భవిష్యత్తును తెలుసుకునేందుకు.. ఆస్ట్రాలజీ
అప్‌కమింగ్ కెరీర్ : తమ స్థితిగతులను, భవిష్యత్తును తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలామంది విశ్వసించే ప్రాచీన విధానం.. జ్యోతిష్యం లేదా జోస్యం(ఆస్ట్రాలజీ). జీవితంలో జరిగిపోయిన జరుగుతున్న, జరగబోయే విషయాలను జననకాలం, గ్రహస్థితిని బట్టి చెప్పడాన్నే జ్యోతిష్యం అంటున్నారు. ఇది హిందూ ధర్మ శాస్త్రం. ఆరు వేదాంగాల్లో ఇది కూడా ఒకటిగా గుర్తింపు పొందింది. ఇప్పటికీ జనాదరణ పొందుతున్న ప్రాచీన శాస్త్రాల్లో జ్యోతిష్యం కూడా ఉంది. హస్త సాముద్రికం, గోచారం, నాడీ జోస్యం, న్యూమరాలజీ మొదలైన వాటిని జ్యోతిష్యంలో భాగంగా పరిగణిస్తున్నారు. జ్యోతిష్యానికి ఆదరణ పెరుగుతుండడంతో యువత దీన్ని కెరీర్‌గా ఎంచుకొనేందుకు ఆసక్తి చూపుతోంది.
టీవీ ఛానళ్లలోనూ అవకాశాలు
ఆధునిక కాలంలో జ్యోతిష్యం అనేది మంచి ఆదాయాన్ని అందించే ఆకర్షణీయ మైన కెరీర్‌గా మారింది. ప్రస్తుతం ఆస్ట్రాలజిస్టులకు మంచి డిమాండ్ ఉంది. తమ ఆర్థిక, సామాజిక పరిస్థితిని మార్చుకోవాలనుకునేవారు జ్యోతిష్యులను సంప్రదిస్తున్నారు. వారి సలహాల మేరకు నడుచుకుంటున్నారు. నూతన కార్యాలను చేపట్టడా నికి శుభ ముహూర్తాల కోసం ఆస్ట్రాలజర్ల సూచనలు తీసుకుంటున్నారు. ఇక టీవీ ఛానళ్లలోనూ ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. ఉదయం వారఫలాల కార్యక్రమాల్లో ఆస్ట్రాలజర్లు పాల్గొంటున్నారు. ఇటీవలి కాలంలో కంప్యూటర్ జ్యోతిష్యానికి గిరాకీ పెరిగింది. ఆస్ట్రాలజర్‌గా ప్రతిభను మెరుగుపర్చుకుంటే అధిక ఆదాయాన్ని ఆర్జించొచ్చు. వీలును బట్టి పార్ట్‌టైమ్‌గా, ఫుల్‌టైమ్‌గా పనిచేసుకోవచ్చు. ఆస్ట్రాలజర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలంటే మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. క్లయింట్లకు అర్థమయ్యేలా చెప్పగలిగే నేర్పు అవసరం. మంచి కౌన్సెలర్‌కు ఉండే లక్షణాలు ఉండాలి.
అర్హతలు: మనదేశంలో ఎన్నో విద్యాసంస్థలు ఆస్ట్రాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. సాధారణంగా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత వీటిలో చేరొచ్చు.
వేతనాలు: ఆస్ట్రాలజర్లు తమ నైపుణ్యాలను బట్టి ఎంతైనా సంపాదించుకోవచ్చు. ప్రారంభంలో నెలకు రూ.10 వేలకు తక్కువ కాకుండా ఆదాయం లభిస్తుంది. తర్వాత ప్రతిభ, అనుభవాన్ని బట్టి అధిక ఆదాయం ఆర్జించొచ్చు. నెలకు లక్ష రూపాయలకు పైగా సంపాదించే జ్యోతిష్యులు మనదేశంలో ఉన్నారు.
ఆస్ట్రాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
ఉస్మానియా యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.osmania.ac.in
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
వెబ్‌సైట్: http://teluguuniversity.ac.in
జ్యోతిష్యశాస్త్రానికి ఆదరణ
భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలు సైన్స్‌తో ముడిపడినవే అనేది వాస్తవం. ఇప్పటి పరిశోధనల్లోనూ అదే నిర్ధారణ అవుతోంది. పాశ్చాత్య జ్యోతిష్యంతో పోల్చితే వేదిక్ ఆస్ట్రాలజీనే అధికశాతం విశ్వసిస్తున్నారు. జీవనస్థితి గతులను తెలుసుకోవడానికే కాకుండా స్టాక్‌మార్కెట్‌లలోనూ ఆస్ట్రాలజర్లను నియమించుకుంటున్నారు. అయితే దీన్ని మూఢ నమ్మకంగా కాకుండా శాస్త్రంగా భావించినప్పుడు అందరికీ మేలు జరుగుతుంది. గతంతో పోల్చితే ప్రస్తుతం ఈ సబ్జెక్టుకు క్రేజ్ పెరిగింది. పలు విద్యాసంస్థలు ఆస్ట్రాలజీలో సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తున్నాయి. వేదిక ఆస్ట్రాలజీలో భారతీయులకు విపరీతమైన డిమాండ్ ఉంది. విదేశాల్లో 5 నిమిషాలకు 10 డాలర్లు తీసుకుంటారు. మొబైల్, టీవీ ఛానెల్స్, ఆన్‌లైన్ విభాగాల్లో అవకాశాలు అనేకం. విద్యార్థిగా ఉన్నప్పుడే ప్రిడెక్షన్ విభాగంలో ఉద్యోగం ఇచ్చేందుకు సంస్థలు పోటీపడుతున్నాయి.
-డాక్టర్ సి.వి.బి.సుబ్రహ్మణ్యం,
హెడ్ ఆఫ్ ఆస్ట్రాలజీ డిపార్ట్‌మెంట్, తెలుగు విశ్వవిద్యాలయం