలను చదవడం ద్వారా మెరుగైన స్కోర్ సాధించవచ్చు. రెండో దశకు మాత్రం విస్తృత స్థాయి పరిజ్ఞానం అవసరం. వివిధ అంశాలను మన దేశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రిపరేషన్ సాగించాలి. ఈ దశ కోసం పూర్తిగా ఎన్‌సీఆర్‌టీఈ 9, 10 తరగతులకు నిర్దేశించిన పుస్తకాల్లోంచి ప్రశ్నలు ఇస్తారు.
ఉదాహర ణకు సోషల్ స్టడీస్‌లోని ఒక ప్రశ్నను పరిశీలిస్తే..
ప్రిపరేషన్ ఇలా
సాట్ కూడా విద్యార్థిలోని నైపుణ్యాలనే ప్రధానంగా పరీక్షిస్తుంది. సిలబస్‌లోని అంశాలను ఏవిధంగా అన్వయించుకోగలుగుతున్నారనే అంశాన్ని ఆధారంగా చేసుకుని ఇందులోని ప్రశ్నలను రూపొందిస్తారు. ఈ పరీక్షలో మెరుగైన మార్కులు సాధించాలంటే విశ్లేషణ సామర్థ్యాన్ని పెంచుకోవాలి.
సబ్జెక్ట్‌లోని మూల భావనలపై పట్టు సాధించడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. ఇచ్చిన సమస్యకు సూత్రాలు, భావనల ఆధారంగా సాధించడానికి ప్రయత్నించాలి. ఒక సమస్యకు సదరు పద్ధతి ఎందుకు సరిపోతుంది? మిగిలినవి ఎందుకు సరిపోవు? అనే కోణంలో ఆలోచిస్తూ సాధ్యమైనన్నీ పరిష్కార మార్గాలను కనుక్కోవడానికి ప్రయత్నించాలి.
ముఖ్యమైనవి అంటూ కొన్ని పాఠ్యాంశాలకు పరిమితం కాకుండా అన్ని అంశాలకు సమప్రాధాన్యత ఇవ్వాలి. 9, 10 తరగతుల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటికి వెయిటేజీ 40:60 నిష్పత్తిలో ఉండే అవకాశం ఉంది. అంటే పదో తరగతికి ఎక్కువ వెయిటేజీ లభించవచ్చు.
మొదట 10వ తరగతి సిలబస్‌ను పూర్తి చేయాలి. తర్వాత 9వ తరగతి అంశాలను ప్రాక్టీస్ చేయాలి.
మ్యాట్ కొద్దిగా కష్టం. కాబట్టి మిగతా వాటితో సమాంతరంగా మ్యాట్ విభాగం ప్రిపరేషన్ కోసం కొంత సమయం కేటాయించడం మంచిది.
పుస్తకాల్లో అధ్యాయాల చివర ఉన్న ప్రశ్నలు, బిట్స్‌ను తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. వేగంగా సాధించే నేర్పు పెంచుకోవాలి. అంతేకాకుండా వీలైనన్నీ మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం మంచిది.
రిఫరెన్స్ బుక్స్: సంబంధిత సబ్జెక్ట్‌ల రాష్ట్ర స్థాయి, సీబీఎస్‌ఈ, ఎన్‌సీఆర్‌టీఈ పుస్తకాలు.
దరఖాస్తు విధానం
ఎన్‌సీఈఆర్‌టీ లేదా డెరైక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్‌స(ఛట్ఛ్చఞ) వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుపై విద్యార్థులు చదువుతున్న స్కూల్ ప్రిన్సిపల్ సంతకం తప్పనిసరి. దరఖాస్తును స్థానిక లైజన్ ఆఫీసర్ లేదా సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి నుంచి కూడా పొందొచ్చు. ఫీజు: రూ. 100. దీన్ని డీడీ రూపంలో చెల్లించాలి. డీడీని ఎస్‌బీహెచ్/ఎస్‌బీఐలో ‘‘ది సెక్రటరీ, టు ది కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్’’ పేరిట తీయాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ:
సెప్టెంబర్ 7, 2013 (వాస్తవానికి ఆగస్టు 31తో ముగిసిన గడువును పొడిగించారు).
మొదటి దశ రాత పరీక్ష తేదీ: నవంబర్ 17, 2013.
రెండో దశ రాత పరీక్ష తేదీ: మే 11, 2014.
వివరాలకు: www.ncert.nic.in, www.bseap.org