సిలబస్.. గత ప్రశ్నలను సమన్వయం చేసుకుంటూ.. | Telugu literature in civil service mains exam | Sakshi
Sakshi News home page

సిలబస్.. గత ప్రశ్నలను సమన్వయం చేసుకుంటూ..

Published Thu, Oct 10 2013 3:41 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

సిలబస్.. గత ప్రశ్నలను సమన్వయం చేసుకుంటూ.. - Sakshi

సిలబస్.. గత ప్రశ్నలను సమన్వయం చేసుకుంటూ..

 కె. సర్వమంగళ గౌరి,
 సీనియర్ ఫ్యాకల్టీ (తెలుగు),  సివిల్స్

 
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. సివిల్స్ మెయిన్స్ పరీక్ష విధానంలో మార్పులు చేసింది. వీటి ప్రకారం ఇప్పటివరకు ఉన్న రెండు ఆప్షనల్ సబ్జెక్టుల స్థానంలో ఒక ఆప్షనల్ సబ్జెక్టును మాత్రమే అభ్యర్థులు ఎంపిక చేసుకోవాలి. అందుకు కారణం కొత్త పరీక్షా విధానంలో జనరల్ స్టడీస్‌లో నాలుగు అంశాలను అదనంగా చేర్చారు. అవి కొన్ని ఐచ్ఛికాంశాలకు సంబంధించినవిగా కనిపిస్తున్నాయి (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, సోషియాలజీ మొదలైన వాటికి సంబంధించినవి). ఈ నేపథ్యంలో రెండు  ముఖ్యమైన అంశాలను తార్కికంగా ఆలోచిస్తే తెలుగును నిస్సందేహంగా ఆప్షనల్‌గా ఎంచుకోవచ్చు అని అర్థమవుతుంది. ఆ రెండు ముఖ్యమైన అంశాలేమిటంటే తెలుగు స్కోరింగ్ సబ్జెక్ట్, అదేవిధంగా మన మాతృభాష. ఈ నేపథ్యంలో పేపర్ -1 ప్రిపరేషన్ వ్యూహాలు..
 

పేపర్-1 భాషా శాస్త్రం (మొదటి భాగం) సాహిత్య చరిత్రలకు సంబంధించింది. భాషా శాస్త్రంలో ప్రశ్నల తీరు ఎలా ఉన్నప్పటికీ..గత అనుభవాలను పరిశీలిస్తే..ఇందులో అభ్యర్థులకు ఎక్కువ మార్కులు వస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.తెలుగు పేపర్-1లో 210 మార్కులు సాధించిన వారున్నారు. 200-210 మధ్య సాధించిన వారి సంఖ్య తక్కువేమీ కాదు. సిలబస్, ప్రశ్నల తీరును సమన్వయం చేసుకొంటూ అధ్యయనం చేస్తే మరిన్ని మార్కులు సాధించే అవకాశం కూడా ఉంది. సిలబస్‌లోని ప్రతి అంశాన్ని, దానిపై గతంలో వచ్చిన ప్రశ్నలను సమన్వయం చేసుకుని పరీక్షకు సిద్ధమైతే సులభంగానే అన్ని ప్రశ్నలకు సమాధానాలను రాయడం సాధ్యమవుతుంది.
 
మొదటి భాగం ఇలా (భాషా శాస్త్రం):
 భాష కూడా నిత్య వ్యవహారాల్లో ఉన్నప్పుడు మారుతూ ఉంటుంది. అంతేకాదు, ఈ అంశంపై వివిధ విద్యాలయాల్లో పరిశోధనలు సాగుతుండడంతోపాటు కొత్తగా పుస్తకాలు వెలువడుతూ ఉంటాయి. కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని అందుకనుగుణంగా స్టడీ మెటీరియల్‌లో అదనంగా అంశాలు చేర్చుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. ఇది ప్రతి ఐచ్ఛికాంశంలోనూ ఈ తరహా విధానాన్నే అనుసరిస్తాం. కాని తెలుగులో ఇటీవలే ఆయా అంశాల మీద ప్రశ్నలు వస్తున్నాయనే  విషయాన్ని గమనించాలి.
 
 ఉదాహరణకు- ‘తెలుగు భాష ప్రాచీనత’-ఈ అంశం మీద మొన్నటి వరకు ఐతరేయ బ్రాహ్మణంలోనే మొదట ఆంధ్రుల ప్రస్తావన వచ్చిందనీ, వారు మ్లేచ్చులనీ నమ్మేవారు. కాని తెలుగు భాషకు ప్రాచీన హోదా కోసం ప్రయత్నించిన నేపథ్యంలో పండితులు అనేక సత్యాలను వెలుగులోకి తెచ్చారు. ‘పులుమావి’ అనే పదం.. పూర్తి తెలుగు పదం అనే అంశం అందులో ముఖ్యమైంది. ఇలాగే ప్రతి భాగంలోని నూతనాంశాలను గుర్తించాలి.
 
 పారిభాషిక పదాలు:
 భాషా శాస్త్రంలో ముఖ్యంగా గుర్తించాల్సిన మరొక అంశం పారిభాషిక పదాలు. ఒకే పారిభాషిక పదాన్ని భాషా పరిశోధనలో భాషావేత్తలు మరొరకంగా తార్కికంగా ప్రతిపాదించవచ్చు.
 ఉదాహరణకి ’Morphenv’ అనే పదానికి సమానార్థకంగా ‘పదాంశం’ అనే పదం ప్రాచుర్యంలో ఉంది. ఆచార్య పి.ఎస్. సుబ్రహ్మణ్యం ఆ పదాన్ని ‘అర్థకం’ అని పేర్కొనాలని సూచించారు. కొందరు ‘పదాంశం’ అనే పదాన్ని ‘అర్థకం’ అని వినియోగిస్తున్నారు. ఇలాంటివే మరి కొన్ని ..
 ప్రాంతీయ మాండలికాలు-స్థల మాండలికాలు
 వర్గ మాండలికాలు-కుల మాండలికాలు
 ప్రాఙ్నన్నయ యుగం-పూర్వ చాళుక్య యుగం
 సపదాంశం-సార్థకం
 
 అనువాదంలో జాగ్రత్త:
 సిలబస్ ఇంగ్లిష్‌లో ఉంటుంది. దాన్ని తెలుగు భాషలోకి అనువదించుకునేటప్పుడు సమన్యాయంగా పరిశీలించడం వల్ల ప్రశ్నలను అర్థం చేసుకోవడం సులభతరం అవుతుంది.
 ఉదాహరణకు- మొదటి భాగంలోని నాలుగో భాగాన్ని అధిక శాతం మంది అభ్యర్థులు తెలుగు భాషలపై అన్య భాషల ప్రభావం అని అనువదించడం కనిపిస్తుంది. ఆంగ్లంలో ఉన్న వాక్యాన్ని పరిశీలిస్తే.. ’Influence of other languages and it's impact on Telugu’ దీన్ని తెలుగు భాషకు అనువుగా అనువదించుకుంటే..‘ తెలుగు భాష మీద అన్య భాషల ప్రభావం (impact) ప్రాబల్యం (Influence)’. ఇప్పటివరకు ఈ అంశం మీద వచ్చిన ప్రశ్నలను పరిశీలిస్తే ఈ విషయం మరింత స్పష్టమవుతుంది.

 

2002లో ‘తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావమెట్టిదో తెలపండి’ అని అడిగారు. అంతకుముందు (2000) ‘తెలుగు భాషకు కలిగిన సంపన్నత ఎట్టిదో’ అనే ప్రశ్న వచ్చింది. 2010లో ‘అన్య భాషల ప్రభావానికి లోనైన తెలుగు భాషా పరిణామం అని అడిగారు’. కాబట్టి ‘అన్యదేశ్యాలు’, ‘అన్యభాషా సంపర్కం’ అనే పాఠాన్ని చదివేటప్పుడు ప్రాబల్యం, ప్రభావం అనే కోణంలో చదివితేనే ఈ తరహా ప్రశ్నలపై ఒక అవగాహన ఏర్పడుతుంది. అప్పుడే మనం రాసే జవాబు సమగ్రం అవుతుంది.
 ఒక భాషని మరొక భాష ప్రభావితం చేసినప్పుడు ప్రధాన భాషలోని ‘భావన’, ‘వస్తువు’ ఆదాన భాష స్వీకరిస్తుంది. అందుకు అనుగుణంగా ఆ భాషలోని వర్ణాలను (ఉచ్ఛారణం) స్వీకరించడం ప్రభావం అవుతుంది. ఉదాహరణకు- కర్తవ్యం, ఫలం (పండు),కర్తవ్యం మొదలైనవి.
పాలకుల భాషో, సంపన్నుల, సాంస్కృతిక ఔన్నత్యం ఉన్న భాషా అయితే ప్రదాన భాషలోని పదాలను/వర్ణాలను ఆక్రమిస్తే అది ప్రాబల్యం అవుతుంది.
 ఉదాహరణకు- ‘శ’ వర్ణం సంస్కృత పదాల ప్రభావం వల్ల తెలుగులోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఆంగ్ల భాషా ప్రాబల్యం వల్ల ‘శ’ ఉచ్ఛారణ ‘ష’గా మారింది. తెలుగు భాష మీద అన్య భాషల సంపర్కాన్ని మొత్తం ఈ రెండు విభాగాలలో చేర్చి చదివితే సమాధానం రాయడం సులభం అవుతుంది.
 
 మరో కీలక విభాగం:
 సిలబస్‌లో లేదేమో అని భావించే మరొక అంశం ‘ప్రాఙ్నన్నయ యుగం భాష’. నిజానికి రెండో అంశంలో వర్ణాలు, పదాంశం, వ్యాకరణం, వాక్య నిర్మాణం ఈ నాలుగు కోణాల్లో మూల ద్రావిడం నుంచి ప్రాచీన తెలుగు-ప్రాచీన తెలుగు నుంచి -ఆధునిక తెలుగు మార్పులు అని ఉంది. ఈ పరిణామంలో మూడు దశలను గుర్తించారు. అవి..
 ప్రాఙ్నన్నయ భాష-కావ్య భాష-ఆధునిక భాష
 ప్రాఙ్నన్నయ యుగం మీద భిన్న కోణాల్లో ప్రశ్నలు కనిపిస్తున్నాయి.
 
 మాండలికాలు:
 సిలబస్‌లో పరిధి తక్కువగా కనిపిస్తున్న.. వైవిధ్యమైన ప్రశ్నలు వస్తున్న మరొక భాగం-మాండలికాలు. ఇందులో ప్రశ్నలు చాలా వైవిధ్యభరితంగా ఉంటున్నాయి. మాండలికాలు-స్వరూప స్వభావాలు/భేద సాదృశ్యాలు. మాండలిక భాషాప్రవిభేదాలు మొదలైనవి. ఆంధ్రప్రదేశ్/ తెలుగు మాండలికాలు అన్నప్పుడు ప్రాంతీయ-ఆయా ప్రాంతాల్లోని స్థానిక వర్గ మాండలికాలతోపాటు సాంఘిక (ౌఛిజ్చీ) మాండలికాలను కూడా వివరించాలి.
 
 సమన్వయంతో:
 భాషా శాస్త్రం (మొదటి భాగం సెక్షన్-ఎ)లో గతంలో అడిగినప్రశ్నల తీరును ఆధారంగా చేసుకుని సిలబస్‌లోని అంశాలను సమన్వయం చేసుకుంటూ.. చదవాల్సిన విషయాలను ఒక పట్టికగా రాసుకోవాలి. అప్పుడే ఈ విభాగంపై సమగ్రమైన అవగాహన కలుగుతుంది. వాక్య నిర్మాణం (డ్ట్చ్ఠ), తెలుగు వాక్యం తీరు తెన్నులు, తెలుగు వాక్యంలో పదక్రమాన్ని ఏ విధంగా ఎంత వరకు మార్చవచ్చు, వాక్య విజ్ఞానం, వాక్య నిర్మాణ సంబంధాలు సన్నిహితావయవాలు మొదలై నవి.
 ఈ విధంగా విభాగించి జ్ఞాపకం ఉంచుకుంటే సిలబస్ మొత్తం మీద సమగ్రమైన అవగాహన వస్తుంది. ప్రస్తుతం 30 మార్కులకు ఈ తరహా ప్రశ్నలను ఇస్తున్నారు. కాబట్టి ఈ రకమైన అధ్యయనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
 ఇక్కడ గుర్తించాల్సిన మరొక ముఖ్య విషయం ఏదైనా భాషా భాగం ‘చరిత్ర’ అని ఉంటే.. ఉదాహరణకు- క్రియా పదాల చరిత్ర, ఔపవిభక్తి కాల చరిత్ర అని అడిగితే కేవలం ఆధునిక భాషలో వాటిని వివరిస్తే సరిపోదు. మూల ద్రావిడ భాషలో అవి (క్రియలు, ఔప విభక్తి కాల) ఎలా ఉండేవి? కాల క్రమంలో ఏ ధ్వని మార్పులకనుగుణంగా ఎలా మారాయి? అనే కోణంలో వివరించాలి. ఆయా భాషా భాగాల (విభక్తులు, క్రియలు) నిర్మాణం, చరిత్ర వేర్వేరని గుర్తించాలి.
 
 సూక్ష్మంగా ప్రశ్నలు:
 పేపర్-1లో రెండో భాగం సాహిత్య చరిత్ర. గత మూడు ఏళ్లుగా ఈ భాగంలో ప్రశ్నలు కొంత వరకు సూక్ష్మంగా ఉన్నాయని చెప్పక తప్పదు. ఎంత వరకు అంటే కొంత మంది అభ్యర్థులు ప్రశ్నలను చూసి.. సిలబస్ పరిధి దాటిన ప్రశ్నేమో అని భావించే వారు. అయితే సూక్ష్మంగా పరిశీలిస్తే సిలబస్‌కి అనుగుణంగానే ప్రశ్నలు ఉంటున్నాయనే విషయం బోధపడుతుంది. ఉదాహరణకు- సిలబస్‌లో ’The place of Tikkana in Telugu Literature’ (తెలుగు వాఙ్మయంలో తిక్కన స్థానం) అని పేర్కొన్నారు. కాబట్టి వాఙ్మయ విశేషాలన్నింటి మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అడిగిన ప్రశ్నలన్నీ కూడా అదే విధంగా ఉంటున్నాయి. వాఙ్మయంలో పరిభాష ఒక అంశం కాబట్టి ‘వేదాంత పరి భాష తిక్కన ఆంధ్రీకరణం’ అని అడిగారు.
 
 అంశం-ప్రశ్న:
 అభ్యర్థులు కొన్ని ప్రశ్నలలో గుర్తించాల్సిన అతి ముఖ్యమైన అంశం.. సిలబస్‌లోని అంశానికి ప్రశ్నకు ఉన్న సంబంధం. 2007లో ‘న న్నయ ఆంధ్రీకరణ విధానం’ అని అడిగారు. కానీ సిలబస్‌లో.. మహాభారత రచనా కాలం నాటి చారిత్రక సాహిత్య సామాజిక నేపథ్యం అనే పేర్కొనడం జరిగింది. ఆ నేపథ్యమే నన్నయ మహాభారత రచనకు పూనుకోవడానికి, వ్యాసభారతాన్ని ఆంధ్రీకరణలో మార్పులు చేయడానికి కారణమైంది. కాబట్టి ఈ ప్రశ్నకు నన్నయ భారతాన్ని కొన్ని చోట్ల పెంచారు. కొన్ని చోట్ల తగ్గించారు. మరి కొన్ని చోట్ల విస్మరించారు అని రాస్తే అది గ్రంథ స్వరూపాన్ని చెప్పే అంశం అవుతుంది.
 
 ఆంధ్రీకరణలో ఏవిధమైన మార్పులు చేసినా నన్నయ భారతానికి కావ్యత్వాన్ని కలిగించడానికో, క్షత్రియ బ్రాహ్మణ (రాజ రాజు)కు ప్రాముఖ్యాన్ని కలిగించడానికో చేశారు. కాబట్టి చారిత్రక నేపథ్యాలను ప్రస్తావనలను ప్రతిబింబించే విధంగా ఈ ప్రశ్నకు జవాబు ఉండాలి. ఆ తర్వాతి సంవత్సరాల్లో తిక్కన, ఎర్రన, భారతాంధ్రీకరణం మీద ప్రశ్నలు అడిగిన తీరు ఈ విషయాన్నే బలపరుస్తుంది. కవిత్రయం వారు ముగ్గురూ ధ్వని ప్రస్థానాన్నే సాగించినా నన్నయ వస్తు ధ్వనిని, తిక్కన రస ధ్వనిని, ఎర్రన అలంకార ధ్వనిని అనుసరించారు.
 
 నన్నయ శబ్దగుణాలను, తిక్కన అర్ధ గుణాలను, ఎర్రన సందర్భోచితంగా రెండు గుణాలను పోషించారు. ఒక్క మాటలో చెప్పాలంటే సిలబస్‌ను, ప్రశ్నలను స్నాతకోత్తర స్థాయిలో విశ్లేషించుకోవాలి. అత్యున్నత స్థాయి అధికారులకు ఉండాల్సిన వివేచన, పరిశీలనను పరీక్షించే విధంగానే ప్రశ్నలు ఉంటున్నాయనే అంశాన్ని గుర్తుంచుకోవాలి.
 
 నాలుగు కోణాల్లో:
 ప్రాచీన సాహిత్యంలో కంటే ఆధునిక సాహిత్యంలో సిలబస్‌ను వివేచించడం సులభతరం అనిపిస్తుంది. ఇందులో పదో అంశం.. ఆధునిక తెలుగు ప్రక్రియలు, నవల, నాటకం, ఇత్యాదులు ఇంతకుముందు 60 మార్కులకు ఉండేవి. కాబట్టి సమీక్ష రూపంగా చదివే అవకాశం ఉంది. కాని ప్రస్తుతం ఈ తరహా ప్రశ్నలు 30 మార్కులకు ఉండటం వల్ల ఏ ప్రక్రియనైనా నాలుగు కోణాల్లో పరిశీలించాలి. అవి..నవల/కథానిక/నాటకం వీటన్నిటి..
 1) నేపథ్యం/పుట్టు పూర్వోత్తరాలు
 2) ఆరంభ వికాసాలు
 3) అనువాద/స్వతంత్ర గ్రంథాలు
 4) జాతీయోద్యమ ప్రభావం-అనే కోణంలో పరిశీలించాలి.
 
 రచనలన్నింటినీ కూడా:
 వాగ్గేయకారుల గురించి సన్నద్ధమయేటప్పుడు వారి రచనలన్నింటినీ కూడా సంక్షిప్తంగా తెలుసుకొని ఉండాలి. కేవలం వారి కీర్తనలు/కృతులకు మాత్రమే పరిమితమైతే సరిపోదు. గతంలో వాగ్గేయ కారుల మీద అడిగిన ప్రశ్నలను పరిశీలిస్తే ఈ విషయం మరింత స్పష్టమవుతుంది. 2004 లో ‘భక్తి కవిత్వోద్యమం-త్యాగయ్య’ అనీ 2006లో ‘త్యాగరాజు కవితా మాధురి’ అని 2008లో ‘త్యాగరాజు రచనలు-సారాంశం’ సంక్షిప్తంగా అన్నారు. కాబట్టి అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు-ఈ ముగ్గురి కీర్తనల వైశిష్ట్యం, రచనలు, కవితా వైశిష్ట్యం అనే మూడు కోణాల్లో సంక్షిప్తంగా, సమగ్రంగా తెలుసుకోవాలి.
 
 సిలబస్‌ను ఒక క్రమ పద్ధతిలో అందుకు అనుగుణమైన అంశాలను గుర్తిస్తూ, ప్రశ్నల తీరుతో సమన్వయం చేసుకుంటూ చదివితే పేపర్-1 కొంచెం నిడివి ఎక్కువ అనిపించినా మార్కులు ఎక్కువగా సాధించే అవకాశం ఉంది.
 
 మెయిన్స్‌కు సంబంధించి తెలుగు పేపర్-1, పేపర్-2 అనే భాగాలుగా ఉంటుంది. పేపర్-1 భాషాశాస్త్రం (తులనాత్మక వ్యాకరణానికి సంబంధించింది) తెలుగును ఆప్షనల్‌గా ఎంచుకున్నవారు కచ్చితంగా తెలుగు మాతృభాషగా ఉన్నవారో, వాడుక భాష గురించి క్షుణ్నంగా తెలిసినవారో అయి ఉంటారు. వారందరూ తెలుగు భాషని మూల రూపాలతోనూ, ప్రాచీన పదాలతోనూ; ప్రసార మాధ్యమాల భాషను - తాము నిత్యం మాట్లాడే భాషతో పోల్చిచూస్తే భాషా పరిణామంలోని శాస్త్రీయతను గమనిస్తే ఆసక్తి పెరుగుతుంది. అంతేకాకుండా అభ్యాసం, అధ్యయనంలో పదును పెరుగుతుంది.
 
 పేపరు-2 ప్రాచీన ఆధునిక సాహిత్యాలకు సంబంధించింది. ఈ ఏడాది నుంచి సివిల్స్ మెయిన్‌‌స పరీక్ష విధానం మారిన నేపథ్యంలో తెలుగులో పాత విధానంలో మాదిరిగానే రెండు పేపర్లుంటాయి. ఇంతకు ముందు ఒక్కో పేపర్‌కు 300 మార్కులుండగా ఇప్పుడు ఒక్కో పేపర్‌కు 250 మార్కుల చొప్పున రెండు పేపర్లకు కలిపి 500 మార్కులుంటాయి. సిలబస్‌లో ఎలాంటి మార్పులు లేవు. కాని పరీక్షలో సిలబస్‌కు సంబంధించిన అన్ని అంశాల నుంచి ప్రశ్నలడుగుతున్నారు. అదేవిధంగా అడిగే ప్రశ్నల సంఖ్యలోనూ, మార్కుల సంఖ్యలోనూ తేడాలుండొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement