పరిశోధనల పట్ల ఆసక్తి ఉన్న వారికి అనువైన కోర్సు.. జియాలజీ. భూమి, దానిలోని పదార్థాలు, వాటి చరిత్ర, శిలలు, కొండలు, పర్వతాలు, భూకంపాలు, ఖనిజాలు, ఇంధనవనరులు, అగ్ని పర్వతాలు, హిమానీ నదాలు, సముద్రాలు-వాటి వాతావరణం, తదితరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే జియాలజీ.
జియాలజీ కోర్సులో కొన్ని ప్రాథమిక విభాగాలు ఉంటాయి. అవి.. పెట్రోలియం జియాలజీ, మెరైన్ జియాలజీ, హైడ్రో జియాలజీ, రిమోట్ సెన్సింగ్, ఓషియనోగ్రఫీ, మినరాలజీ, స్ట్రక్చరల్ జియాలజీ, ఎన్విరాన్‌మెంటల్ జియాలజీ, వోల్కానాలజీ, జియో కెమిస్ట్రీ, జియో ఫిజిక్స్, ఇంజనీరింగ్ జియాలజీ. జియాలజీ కోర్సును పూర్తి చేసిన వారిని జియాలజిస్ట్‌లుగా వ్యవహరిస్తారు. ఎంచుకున్న రంగాన్ని బట్టి వివిధ రకాల జియాలజిస్ట్‌లు ఉంటారు. వివరాలు.. మెరైన్ జియాలజిస్ట్, పెట్రోలజిస్ట్, మినరాలజిస్ట్, జియోహైడ్రాలజిస్ట్, హైడ్రాలజిస్ట్, సర్వేయర్, సెసిమోలజిస్ట్, పేలెంటాలజిస్ట్.
ప్రవేశం ఇలా:
జియాలజీకి సంబంధించిన కోర్సులను పూర్తి చేయడం ద్వారా జియాలజిస్ట్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ స్థాయి నుంచి మాత్రమే జియాలజీ కోర్సు అందుబాటులో ఉంది. దీని తర్వాత పీజీ స్థాయిలో ఎంఎస్సీ, ఎంఎస్సీ-టెక్ కోర్సులు ఉన్నాయి. ఆసక్తి ఉంటే పీహెచ్‌డీ కూడా చేయవచ్చు. మన రాష్ట్రంలో మ్యాథమెటిక్స్/బయాలజీ, ఫిజిక్స్/కెమిస్ట్రీల కాంబినేషన్స్‌తో బ్యాచిలర్ స్థాయి (బీఎస్సీ)లో జియాలజీ ఒక సబ్జెక్టుగా అందుబాటులో ఉంది. బ్యాచిలర్ తర్వాత జియాలజీ, జియో ఫిజిక్స్, మెరైన్ కెమిస్ట్రీ తదితర స్పెషలైజేషన్స్‌తో ఎంఎస్సీ కోర్సు కూడా చేయవచ్చు. మన రాష్ట్రంలోని అన్ని ప్రముఖ యూనివర్సిటీలు ఈ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
అవకాశాలు:
ప్రస్తుతం చాలా దేశాలు శక్తి వనరుల విషయంలో స్వయం సమృద్ధి సాధించాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఖనిజాలు, చమురు అన్వేషణకు పెద్ద పీట వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జియాలజిస్ట్‌లది కీలకపాత్ర. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణ, భూకంపాలు- సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాలను విశ్లేషించడంలోనూ జియాలజిస్ట్‌ల అవసరం ఎంతో. ఈ క్రమంలో రిసోర్సెస్ మేనేజ్‌మెంట్‌గా దిశగా సాగుతున్న ప్రస్తుత ప్రపంచంలో జియాలజిస్ట్‌లకు అవకాశాల పరంగా ఎటువంటి ఢోకా లేదని చెప్పొచ్చు. మౌలిక రంగంలో విస్తృతమవుతున్న నిర్మాణాలు కూడా జియాలజిస్ట్‌లకు మరింత డిమాండ్‌ను పెంచాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు రెండూ జియాలజిస్ట్‌లకు సమానంగా అవకాశాలు కల్పిస్తుండడం విశేషం.
జియాలజిస్ట్ ఎగ్జామ్:
జియాలజిస్ట్‌లకు చక్కని అవకాశం.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) నిర్వహించే జియాలజిస్ట్ ఎగ్జామ్. యూపీఎస్‌సీ ప్రతి ఏడాది ఈ పరీక్ష నిర్వహిస్తోం ది. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి జియాలజీ/ అప్లయిడ్ జియాలజీ/మెరైన్ జియాలజీలో మాస్టర్ డిగ్రీ. సంబంధిత నోటిఫికేషన్ ప్రతి ఏడాది ఆగస్టులో వెలువడుతుంది.
విదేశాల్లో:
జియాలజిస్ట్‌లకు విదేశాల్లో కూడా చక్కని అవకాశాలు ఉంటాయి. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాతోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జియాలజిస్ట్‌లకు మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో ఇండోనేషియా, మలేషియా, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, వియత్నాం, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్‌లు జాబ్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. ఆయా దేశాల్లో మౌలిక వసతుల రంగంలో విస్తృతమవుతున్న కార్యకలాపాలను (హైవేలు, ఎయిర్‌పోర్ట్, డ్యామ్‌లు, పైప్‌లైన్స్ నిర్మాణం) ఇందుకు కారణంగా పేర్కొనవచ్చు. బంగారం, ఆయిల్ గనులు విస్తారంగా ఉన్న మిడిల్ ఈస్ట్ దేశాల్లో కూడా జియాలజిస్ట్‌లకు మంచి అవకాశాలు
ఉంటున్నాయి.
వేతనాలు:
వేతనాల విషయానికొస్తే.. ఆకర్షణీయమైన పే-ప్యాకేజ్‌లు జియాలజిస్ట్‌లకు లభిస్తున్నాయి. కెరీర్ ప్రారంభంలో
(ఎంఎస్సీ డిగ్రీ) ఫ్రెషర్‌కు ప్రభుత్వ/ప్రైవేట్ రంగంలో నెలకు రూ. 25 వేల నుంచి రూ. 40 వేల వరకు వేతనం అందుతుంది.
టాప్ రిక్రూటర్స్:
జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా
సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్
ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
నేషనల్ జియోఫిజికల్ ఇన్‌స్టిట్యూట్
వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ
బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్
టాప్ ఇన్‌స్టిట్యూట్స్:
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బాంబే
వెబ్‌సైట్: www.iitb.ac.in
ఇండియన్ స్కూల్స్ ఆఫ్ మైన్స్-ధన్‌బాద్
వెబ్‌సైట్: www.ismdhanbad.ac.in
ఢిల్లీ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.du.ac.in
బెనారస్ హిందూ యూనివర్సిటీ-వారణాసి
వెబ్‌సైట్: www.bhu.ac.in
యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్
వెబ్‌సైట్: www.unom.ac.in
ఉస్మానియా యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.osmania.ac.in
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
పరిశోధనలకు అనువైన... జియాలజీ
Published Thu, Jan 22 2015 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 8:02 PM
Advertisement