కొత్త కొలువులు @ సైబర్ లా | New Jobs in cyber law | Sakshi
Sakshi News home page

కొత్త కొలువులు @ సైబర్ లా

Published Thu, Sep 5 2013 2:11 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

New Jobs in cyber law


 నా బ్యాంకు ఖాతాలోంచి రూ. 30 వేలు
 మాయమయ్యాయి!
 - ఓ కార్పొరేట్ సంస్థ ఉద్యోగి ఆవేదన
 
 ఎవరో నా పేరుతో ‘ఫేస్‌బుక్’లో నకిలీ అకౌంట్ తెరిచారు!
 - ఓ బాలీవుడ్ హీరోయిన్ ఫిర్యాదు
 
 నా ఈ-మెయిల్‌కు అసభ్యకర ఫొటోలు పంపిస్తున్న వారిని పట్టుకోండి!
 - ఓ కాలేజీ యువతి విజ్ఞప్తి
 
 ‘సైబర్ లాస్’ కెరీర్‌లో రాణించాలంటే అవసరమైన స్కిల్స్
 
 సమస్యను విశ్లేషించి, పరిష్కార మార్గాలను సూచించగలగడం.
 సైబర్ స్పేస్‌కు సంబంధించిన జాతీయ, అంతర్జాతీయ చట్టాలపై అవగాహన.
 
 ఎప్పటికప్పుడు టెక్నాలజీలో వస్తున్న మార్పులను ఒంటబట్టించుకోవడం.
 
 ఇప్పుడు ఇలాంటి కేసులెన్నో పోలీసుల ముందుకు వస్తున్నాయి. రోజురోజుకూ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య పెరుగుతుండటం, నెట్ ఆధారిత సేవలు విస్తరిస్తుండటంతో సైబర్ నేరాలు, వివాదాలు అధికమవుతున్నాయి. దీంతో సైబర్ న్యాయ నిపుణుల అవసరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘సైబర్ లా’ తో కెరీర్ ఆప్షన్స్‌పై స్పెషల్ ఫోకస్..
 
 ఇంటర్నెట్‌కు సంబంధించిన వర్చువల్ ప్రపంచమే ‘సైబర్ స్పేస్’. దీనికి సంబంధించిన చట్టాలే సైబర్ లాస్.. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ఇంటర్నెట్ ఆధారిత సేవలు బాగా విస్తరిస్తున్నాయి. ఈ-బిజినెస్, ఈ-గవర్నెన్స్, ఈ-ప్రొక్యూర్‌మెంట్.. ఇలా వివిధ రకాల కార్యకలాపాలు సాగుతున్నాయి. ఇలా వివిధ రూపాల్లో ప్రపంచ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని దుర్వినియోగపరిచే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. క్రెడిట్ కార్డు, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్ తదితరాలకు సంబంధించిన మోసాలతో పాటు హ్యాకింగ్, బ్లాక్ మెయిలింగ్, పోర్నోగ్రఫీ వంటి అనైతిక కార్యకలాపాలు బయటపడుతున్నాయి.
 
 భారత్ పరిస్థితి:
 ఒక్క భారత్‌లోని పరిస్థితిని గమనిస్తే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం 2011లో ఐటీ చట్టం కింద 1,791 సైబర్ నేరాల కేసులు నమోదు కాగా, 2012లో ఈ సంఖ్య 2,876కు చేరింది. ఇలా దేశంలో ఏటికేడు పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. సాంకేతిక మౌలిక వసతులను మెరుగుపరచుకోవాలని, సైబర్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని, నేరాల గుర్తింపు, నమోదు, పరిశోధన, ప్రాసిక్యూషన్‌లకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించినట్లు ఇటీవల కేంద్రం తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో సైబర్ న్యాయ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. సైబర్ లాస్ సంబంధిత కోర్సులు పూర్తిచేసిన వారికి మంచి అవకాశాలుంటున్నాయి.
 
 సైబర్ లాస్-కోర్సులు:
 దేశంలో సైబర్ లాస్‌కు సంబంధించి డిప్లొమా, పీజీ డిప్లొమా వంటి కోర్సులతో పాటు పీజీ స్థాయి కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా ‘పీజీ డిప్లొమా ఇన్ సైబర్ లాస్’ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని లా డిపార్ట్‌మెంట్ కూడా సైబర్ లాస్‌లో పీజీ డిప్లొమాను ఆఫర్ చేస్తోంది. 60 సీట్లు నాన్ స్పాన్సర్డ్ అభ్యర్థులకు, 20 సీట్లు స్పాన్సర్డ్ అభ్యర్థులకు కేటాయించారు.
 
 పుణేలోని ఏషియన్ స్కూల్ ఆఫ్ సైబర్ లాస్.. డిప్లొమా ఇన్ సైబర్ లా, అడ్వాన్స్‌డ్ ప్రోగ్రామ్ ఇన్ సైబర్ లాస్, పీజీ ప్రోగ్రామ్ ఇన్ సైబర్ లాస్ వంటి కోర్సులను ఆఫర్ చేస్తోంది.
 రెగ్యులర్‌తో పాటు దూరవిద్య ద్వారా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కొన్ని సంస్థలు ఆన్‌లైన్ విధానంలో కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
 
 కోర్సులో చేరాలంటే:
 డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు గ్రాడ్యుయేషన్‌ను అర్హతలుగా నిర్దేశిస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరాలంటే ఎల్‌ఎల్‌బీ డిగ్రీ ఉండాలి. కొన్ని విద్యా సంస్థలు నేరుగా ప్రవేశాలు కల్పిస్తుండగా, మరికొన్ని ఎంట్రెన్స్ పరీక్షలో ప్రతిభను పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
 
 రాష్ట్రంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయం.. పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో కరెంటు అఫైర్స్; కామర్స్, సైన్స్, ఆర్ట్స్; లా అవేర్‌నెస్‌లపై ప్రశ్నలు ఉంటాయి.
 
 కోర్సులో బోధించే అంశాలు:
 సైబర్ న్యాయ నిపుణులుగా రాణించాలంటే లాతో పాటు టెక్నాలజీకి సంబంధించిన అంశాలపైనా పరిజ్ఞానం సంపాదించడం అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకొని కరిక్యులంను రూపొందిస్తున్నారు. లా, టెక్నాలజీలకు సంబంధించిన అంశాలు; లా ఆఫ్ డిజిటల్ కాంట్రాక్ట్స్; సైబర్ స్పేస్‌లో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ; నెటిజన్ల హక్కులు; ఈ-గవర్నెన్స్; ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం; సైబర్ చట్టాలు (జాతీయ, అంతర్జాతీయ); కాపీరైట్, పేటెంట్‌లు, ట్రేడ్‌మార్క్స్, డేటా బేస్ వంటి అంశాలను బోధిస్తారు.
 
 నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా.. సైబర్ లా పీజీ డిప్లొమా కోర్సు కరిక్యులంలో కొన్ని అంశాలు...
 డిఫైనింగ్ సైబర్ స్పేస్, జ్యురిస్‌డిక్షన్ ఇన్ సైబర్ స్పేస్.
 అండర్‌స్టాండింగ్ ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్స్.
 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్స్.
 సైబర్ కాంట్రాక్ట్స్ అండ్ ఇండియన్ లీగల్ పొజిషన్.
 అండర్‌స్టాండింగ్ కాపీరైట్ ఇన్ ఐటీ.
 లీగల్ ఇష్యూస్ ఇన్ ఇంటర్నెట్ అండ్ సాఫ్ట్‌వేర్ కాపీరైట్.
 పేటెంట్స్, ట్రేడ్‌మార్క్స్, డేటాబేసెస్.
 ఈ-కామర్స్, ఈ-బ్యాంకింగ్, సైబర్ క్రైమ్స్, ఇంటర్నెట్ గవర్నెన్స్.
 
 అదనపు అర్హతతో ఉత్తమ కెరీర్:
 ఇప్పటికే న్యాయవాద వృత్తిలో ఉన్నవారు సైబర్ లాస్ కోర్సుల్లో చేరి ఉన్నత కెరీర్ దిశగా అడుగులు వేయొచ్చు. ఇదే విధంగా సైబర్ లాస్ కోర్సులను దిగ్విజయంగా పూర్తిచేసి ఉన్నత భవిష్యత్‌కు బాటలు వేసుకునేందుకు అవకాశమున్న వారు మరికొందరు కూడా ఉన్నారు.
 వారు..
 ఐటీ స్టూడెంట్స్, ఐటీ ప్రొఫెషనల్స్.
 పోలీస్ అండ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.
 ఐటీ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్.
 నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్స్.
 మేనేజ్‌మెంట్ స్టూడెంట్స్ అండ్ ప్రొఫెషనల్స్.
 చార్టర్డ్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్.
 కామర్స్ స్టూడెంట్స్.
 
 కెరీర్ అవకాశాలు:
 సైబర్ లాస్ కోర్సులను దిగ్విజయంగా పూర్తిచేసిన వారికి వివిధ కెరీర్ అవకాశాలు ఆహ్వానం పలుకుతాయి. సైబర్ నేరాలు పెరుగుతుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. దీంతో సైబర్ లాస్ కోర్సులు పూర్తిచేసిన వారికి వివిధ సంస్థలు ఉద్యోగాలను అందుబాటులో ఉంచుతున్నాయి.
 అవి:
 శాంతిభద్రతలు, నిఘా విభాగాలు.
 ఐటీ సంస్థలు, కార్పొరేట్ హౌస్‌లు.
 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు.
 న్యాయ సేవల సంస్థలు.
 టెక్నాలజీ సంబంధిత సంస్థలు.
 లా స్కూల్స్, విశ్వవిద్యాలయాలు.
 
 ఏయే ఉద్యోగాలు ఉంటాయి:
 సైబర్ లాస్ కోర్సులు పూర్తిచేసిన వారు వివిధ అవకాశాలను చేజిక్కించుకొని కెరీర్‌లో స్థిరపడొచ్చు. లా డిగ్రీ కూడా ఉంటే ఉన్నత కొలువులు పలకరిస్తాయి. అవి:
 సైబర్ కన్సల్టెంట్.
 ఇంటర్నెట్ రీసెర్చ్ అసిస్టెంట్, లా అడ్వైజర్.
 లీగల్ ఎగ్జిక్యూటివ్, లా ఆఫీసర్, లీగల్ సెక్రటరీ.
 సైబర్ ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్, సైబర్ రీసెర్చ్ మేనేజర్స్.
 ట్రైనింగ్ ఎక్స్‌పర్ట్స్, అడ్వైజర్స్ టు వెబ్ డెవలపర్స్.
 సెక్యూరిటీ ఆడిటర్స్, రీసెర్చ్ అసిస్టెంట్స్.
 లా డిగ్రీతోపాటు సైబర్ లాస్ కోర్సులు పూర్తిచేసిన వారు సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
 
 వేతనాలు:
 వేతనాలనేవి అభ్యర్థి విద్యార్హతలు, వ్యక్తిగత సామర్థ్యం, పనిచేసే సంస్థ తదితరాలపై ఆధారపడి ఉంటాయి.
 సైబర్ లా కోర్సులు పూర్తిచేసి ఉద్యోగాల్లో చేరిన వారి ప్రారంభ వేతనం నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటుంది.
 ఓ కార్పొరేట్ లేదా లా సంస్థలో కన్సల్టెంట్‌గా చేరిన వారికి రూ. 22 వేల నుంచి రూ. 25 వేల వరకు ఆఫర్ చేస్తున్నారు.
 పని అనుభవం, వ్యక్తిగత సామర్థ్యంతో ఉన్నత స్థానాలను చేరుకొని రూ. 40 వేల వరకు అందుకోవచ్చు.
 మంచి నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వారికి విదేశాల్లో అవకాశాలు లభిస్తాయి.
 
 ‘సైబర్ లాస్’ కోర్సులపై ఆసక్తి పెరుగుతోంది
 ఓ జాతి, సమాజం అభివృద్ధిలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ఇంటర్నెట్ ఆధారిత సేవలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. ఈ-కామర్స్, ఈ-గవర్నెన్స్ వంటి కార్యకలాపాలు సాగుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే మరోవైపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగపరుస్తూ అక్రమాలకు పాల్పడుతున్న కేసులు, వివాదాలు అధికమవుతున్నాయి. అందుకే సైబర్ న్యాయ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది.
 
 దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం దేశంలోని వివిధ విద్యా సంస్థలు సైబర్ లాస్‌కు సంబంధించిన కోర్సులను అందుబాటులోకి తెచ్చాయి. ఉస్మానియా యూనివర్సిటీలోని లా డిపార్ట్‌మెంట్ ఏడాది కాల వ్యవధితో సైబర్ లాస్‌లో పీజీ డిప్లొమా కోర్సును ఆఫర్ చేస్తోంది. మొత్తం 80 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏటా ప్రవేశ పరీక్ష నిర్వహించి, సీట్లను భర్తీ చేస్తున్నాం. కోర్సులో భాగంగా లాస్‌తో పాటు సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ప్రాథమిక అంశాలు, ఎలక్ట్రానిక్ ఒప్పందాలు, ఈ-గవర్నెన్స్, ఈ-కామర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం; సైబర్ చట్టాలు (జాతీయ, అంతర్జాతీయ); కాపీరైట్, పేటెంట్‌లు, ట్రేడ్‌మార్క్స్, డేటా బేస్ వంటి అంశాలను బోధిస్తారు.
 
 సైబర్ లాస్ కోర్సులు పూర్తిచేసిన వారికి బ్యాంకింగ్, ఐటీ, పోలీస్ డిపార్ట్‌మెంట్స్, కార్పొరేట్ హౌస్‌లు వంటి వాటిలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇప్పుడు కంపెనీలు టెక్నాలజీ ఆధారంగానే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అందువల్ల ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోనూ ఉద్యోగావకాశాలుంటాయి. సైబర్ న్యాయ నిపుణులు నెట్ బ్యాంకింగ్, సాఫ్ట్‌వేర్ పేటెంట్స్, కాపీరైట్స్ తదితరాలకు సంబంధించిన కేసులను పరిశీలించాల్సి ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, న్యాయ సంబంధ విషయాలపై పట్టుండి, ఆత్మవిశ్వాసం, ధైర్యం, సమస్య విశ్లేషణ శక్తి ఉన్నవారు ఈ రంగంలో రాణించగలరు.
 - డాక్టర్ బి. విజయలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్,
 యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా (ఓయూ).
 
 
 
 
 
 సైబర్ లాస్ కోర్సులు అందిస్తున్న సంస్థలు
 ఏషియన్ స్కూల్ ఆఫ్ సైబర్ లా    
 వెబ్‌సైట్: www.asianlaws.org
 నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా
 వెబ్‌సైట్: www.nalsarpro.org
 ఉస్మానియా యూనివర్సిటీ
 వెబ్‌సైట్: www.osmania.ac.in/lawcollege
 ఇండియన్ లా ఇన్‌స్టిట్యూట్
 వెబ్‌సైట్: www.ili.ac.in
 నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ
 వెబ్‌సైట్: ded.nls.ac.in
 సింబయోసిస్ సొసైటీస్ లా కాలేజ్
 వెబ్‌సైట్: www.symlaw.ac.in
 సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్)
 వెబ్‌సైట్: www.uohyd.ac.in
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement