ఉత్తమ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా రఘురామ్ రాజన్ | Raghuram Rajan Given Best Central Bank Governor Award | Sakshi
Sakshi News home page

ఉత్తమ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా రఘురామ్ రాజన్

Published Thu, Oct 23 2014 4:27 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 PM

ఉత్తమ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా రఘురామ్ రాజన్

ఉత్తమ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా రఘురామ్ రాజన్

 సైన్స్ అండ్ టెక్నాలజీ
 పీఎస్‌ఎల్‌వీ-సీ 26 ప్రయోగం విజయవంతం
 ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సి ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సీ 26 నౌక శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుంచి అక్టోబరు 16న విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. నావిగేషన్ కోసం ప్రయోగించిన మూడో ఉపగ్రహం ఇది. అర్ధరాత్రి రాకెట్ ప్రయోగించడం ఇది రెండోసారి.
 
 విజయవంతమైన నిర్భయ్ క్షిపణి ప్రయోగం
 స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తొలి దీర్ఘశ్రేణి సబ్‌సానిక్ క్రూయిజ్ క్షిపణి నిర్భయ్ ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైంది. దీన్ని అక్టోబరు 17న ఒడిశాలోని చాందీపూర్ ప్రయోగ కేంద్రం నుంచి నిర్వహించారు. ఇది 1000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. అణ్వస్త్రాలను కూడా మోసుకుపోగలదు. భూమి, ఆకాశం, సముద్రంపైనుంచి దీన్ని ప్రయోగించవచ్చు. ఇది కనిష్టంగా ఐదు మీటర్ల ఎత్తులో, గరిష్టంగా ఐదు కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించగలదు. ప్రస్తుతం బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి 290 కి.మీ మాత్రమే ప్రయాణిస్తుంది. నిర్భయ్‌ను రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన ఏరో నాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ సంస్థ (బెంగళూరు) అభివృద్ధి చేసింది. అమెరికాకు చెందిన తోమహాక్, పాకిస్థాన్‌కు చెందిన బాబర్ క్షిపణులకు నిర్భయ్ పోటీగా నిలుస్తుంది.
 
 జాతీయం
 భారత్‌లో యూఎన్ ఉమెన్ ప్రచారం ప్రారంభం
 మహిళల హక్కులు, లింగ సమానత్వం పెంపొందించడంలో పురుషుల భాగస్వామ్యం పెంచే లక్ష్యంతో యూఎన్ ఉమెన్ కార్యక్రమాన్ని ఐక్యరాజ్య సమితి అక్టోబరు 11న ప్రారంభించింది. 2030 నాటికి లింగ అసమానత్వాన్ని అంతమొందించేందుకు హి ఫర్ షి ఉద్యమాన్ని చేపట్టింది.
 
 శ్రమయేవ జయతే ప్రారంభం
 పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శ్రమయేవ జయతే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ అక్టోబరు 16న న్యూఢిల్లీలో ప్రారంభించారు. దీని కి ంద ఐదు పథకాలను ప్రారంభించారు. 1. శ్రమ సువిధ పోర్టల్: ఇందులో ప్రతి కార్మికుడికి ప్రత్యేక కార్మిక గుర్తింపు సంఖ్య ఉంటుంది. 2. ర్యాండమ్ ఇన్‌స్పెక్షన్ పథకం: పరిశ్రమల తనిఖీ పారదర్శకంగా ఉండేందుకు ఈ పథకాన్ని కార్మిక శాఖ రూపొందించింది. 3. యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్): ఉద్యోగ భవిష్య నిధి సభ్యుల కోసం సార్వత్రిక ఖాతా సంఖ్య (యూనివర్సల్ అకౌంట్ నంబర్) శాశ్వతంగా ఒకటే ఉంటుంది. 4. అప్రెంటీస్ షిప్ ప్రోత్సాహన యోజన: యువతలో నైపుణ్యాల వృద్ధి కోసం ఉద్దేశించిన పథకమిది. 5. సవరించిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా: అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు ఆరోగ్య భద్రత కోసం ఇచ్చిన కార్డులకు రెండు సామాజిక భద్రత పథకాలను చేరుస్తారు. వ్యాపారవేత్తలకు ఇబ్బందులు పెట్టే ఇన్‌స్పెక్టర్ రాజ్ విధానాన్ని రద్దు చేశారు.
 
 సిగరెట్ ప్యాకెట్లపై హెచ్చరికలు
 పొగ తాగటం వల్ల అనర్థాలను హెచ్చరిస్తూ సిగరెట్ ప్యాకెట్లపై 85 శాతం స్థలంలో చట్టబద్ధమైన హెచ్చరికలను విధిగా ముద్రించాలని తయారీ కంపెనీలను కేంద్ర ఆరోగ్యశాఖ అక్టోబర్ 15న ఆదేశించింది. సిగరెట్ పెట్టెపై 60 శాతం స్థలంలో ధూమపానం వల్ల కలిగే నష్టాలపై రేఖా చిత్రాలు, 25 శాతం స్థలంలో హెచ్చరికలను ముద్రించాలంటూ స్పష్టం చేసింది.
 
 డీజిల్ ధరలపై నియంత్రణ ఎత్తివేత
 డీజిల్ ధరలపై నియంత్రణను ఎత్తివేస్తూ కేంద్రం అక్టోబరు 18న నిర్ణయం తీసుకుంది. దీంతో నవంబర్ నుంచి అంతర్జాతీయ ధరలకనుగుణంగా డీజిల్ ధరలు ఉంటాయి. ఇటీవల ముడి చమురు ధరలు తగ్గడంతో అక్టోబరు 18న డీజిల్ ధరను చమురు సంస్థలు తగ్గించాయి. డీజిల్ ధరలపై నియంత్రణ ఎత్తివేయడం వల్ల ప్రభుత్వం కానీ, చమురు సంస్థలు కానీ ఇకపై ఎటువంటి రాయితీ అందించవు. 2010లో పెట్రోల్‌పై ప్రభుత్వం ధరల నియంత్రణ ఎత్తివేసింది. అప్పటి నుంచి అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్ ధరలు కొనసాగుతున్నాయి.
 
 మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు
 మహారాష్ట్ర, హర్యానా శాసనసభలకు అక్టోబరు 15న జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. మహారాష్ట్రలో 288 స్థానాలకు 122 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది. హర్యానాలో 90 స్థానాలకు 47 స్థానాలు గెలుచుకొని పూర్తి మెజారిటీ సాధించింది. మహారాష్ట్రలో బీజేపీ-122, శివసేన -63, కాంగ్రెస్-42, ఎన్‌సీపీ- 41, స్వతంత్రులు -7, ఇతరులు-12 గెలుచుకున్నారు. హర్యానాలో బీజేపీ-47, ఐఎన్‌ఎల్‌డి-19, కాంగ్రెస్-15, హెచ్‌జేసీ-2, ఇతరులు-7 స్థానాలు సాధించారు.
 
 అవార్డులు
 ఆస్ట్రేలియా రచయితకు బుకర్ ప్రైజ్
 ప్రతిష్టాత్మక సాహితీ పురస్కారం మ్యాన్ బుకర్ ప్రైజ్ -2014 ఆస్ట్రేలియా రచయిత రిచర్డ్ ప్లనగన్ (53) ను వరించింది. ‘ది నేరో రోడ్ టు ది డీప్ నార్త్‌‘ అనే నవల రచనకు ఈ పురస్కారం దక్కింది. బర్మా-థాయ్‌లాండ్ రైల్వే నిర్మాణం నేపథ్యమే ఈ నవల ఇతివృత్తం. రెండో ప్రపంచ యుద్ధ ఖైదీలు, బానిసలతో ఈ రైల్వే లైన్ నిర్మించిన సమయంలో నాటి దారుణమైన పరిస్థితులు, కార్మికుల మధ్య ఉన్న అనుబంధాలను ఈ నవలలో   రిచర్‌‌డ వివరించారని బుకర్ కమిటీ తెలిపింది.
 
 ఉత్తమ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా రాజన్
 యూరోమనీ మ్యాగజైన్ ఉత్తమ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అవార్డును వాషింగ్టన్‌లో అక్టోబరు 10న  భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ అందుకున్నారు. భారీ లోటుతో ఉన్న ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు రాజన్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారని యూరోమనీ రాజన్‌ను కొనియాడింది.
 
 జమ్మూకాశ్మీర్ పోలీసు శక్తిదేవికి ఐరాస అవార్డు
 జమ్మూకాశ్మీర్‌కు చెందిన మహిళా పోలీసు శక్తిదేవి (38)కి ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా శాంతి పరిరక్షకురాలు-2014 అవార్డు లభించింది. కెనడాలోని విన్నిపెగ్‌లో అక్టోబరు మొదటివారంలో జరిగిన మహిళా పోలీసుల అంతర్జాతీయ సంఘం సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేశారు. ఐరాస తరపున అఫ్గానిస్థాన్‌లో ఆమె పనిచేస్తున్నారు. శక్తిదేవి మహిళా కౌన్సిళ్లు ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. లైంగిక దాడులు, లింగ వివక్ష వేధింపు బాధితులకు సేవలు అందించారు. ఈ అవార్డును ఐక్యరాజ్యసమితి పోలీసు డివిజన్ ఏర్పాటు చేసింది.
 
 భారత శాస్త్రవేత్తకు ప్రపంచ ఆహార బహుమతి
 ప్రముఖ భారత శాస్త్రవేత్త సంజయ రాజారాం ప్రతిష్టాత్మక ప్రపంచ ఆహార బహుమతి (వరల్డ్ ఫుడ్ ప్రైజ్)-2014కు ఎంపికయ్యారు. అమెరికాలో డెస్ మోయిన్స్‌లో అక్టోబరు 16న జరిగిన 2014 బోర్లాగ్ డైలాగ్ సదస్సులో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గోధుమ దిగుబడులు పెంచడంలో విశేష కృషి చేసినందుకు ఆయన్ను ఈ అవార్డు వరించింది. ప్రస్తుతం అంతర్జాతీయ పొడినేలల, వ్యవసాయ పరిశోధన కేంద్రం (ఐసీఏఆర్‌డీఏ) సీనియర్ శాస్త్రీయ సలహాదారుగా రాజారాం వ్యవహరిస్తున్నారు.
 
 దాదాభాయ్ నౌరోజీ అవార్డులు
 భారత్-బ్రిటన్ సంబంధాలను బలోపేతం చేయడంలో కృషి చేసిన వారికి గుర్తింపుగా బ్రిటన్ ప్రభుత్వం దాదాభాయ్ నౌరోజీ పేరుతో ఏర్పాటుచేసిన అవార్డులను అక్టోబరు 10న ప్రదానం చేసింది. వాణిజ్య రంగంలో యునెటైడ్ కింగ్‌డమ్ ఇండియా కౌన్సిల్ చైర్మన్ పాట్రికా హెవిట్, విద్యారంగంలో ఆశా ఖేమ్కా, కళారంగంలో నటుడు మాధవ్ శర్మలను అవార్డులు వరించాయి. బ్రిటన్ పార్లమెంట్‌లో తొలి ఆసియా సభ్యుడు, భారత వాణిజ్యాన్ని బ్రిటన్‌కు తీసుకువచ్చిన తొలి భారతీయునిగా నిలిచిన నౌరోజీకి అంకితం ఇస్తూ బ్రిటన్ ఈ అవార్డులను ప్రకటించింది.
 
 వార్తల్లో వ్యక్తులు
 యూఎస్ హక్కుల విభాగంలో వనితా గుప్తా
 భారతీయ అమెరికన్ మహిళా న్యాయవాది, అమెరికా పౌర హక్కుల సంఘం డిప్యూటీ లీగల్ డెరైక్టర్ వనితా గుప్తా (39) అరుదైన గౌరవం పొందారు. అమెరికా న్యాయశాఖలో కీలకమైన పౌర హక్కుల విభాగం సహాయక అటార్నీ జనరల్‌గా అక్టోబరు 15న నియమితులయ్యారు. తద్వారా ఈ పదవి పొందిన తొలి దక్షిణాసియా అమెరికన్‌గా వనితా గుప్తా గుర్తింపు పొందారు. మోల్లీ మోరాన్ స్థానంలో నియమితులైన ఆమె ఈ నెల 20న పదవీ బాధ్యతలు చేపట్టారు.
 
 ఆర్థిక సలహాదారుగా అరవింద్
 ప్రముఖ ఆర్థిక వేత్త, విద్యావేత్త అరవింద్ సుబ్రమణియన్ కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా అక్టోబరు 16న బాధ్యతలు చేపట్టారు. ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. గతంలో ఆయన అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో ఆర్థికవేత్తగా పనిచేశారు.
 
 బొలీవియా అధ్యక్షుడిగా మొరాల్స్
 బొలీవియా అధ్యక్ష ఎన్నికల్లో ఎవో మొరాల్స్ మూడోసారి విజయం సాధించారు. అక్టోబరు 12న జరిగిన ఎన్నికల్లో ఆయనకు 60 శాతం ఓట్లు లభించాయి. ప్రత్యర్థి డోరియా మెడినాకు 25 శాతం దక్కాయి. ఆర్థిక, రాజకీయ సుస్థిరతను అందించేందుకు మొరాల్స్‌కు మూడోసారి ప్రజలు పట్టం కట్టారు. గతంలో దక్షిణ అమెరికాలో అత్యంత పరిపాలించలేని దేశాల్లో బొలీవియా ఒకటి.
 
 క్రీడలు.
 సాకేత్‌కు ఇండోర్ ఓపెన్ టైటిల్
 ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేని ఇండోర్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. అక్టోబరు 19న జరిగిన సింగిల్స్ ఫైనల్‌లో అలెగ్జాండర్ (కజకిస్థాన్)ను సాకేత్ ఓడించాడు. ఇది అతనికి తొలి ఏటీపీ చాలె ంజర్ టోర్నీ టైటిల్.
 
 జాతీయ సీనియర్ ఆర్చరీ చాంప్
 జాతీయ సీనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్ టైటిల్‌ను తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కైవసం చేసుకుంది. అక్టోబరు 16న జరిగిన మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఫైనల్‌లో పూర్వాషా షిండేపై ఆమె విజయం సాధించింది. ఈ చాంపియన్‌షిప్‌ను జ్యోతి రెండుసార్లు గెలుచుకుంది.
 
 భారత్‌కు సుల్తాన్ జొహర్ కప్
 హాకీ సుల్తాన్ జొహర్ కప్ అండర్ -21 టోర్నమెంట్‌ను భారత జట్టు గెలుచుకుంది. మలేసియాలో జరిగిన ఫైనల్‌లో బ్రిటన్‌ను భారత్ ఓడించింది. దీంతో ఈ టోర్నమెంట్‌ను వరుసగా రెండు సార్లు సాధించిన తొలి జట్టుగా భారత్ గుర్తింపు పొందింది.
 
 అంతర్జాతీయం
 కాశ్మీర్‌పై జోక్యానికి ఐరాస విముఖత
 కాశ్మీర్ సరిహద్దు అంశంపై జోక్యం కోసం పాకిస్థాన్ చేసిన ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి తిరస్కరించింది. ఈ అంశాన్ని భారత్, పాక్‌లు చర్చలు ద్వారా పరిష్కరించుకోవాలంటూ సూచించింది. సరిహద్దులో పరిస్థితిని చక్కదిద్దేందుకు, కాశ్మీర్ సమస్య పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని పాక్ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్‌కు లేఖ రాసింది. అయితే ఈ వివాదాన్ని ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
 
 రాష్ట్రపతి నార్వే, ఫిన్‌లాండ్ పర్యటన
 భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ నార్వే పర్యటనలో ఈ నెల 14న ఇరుదేశాల మధ్య 13 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. వీటిలో ఇరు దేశాల మధ్య రక్షణ, విద్య, పరిశోధన సంస్థల మధ్య ఒప్పందం, భారత్‌లో అత్యాధునిక చేపల పెంపకం కేంద్రం ఏర్పాటుతో పాటు 13 ఒప్పందాలు ఉన్నాయి. అక్టోబరు 15న ఫిన్‌లాండ్‌లో పర్యటించిన రాష్ట్రపతి ఆ దేశ అధ్యక్షుడు సాయులి నీనిస్తోతో అధికారిక చర్చలు జరిపారు. అసోంలోని నుమాలిఘర్‌లో బయో రిఫైనరీ ఏర్పాటుతోపాలు 19 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. భారత ప్రభుత్వం నూతనంగా తలపెట్టిన మేక్ ఇన్ ఇండియాలో భాగం కావాలని నార్వే కంపెనీలను ప్రణబ్ ఆహ్వానించారు.
 
 రాష్ట్రీయం
 తెలంగాణలో ఐదు స్మార్ట్ సిటీలు
 తెలంగాణ రాష్ట్రంలోని.. హైదరాబాద్,  వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం నగరాలను స్మార్‌‌ట సిటీలుగా అభివృద్ధి చేయాలని కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదించనుంది.
 
 జలవనరుల శాఖ సలహాదారుగా శ్రీరాం
 తెలంగాణకు చెందిన శ్రీరాం వెదిరె కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సలహాదారుగా అక్టోబర్ 16న నియమితులయ్యారు. గంగానదీ ప్రక్షాళన, నదుల అభివృద్ధి, వాటి అనుసంధానం, సాగునీటి సరఫరా వంటి అంశా ల్లో కేంద్ర జలవనరుల శాఖకు ఆయన సలహాలు ఇస్తా రు. నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీరాం..‘నీటి నిర్వహణ లో గుజరాత్ విజయగాథ’, ‘గోదావరి, కృష్ణాలను విని యోగిస్తూ తెలంగాణకు వాటర్‌గ్రిడ్’,‘దేశానికి నీటి నిర్వహణలో కొత్త పద్ధతులు అనివార్యం’ వంటి గ్రంథాలను రచించారు. అలాగే జాతీయ నీటి విధానం-2012 రూపకల్పనలో భాగస్వామిగా వ్యవహరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement