టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్.. గెలుపు బాట! | tnpsc group | Sakshi
Sakshi News home page

టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్.. గెలుపు బాట!

Published Thu, Oct 22 2015 12:35 AM | Last Updated on Sun, Sep 3 2017 11:18 AM

టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్.. గెలుపు బాట!

టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్.. గెలుపు బాట!

 పస్తుతం లక్షలాది విద్యార్థుల లక్ష్యం... టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్! ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు అభ్యర్థులు ఎంతో కసరత్తు చేస్తున్నారు. అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇంత చేస్తున్నా జయాపజయాలపై సందేహాలు కలవరపెడుతున్నాయి. కొంత ఆందోళనకు గురవుతున్నారు. అయితే పోటీ గురించి ఆందోళన చెందనవసరం లేదని, వ్యూహాత్మకంగా ప్రిపరేషన్ కొనసాగిస్తే గెలుపు మార్గం దిశగా, సాఫీగా సాగిపోవచ్చంటున్న సబ్జెక్టు నిపుణుల సలహాలతో ప్రత్యేక కథనం...
 
 గ్రూప్స్ అంటే ఖాళీలతో సంబంధం లేకుండా పోటీ లక్షల్లోనే ఉంటుందనేది నిస్సందేహం. ఉమ్మడి రాష్ర్టంలో గ్రూప్స్ పరీక్షలకు హాజరైన వారి సంఖ్య దీనికి నిదర్శనం. తెలంగాణలో తొలిసారిగా జరగనున్న గ్రూప్స్ నియామకాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించనుంది. ఇప్పటికే కోచింగ్ సెంటర్లు, గ్రంథాలయాలన్నీ గ్రూప్స్ ఔత్సాహికులతో నిండిపోయాయి. ఇంత తీవ్రంగా ఉన్న పోటీని చూసి, భయపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. సందిగ్ధత వీడి, సంసిద్ధత దిశగా నడవాలని సూచిస్తున్నారు.
 
 ఒత్తిడికి దూరం.. దూరం!
 గూప్స్ ఔత్సాహికులు ముందుగా ప్రిపరేషన్‌కు మానసికంగా సిద్ధమవాలి. ఒత్తిడి అనే మాటకు తావివ్వకూడదు. పోటీ లక్షల్లో ఉన్నా పోస్ట్ సాధించాలనే గట్టి సంకల్పం, విజయం సాధించగలమనే నిండైన ఆత్మవిశ్వాసం అవసరం. అప్పుడే ఎలాంటి ఆటంకాలు ఎదురైనా, వాటిని అధిగమించగలరు. సంకల్ప బలంతో విజయం దిశగా దూసుకెళ్లగలరు.
 
 అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం ప్రధానం. సమయ పాలన విషయంలో కొందరు ‘వారం ఆధారిత’ విధానాన్ని అనుసరిస్తారు. ఒక వారంలో ఒక సబ్జెక్టు, మరో వారం మరో సబ్జెక్టును చదువుతారు. ఇది విజయానికి సరైన ప్రణాళిక కాదు. పేపర్ల వారీగా సిలబస్‌ను విశ్లేషించుకొని, రోజూ అన్ని సబ్జెక్టులు చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. అప్పుడే అన్ని అంశాల మధ్య సమతుల్యత సాధ్యమవుతుంది. అంతకుముందు చదివిన అంశాలను రివిజన్ చేసేందుకు రోజూ కొంత సమయం కేటాయించాలి.
 
 గుర్తుంచుకోండిలా...
 చదివిన అంశాలన్నింటినీ గుర్తుంచుకోవటం కొంత కష్టమే. మెమరీ టిప్స్ ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. ఈ టిప్స్ అభ్యర్థుల స్వీయసామర్థ్యం మేరకు వేర్వేరుగా ఉంటాయి. కొందరు విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా చదివిన అంశాలను గుర్తుంచుకుంటారు. ఉదాహరణకు జనరల్ సైన్స్‌లో ఏదైనా వ్యాధికి సంబంధించిన సమాచారం చదువుతున్నప్పుడు ఆ పుస్తకంలో ప్రచురించిన బొమ్మలు, సమాచార పట్టికలను మైండ్‌లో నిక్షిప్తం చేసుకుంటారు. చదివిన అంశాలను గుర్తుంచుకునేందుకు మరో మార్గం షార్ట్ నోట్స్ రూపకల్పన. ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు అందులోని ముఖ్యాంశాలను పాయింట్లుగా, లేదా తమకు అనుకూలమైన రీతిలో (చార్ట్‌లు, గ్రాఫ్‌లు వంటివి) షార్ట్‌నోట్స్ రూపొందించుకోవాలి.చదివిన అంశాలను ఇతరులతో చర్చించటం కూడా మెమరీ పరంగా బాగా ఉపయోగపడే విధానం.
 
 సొంత నోట్స్‌తో ప్రయోజనం
 సొంత నోట్స్ రూపొందించుకోవడం విజయంలో కీలకపాత్ర పోషిస్తుంది. నోట్స్ రూపకల్పనలో శాస్త్రీయ విధానాన్ని అనుసరించాలి. చదివిన ప్రతి అంశాన్నీ నోట్స్‌లో పొందుపరిస్తే సమయం వృథా అవుతుంది. గణాంకాలు, సంవత్సరాలు, నివేదికలు-సిఫార్సులు వంటి ముఖ్యాంశాలను మాత్రమే రాసుకోవాలి. క్విక్ రివిజన్‌కు ఉపయోగపడేలా నోట్స్ రూపొందించుకోవాలి.
 
 అసలు చదువుతున్న అంశాల్లో ఏవి ముఖ్యమైనవనే సందేహం కలుగుతుంటుంది. గత ప్రశ్నపత్రాలను పరిశీలించటం వల్ల ఏ అంశాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయో తెలుస్తుంది. ప్రశ్న అడిగే విధానంపైనా అవగాహన ఏర్పడుతుంది. సమకాలీన ప్రాధాన్యం ఉన్న అంశాలు కూడా ముఖ్యమైనవి. సీనియర్ ఫ్యాకల్టీ, గత విజేతలు సూచనల మేరకు ప్రామాణిక మెటీరియల్‌ను ఎంపిక చేసుకోవాలి.
 కష్టంగా కాదు.. ఇష్టంగా
 
 కొందరు అభ్యర్థులు పుస్తకాలను ముందేసుకొని, అది ఒక విధిగా, చాలా కష్టంగా భావిస్తూ చదువుతారు. ఇలాంటి దృక్పథం వల్ల తక్కువ సమయంలోనే అయిష్టత ఏర్పడుతుంది. దీనికి పరిష్కారం.. జాయ్‌ఫుల్ రీడింగ్. ప్రతి అంశాన్నీ ఆస్వాదిస్తూ చదవాలి. చదవటాన్ని, సబ్జెక్టు అధ్యయనాన్ని హాబీగా మార్చుకోవాలి. ఒక అంశాన్ని చదువుతుంటే దానికి సంబంధించిన మరో కొత్త అంశాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement