భవ్యమైన కెరీర్‌కు.. లెదర్ టెక్నాలజీ | Will use to choose best career with Leather technology | Sakshi
Sakshi News home page

భవ్యమైన కెరీర్‌కు.. లెదర్ టెక్నాలజీ

Published Fri, Jul 18 2014 12:42 AM | Last Updated on Sat, Sep 2 2017 10:26 AM

భవ్యమైన కెరీర్‌కు.. లెదర్ టెక్నాలజీ

భవ్యమైన కెరీర్‌కు.. లెదర్ టెక్నాలజీ

ప్రాచీన కాలంలో జంతువుల చర్మాన్నే మనుషులు దుస్తులుగా ధరించేవారు. ఆధునిక యుగంలో రకరకాల వస్త్రాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. జంతు చర్మంతో రూపొందించిన వస్తువులను ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. తోలుతో తయారు చేసిన పాదరక్షలు, బ్యాగులు, పర్సులు, బెల్ట్‌లు, రెయిన్ కోట్లకు మంచి డిమాండ్ ఉంది. తోలు వస్తువుల వాడకాన్ని హోదాకు చిహ్నంగా భావిస్తున్నారు. భారత్‌లో తోలు పరిశ్రమ వేగంగా అభి వృద్ధి చెందుతోంది. తోలు ఎగుమతుల ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరు తోంది. మనదేశంలో ప్రతిఏటా 2 బిలియన్ చదరపు అడుగుల ముడి తోలు ఉత్పత్తవు తోంది. ఈ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకా శాలు పుష్కలంగా లభిస్తున్నాయి. లెదర్ టెక్నా లజీని కెరీర్‌గా ఎంచుకుంటే..  భవిష్యత్తుకు ఢోకా ఉండదని నిస్సందేహంగా చెప్పొచ్చు.
 
 అవకాశాలు ఎన్నెన్నో..
 లెదర్ టెక్నాలజీ కోర్సులను చదివిన వారికి మెరుగైన అవకాశాలు దక్కుతున్నాయి. ప్రధానంగా తోలు శుద్ధి పరిశ్రమల్లో లెదర్ టెక్నాలజిస్టుల అవసరం ఎక్కువగా ఉంది. మనదేశంలో హైదరాబాద్, చెన్నై, ఆగ్రా, కాన్పూర్, జలంధర్, కోల్‌కతా, ముంబై తదితర నగరాల్లో తోలు పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. లెదర్ గూడ్స్, లెదర్ గార్మెంట్స్ కంపెనీలు లెదర్ టెక్నాలజిస్టులను నియమించుకుంటు న్నాయి. లెదర్ కెమికల్స్ కంపెనీల్లోనూ అవకాశాలుంటాయి. దేశ విదేశాల్లో తోళ్ల వ్యాపారం నిర్వహించే సంస్థల్లోనూ ఉద్యోగాలు పొందొచ్చు. ఈ రంగంలో కొంత అనుభవం సంపాదించిన తర్వాత సొంతంగా లెదర్ ఫినిషింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకుంటే అధిక ఆదాయం పొందడానికి ఆస్కారం ఉంటుంది. తగిన ఆసక్తి ఉంటే యూనివర్సిటీ లు/కళాశాలల్లో ఫ్యాకల్టీగా కూడా స్థిరపడొచ్చు.
 
టెక్నాలజీని అప్‌డేట్ చేసుకోవాలి
 లెదర్ టెక్నాలజిస్టుగా రాణించాలంటే.. టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, శ్రమించే తత్వం, నాయకత్వ లక్షణాలు ఉండాలి. తోలు శుద్ధి పరిశ్రమలు సాధారణంగా జనావాసాలకు దూరంగా ఏర్పాటవుతాయి. ఇందులో రసాయనాల వినియోగం ఎక్కువ. కాబట్టి అక్కడ పనిచేసేందుకు సిద్ధపడాలి. లెదర్ టెక్నాలజిస్టులకు కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, బయోటెక్నాలజీ, ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్‌పై బేసిక్ నాలెడ్జ్ ఉండాలి.
 
 అర్హతలు:
 లెదర్ టెక్నాలజీలో డిప్లొమా, బీటెక్, ఎంటెక్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత డిప్లొమా/బీటెక్‌లో చేరొచ్చు. ఎంటెక్ కూడా పూర్తిచేస్తే మంచి అవకాశాలు ఉంటాయి.  
 
 వేతనాలు:

 లెదర్ టెక్నాలజీలో బీటెక్ పూర్తిచేసిన వారు ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం అందుకోవచ్చు. తర్వాత అనుభవం, పనితీరు ఆధారంగా వేతనం పెరుగుతుంది.
 
లెదర్ టెక్నాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు
గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ-గోల్కొండ, హైదరాబాద్
సెంట్రల్ లెదర్ రీసెర్‌‌చ ఇన్‌స్టిట్యూట్ - చెన్నై
వెబ్‌సైట్: www.clri.org
అన్నా యూనివర్సిటీ-చెన్నై
వెబ్‌సైట్: www.annauniv.edu
వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ-కోల్‌కతా
వెబ్‌సైట్: www.wbut.ac.in
హర్‌కోర్ట్ బట్లర్ టెక్నలాజికల్ ఇన్‌స్టిట్యూట్-కాన్పూర్
వెబ్‌సైట్: www.hbti.ac.in
 
 విదేశాల్లోనూ అవకాశాలు
 ‘‘పాస్.. ఫెయిల్‌తో సంబంధం లేకుండా మెరుగైన కెరీర్‌ను అందించే కోర్సులు... లెదర్ టెక్నాలజీ, ఫుట్‌వేర్ టెక్నాలజీ. మూడున్నరేళ్ల కోర్సు సమయంలో ఏడాదిపాటు ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది. కోర్సు పూర్తయ్యాక ప్రారంభ వేతనం రూ.10వేల వరకూ ఉంటుంది. మనదేశంతోపాటు విదేశాల్లోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయి. లెదర్ టెక్నాలజీ కోర్సులను అభ్యసిస్తే మంచి వేతనంతో కెరీర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు’’
 - అన్నే శివాజీ, సీనియర్ లెక్చరర్, గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ, హైదరాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement