ఐటీ నియామకాలు..తాజా సరళి | Traditional technical degree | Sakshi
Sakshi News home page

ఐటీ నియామకాలు..తాజా సరళి

Published Tue, Dec 27 2016 1:24 AM | Last Updated on Thu, Sep 27 2018 4:07 PM

ఐటీ నియామకాలు..తాజా సరళి - Sakshi

ఐటీ నియామకాలు..తాజా సరళి

ట్రెడిషనల్‌ నుంచి టెక్నికల్‌ డిగ్రీ ఔత్సాహికుల వరకు దాదాపు 80 శాతం మంది విద్యార్థులకు ఉద్యోగ సాధన దిశగా తొలి గమ్యం.. ఐటీ, ఐటీ  అనుబంధ సంస్థలు. వీరంతా ప్రస్తుతం, భవిష్యత్తులో ఐటీ రంగంలో నియామకాలు ఎలా ఉండనున్నాయనే దానిపైనే దృష్టిసారిస్తారు. అయితే రానున్న రోజుల్లో ఐటీ నియామకాలు తగ్గుతాయని కొన్ని వర్గాలు పేర్కొంటుంటే.. మరికొన్ని వర్గాలు ఇందుకు భిన్నంగా మాట్లాడుతున్నాయి.

 క్యూ–2 ఫలితాలు: 2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇటీవల క్యూ–2 (రెండో త్రైమాసిక) ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిని పరిశీలిస్తే కొన్ని కంపెనీల ఫలితాల్లో వృద్ధి కనిపించినా.. నికర లాభాల పరంగా గతేడాదితో పోల్చితే నమోదైన వృద్ధి తక్కువే. ఈ ధోరణి నియామకాలపై ప్రభావం చూపుతుందని ఇండస్ట్రీ వర్గాల
అభిప్రాయం.

అంచనాలు మారే పరిస్థితి: నేషనల్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీస్‌ (నాస్కామ్‌).. 2016–17లో ఐటీ రంగంలో 2.75 లక్షల నియామకాలు జరుగుతాయని గతంలో అంచనా వేసింది. కానీ, ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత తొలి త్రైమాసికంలోనే ఈ అంచనాలు మారే అవకాశం ఉందని, భావించిన దానికంటే 20 శాతం మేర నియామకాలు తక్కువగా జరుగుతాయని పేర్కొంది. అంతేకాకుండా దేశంలో సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థలుగా పేరొందిన కొన్ని సంస్థల్లో (ఇన్ఫోసిస్, ఐబీఎం, టీసీఎస్‌ తదితర) నియామకాలు 2015–16తో పోల్చితే కొంత తక్కువగా నమోదయ్యాయి. ఇదే సరళి రానున్న రోజుల్లోనూ కొనసాగుతుందని పరిశ్రమ వర్గాల అభిప్రాయం.

అంతర్జాతీయ, జాతీయ పరిణామాల ప్రభావం: ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రధానంగా అమెరికా, యూకేల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ ఐటీ కంపెనీలపై ప్రభావం చూపుతున్నాయి. 2014–15లో అమెరికాకు భారత ఐటీ ఎగుమతుల విలువ 80 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అయితే అక్కడ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికవడం, ఆయన విధానాలపై మరింత స్పష్టత వచ్చే వరకు కార్యకలాపాల విస్తరణ లేదా కొనసాగింపుపై దృష్టిసారించే అవకాశాలు కనిపించడం లేదు. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ ఎగ్జిట్‌ కావడం(బ్రెగ్జిట్‌)తో యూకేలో భారత ఐటీ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని స్వయంగా నాస్కామ్‌ పేర్కొంది. మరోవైపు దేశీయంగా కంపెనీలు ముఖ్యంగా ఆటోమేషన్‌ విధానాలపై మొగ్గు చూపడం వల్ల ట్రెడిషనల్‌ హైరింగ్స్‌పై సమీప భవిష్యత్తులో 10–15 శాతం ప్రభావం పడనున్నట్లు ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థకు చెందిన ఉన్నత ఉద్యోగి తెలిపారు.

వాస్తవ నియామక అవసరాలు: దేశంలో 3.7 మిలియన్ల మందికి ఐటీ, ఐటీ అనుబంధ రంగం ఉపాధి కల్పిస్తోంది. ఈ రంగంలో వాస్తవ నియామక అవసరాలకు సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే ప్రస్తుతం ఐటీ, బీపీవో రంగాల్లో 1.2 మిలియన్ల నుంచి 2 మిలియన్ల వరకు మానవ వనరుల అవసరం ఉంది. అయితే ఆటోమేషన్, అంతర్జాతీయ పరిణామాలు, కంపెనీల వృద్ధి ఫలితాల నేపథ్యంలో 20 శాతం మేర తగ్గుదల కనిపించే పరిస్థితి ఏర్పడింది.

ఐఐటీల్లో ఆశాజనకంగా: ఐఐటీల్లో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఇటీవల ఐఐటీల్లో ప్రీ ప్లేస్‌మెంట్‌ ఆఫర్స్‌ డ్రైవ్స్‌లో 25 నుంచి 30 శాతం మేరకు వృద్ధి నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. ఇప్పటికే ఐటీ దిగ్గజాలుగా పేరొందిన సంస్థలతోపాటు మిడిల్‌ లెవల్‌ ఐటీ కంపెనీలు దాదాపు 100 వరకు తాము నిర్వహించే ప్లేస్‌మెంట్‌ సెషన్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపినట్లు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐఐటీ ప్లేస్‌మెంట్‌ సెల్‌ హెడ్‌ తెలిపారు. అయితే ఐఐటీల్లో క్యాంపస్‌ హైరింగ్స్‌లో పాల్గొనడం అనేది .. ఇండస్ట్రీ ట్రెండ్‌తో సంబంధం లేని విషయమని, ఈసారి పే ప్యాకేజీల్లో కొంత తగ్గుదల మాత్రం ఖాయమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

అట్రిషన్‌ లేకపోవడం
ఐటీ కంపెనీల్లో కొత్త నియామకాల పరంగా కొంత తగ్గుదల కనిపించడానికి.. ఇటీవల కాలంలో అట్రిషన్‌
(కంపెనీలు మారడం) రేటు తక్కువగా ఉండటం కూడా కారణంగా కనిపిస్తోంది. ఎంట్రీ లెవల్‌లో సైతం ఉద్యోగులు స్థిరత్వం దిశగా ఒక కంపెనీలోనే కనీసం మూడు, నాలుగేళ్లయినా పని చేయాలనే
దృక్పథంతో వ్యవహరిస్తున్నారు.

హైరింగ్‌ ట్రెండ్స్‌ ఎలా ఉన్నప్పటికీ కంపెనీలు ఎంట్రీ లెవల్, మిడ్‌ లెవల్‌ ఉద్యోగ నియామకాల పరంగా అభ్యర్థుల్లో ఐటీ రంగంలోని అప్‌డేటెడ్‌ స్కిల్స్‌పై దృష్టిసారిస్తున్నాయి. అలాంటి వారికి అవకాశం కల్పించేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
– ప్రొఫెసర్‌ వి.ఉమామహేశ్వర్,
ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్, ఓయూసీఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement