రూ.65 కోట్లతో చర్మపరిశ్రమ అభివృద్ధి  | Development of leather industry with Rs 65 crores | Sakshi
Sakshi News home page

రూ.65 కోట్లతో చర్మపరిశ్రమ అభివృద్ధి 

Published Tue, May 16 2023 3:51 AM | Last Updated on Tue, May 16 2023 10:30 AM

Development of leather industry with Rs 65 crores - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రూ.65 కోట్లతో చర్మపరిశ్రమ అభివృద్ధి చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పా­రు. ఆయన సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్‌ చర్మ పరిశ్రమాభివృద్ధి సంస్థ (లిడ్‌క్యాప్‌) కా­ర్య­కలాపాలను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో లిడ్‌క్యాప్‌కు అత్యంత విలువైన 133.74 ఎకరాల భూములున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఈ భూములు, భవనాలన్నింటినీ వినియోగంలోకి తెచ్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.

పీఎం అజయ్‌ పథకం కింద మంజూరైన రూ.11.50 కోట్లతో కృష్ణాజిల్లాలోని జి.కొండూరు, ప్రకాశం జిల్లాలోని యడవల్లిల్లో రెండు పాదరక్షల తయారీ (ఫుట్‌వేర్‌ మాన్యుఫాక్చర్‌)  కేంద్రాలు నిర్మించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన టెండర్‌ ప్రక్రియ కొనసాగుతోందన్నా­రు. విజయవాడ ఆటోనగర్‌ గేట్‌ వద్ద ఉన్న భూ­మి­లో చర్మ ఉత్పత్తుల శిక్షణ, విక్రయాలకు అవసరమైన భవనాన్ని నిర్మించే ప్రతిపాదన ఉందని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 9 మినీ లెదర్‌పార్కులను నిర్మించడానికి కూడా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇవికాకుండా రూ.65 కోట్లతో లిడ్‌క్యాప్‌లో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. దీన్లో భాగంగా పాదరక్షలకు సంబంధించిన రూ.10 కోట్లతో కామన్‌ ఫెసిలిటీ సెంటర్, రూ.30 కోట్లతో చర్మపరిశ్రమకు సంబంధించిన శిక్షణ కోసం కామన్‌ ఫెసిలిటీ సెంటర్, రూ.15 కోట్లతో కొత్త భవనాల నిర్మాణం, రూ.10 కోట్ల­తో ప్రస్తుతం ఉన్న భవనాల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వివరించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రాష్ట్రంలో చర్మపరిశ్రమ అభివృద్ధికి, చర్మకారుల సంక్షేమానికి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. లిడ్‌క్యాప్‌ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నా­రని చెప్పారు. తాను సూచించిన ప్రతిపాదనలు, కోరిన వివరాలతో వారం రోజుల్లో మరోసారి సమావేశానికి రావాలని లిడ్‌క్యాప్‌ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో లిడ్‌క్యాప్‌ ఎండీ శంకర్, జీఎం నల్లమోతు అధికారి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement