Leather industry
-
రూ.65 కోట్లతో చర్మపరిశ్రమ అభివృద్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రూ.65 కోట్లతో చర్మపరిశ్రమ అభివృద్ధి చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. ఆయన సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ చర్మ పరిశ్రమాభివృద్ధి సంస్థ (లిడ్‌క్యాప్) కార్యకలాపాలను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో లిడ్‌క్యాప్‌కు అత్యంత విలువైన 133.74 ఎకరాల భూములున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఈ భూములు, భవనాలన్నింటినీ వినియోగంలోకి తెచ్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. పీఎం అజయ్ పథకం కింద మంజూరైన రూ.11.50 కోట్లతో కృష్ణాజిల్లాలోని జి.కొండూరు, ప్రకాశం జిల్లాలోని యడవల్లిల్లో రెండు పాదరక్షల తయారీ (ఫుట్‌వేర్ మాన్యుఫాక్చర్) కేంద్రాలు నిర్మించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. విజయవాడ ఆటోనగర్ గేట్ వద్ద ఉన్న భూమిలో చర్మ ఉత్పత్తుల శిక్షణ, విక్రయాలకు అవసరమైన భవనాన్ని నిర్మించే ప్రతిపాదన ఉందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 9 మినీ లెదర్‌పార్కులను నిర్మించడానికి కూడా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇవికాకుండా రూ.65 కోట్లతో లిడ్‌క్యాప్‌లో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. దీన్లో భాగంగా పాదరక్షలకు సంబంధించిన రూ.10 కోట్లతో కామన్ ఫెసిలిటీ సెంటర్, రూ.30 కోట్లతో చర్మపరిశ్రమకు సంబంధించిన శిక్షణ కోసం కామన్ ఫెసిలిటీ సెంటర్, రూ.15 కోట్లతో కొత్త భవనాల నిర్మాణం, రూ.10 కోట్లతో ప్రస్తుతం ఉన్న భవనాల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రాష్ట్రంలో చర్మపరిశ్రమ అభివృద్ధికి, చర్మకారుల సంక్షేమానికి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. లిడ్‌క్యాప్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. తాను సూచించిన ప్రతిపాదనలు, కోరిన వివరాలతో వారం రోజుల్లో మరోసారి సమావేశానికి రావాలని లిడ్‌క్యాప్ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో లిడ్‌క్యాప్ ఎండీ శంకర్, జీఎం నల్లమోతు అధికారి తదితరులు పాల్గొన్నారు. -
‘ఏపీలో రూ.65 కోట్లతో లెదర్ పరిశ్రమాభివృద్ధి’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రూ.65 కోట్లతో లెదర్ పరిశ్రమాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా లెదర్ పరిశ్రమాభివృద్ధి సంస్థకు చెందిన భూములు, భవనాలన్నింటినీ ఉపయోగంలోకి తీసుకురావడానికి కార్యాచరణ పథకాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ చర్మపరిశ్రమాభివృద్ధి సంస్థ (లిడ్ క్యాప్) కార్యకలాపాలను మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగానే నాగార్జున మాట్లాడుతూ విజయవాడ నడిబొడ్డున ఆటోనగర్ గేట్లో లిడ్ క్యాప్ కు అత్యంత విలువైన భూమి ఉందని చెప్పారు. ఇది కాకుండా శ్రీకాకుళం జిల్లాలోని వెన్నెలవలస, పార్వతీపురం జిల్లాలోని అద్దపుశీల, ఏలూరు జిల్లాలోని నూజివీడు, పల్నాడు జిల్లాలోని అడిగొప్పుల, ప్రకాశం జిల్లాలోని యడవల్లి, అనంతపురం జిల్లాలోని రాచపల్లి, రాళ్ల అనంతపురం, కృష్ణా జిల్లాలోని జి.కొండూరు, తిరుపతి జిల్లా కేంద్రాల్లో మొత్తం 133.74 ఎకరాల భూములు ఉన్నాయని తెలిపారు. ఈ భూముల్లో అత్యధికంగా అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఉన్నాయన్నారు. వీటిలో భవనాలతో పాటుగా శిక్షణలకు ఉపయోగపడే షెడ్లు కూడా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ఈ భూములు, భవనాలన్నింటినీ ఉపయోగంలోకి తెచ్చేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని వివరించారు. పీఎం అజయ్ పథకం కింద ఇదివరకు మంజూరైన రూ.11.50 కోట్ల నిధులతో కృష్ణా జిల్లాలోని జి.కొండూరు, ప్రకాశం జిల్లాలోని యడవల్లిలలో రెండు పాదరక్షల తయారీ (ఫుట్ వేర్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్) కేంద్రాల నిర్మాణాలు ప్రారంభం కానున్నాయని నాగార్జున వెల్లడించారు. దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. విజయవాడ ఆటోనగర్ గేట్ లో ఉన్న భూమిలో చర్మ ఉత్పత్తుల శిక్షణ, విక్రయాలకు అవసరమైన ఒక పెద్ద భవనాన్ని నిర్మించే ప్రతిపాదన ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9 మినీ లెదర్ పార్క్ లను నిర్మించడానికి కూడా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇదికాకుండా రూ.65 కోట్లతో లిడ్ క్యాప్ లో పలు అభివృద్ధి పనులను చేపట్టనున్నామని, దీనిలో భాగంగానే పాదరక్షల కు సంబంధించిన కామన్ ఫెసిలిటీ సెంటర్ ను రూ.10 కోట్లతోనూ, చర్మపరిశ్రమకు సంబంధించిన శిక్షణల కోసం మరో కామన్ ఫెసిలిటీ సెంటర్ ను రూ.30 కోట్లతోనూ, కొత్త భవనాల నిర్మాణాలను రూ.15 కోట్లతోనూ, ప్రస్తుతం ఉన్న భవనాల అభివృద్ధిని రూ.10 కోట్లతోనూ చేపట్టనున్నామని మంత్రి వివరించారు. అలాగే లిడ్ క్యాప్‌ను మరింత బలోపేతం చేయడానికి ఉన్న ఇతర అవకాశాలను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రాష్ట్రంలో చర్మపరిశ్రమాభివృద్ధికి, చర్మకారుల సంక్షేమానికి కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. లిడ్ క్యాప్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. తాను సూచించిన ప్రతిపాదనలు, కోరిన వివరాలతో వారం రోజుల్లో మరోసారి సమీక్షా సమావేశానికి రావాలని లిడ్ క్యాప్ అధికారులను నాగార్జున ఆదేశించారు. ఈ కార్యక్రమంలో లిడ్ క్యాప్ ఎండీ శంకర్, జీఎం నల్లమోతు అధికారి, ఫెలో శ్యామ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సీఎం జగన్ తిరుపతి పర్యటన.. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
-
అపాచీ పరిశ్రమతో 10 వేల మందికి ఉద్యోగాలు : సీఎం జగన్
సాక్షి, తిరుపతి జిల్లా: శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఇనగలూరులో రూ. 700 కోట్లతో ఏర్పాటు చేయబోతున్న అపాచీ పరిశ్రమకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఇనగలూరులో అపాచీ పరిశ్రమ ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమన్నారు. మొదటి దశలో రూ.350 కోట్లు, వచ్చే ఐదేళ్లలో మరో 350 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. అపాచీ పరిశ్రమలో అడిడాస్ షూలు, లెదర్ జాకెట్స్, బెల్ట్‌లు వంటి ఉత్పత్తులను తయారు చేస్తారు. అపాచీ పరిశ్రమ ఏర్పాటుతో 10 వేల మందికి ఉద్యోగాలు అవకాశాలు లభిస్తాయన్నారు. 2023 సెప్టెంబర్ కల్లా పరిశ్రమ అందుబాటులోకి వస్తుందన్నారు. పరిశ్రమ ఏర్పాటుతో 80 శాతం మంది స్థానికులకే ఉద్యోగాలు వస్తాయని సీఎం జగన్ తెలిపారు. ఏపీ ప్రభుత్వం తోడ్పాటు మరువలేనిది: టోనీ పరిశ్రమల ఏర్పాటుకు సహకారం అందించిన ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి అపాచీ కంపెనీ డైరెక్టర్ టోనీ కృతజ్ఞతలు తెలియజేశారు. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అందించిన తోడ్పాటు మరువలేనిదన్నారు. పారిశ్రామికరంగాన్ని సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారన్నారు. చదవండి: (ఒక్క రూపాయికే పక్కా ఇల్లు) -
తోలు పరిశ్రమకు ప్రోత్సాహకాలు పొడిగింపు!
న్యూఢిల్లీ: దేశీయంగా తయారీ, ఉపాధి కల్పన, ఎగుమతులకు ఊతమిచ్చే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తోలు, పాదరక్షల పరిశ్రమలకు ప్రోత్సాహక పథకాన్ని (ఐఎఫ్ఎల్ఏడీపీ) 2025–26 దాకా పొడిగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2021–22 నుంచి 2025–26 మధ్య కాలంలో ఈ స్కీమ్ కింద రాయితీల విలువ సుమారు రూ. 1,700 కోట్ల మేర ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ మేరకు ఒక ప్రతిపాదనను ప్రభుత్వానికి సమరి్పంచిందని, కేంద్ర క్యాబినెట్ దీన్ని త్వరలోనే ఆమోదించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వ్యయాలపై ఆరి్థక శాఖ కమిటీ దీనికి ఇప్పటికే ఆమోదముద్ర వేసిందని వివరించారు. గతంలో 2017–18 నుంచి 2019–20 మధ్య కాలంలో రూ. 2,600 కోట్ల వ్యయాల అంచనాలతో కేంద్రం ఐఎఫ్ఎల్ఏడీపీని ప్రకటించింది. తాజాగా పథకం ప్రకారం తోలు, పాదరక్షల రంగంలో దేశీ బ్రాండ్ల ప్రమోషన్ కోసం రూ. 100 కోట్లు, డిజైన్ స్టూడియోల అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు, తోలు పరిశ్రమ సమగ్రాభివృద్ధి కోసం రూ. 500 కోట్లు, సంస్థాగత కేంద్రాల ఏర్పాటుకు రూ. 200 కోట్లు మేర వ్యయాల ప్రతిపాదనలు వీటిలో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కనీసం 10 భారతీయ బ్రాండ్లను ప్రమోట్ చేసేందుకు అవసరమైన సహకారం లభిస్తుంది. 10 డిజైన్ స్టూడియోల అభివృద్ధి కోసం కావాల్సిన సహాయం అందుతుంది. ఇక మెగా లెదర్ ఫుట్‌వేర్, యాక్సెసరీస్ క్లస్టర్ డెవలప్మెంట్ సబ్–స్కీమ్ కింద స్థల అభివృద్ధి, తయారీ కేంద్రాలు, పరిశోధన–అభివృద్ధి కార్యకలాపాలపరమైన తోడ్పాటు లభిస్తుంది. -
పులివెందులలో అపాచీ లెదర్ కంపెనీ
సాక్షి, కడప: పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ప్రఖ్యాత లెదర్ కంపెనీ అపాచీ ‘ఇంటిలిజెంట్ ఎస్ఈజెడ్’ ఏర్పాటుకు ఆతిథ్యం ఇస్తున్నట్లు కలెక్టర్ హరి కిరణ్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో అపాచీ ఫుట్‌వేర్ గ్రూప్ కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సంకల్పించారన్నారు. జిల్లాలోని యువతకు విస్తృతంగా ఉద్యోగం, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో పులివెందుల పట్టణాభివృద్ధి సంస్థ (పాడా) పరిధిలో ఏర్పాటు కానున్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్కు (ఐడీపీ)లో 27 ఎకరాల స్థలాన్ని సుప్రసిద్ధ అపాచీ ఫుట్‌వేర్ కంపెనీకి కేటాయించారన్నారు. ఇంటిలిజెంట్ ఎస్ఈజెడ్ పేరుతో ప్రారంభిస్తున్న ఈ లెదర్ పరిశ్రమ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని ఇనగళూరు వద్దనున్న ప్రధాన శాఖకు అనుబంధంగా నడుస్తుందన్నారు. ఈనెల 24వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతులమీదుగా ఈ లెదర్ పరిశ్రమకు శంకుస్థాపన జరుగుతుందని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జేసీలు గౌతమి, సాయికాంత్‌వర్మ, అపాచీ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ సిమోగ్ చెంగ్, అపాచీ ఫుట్‌వేర్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ వైస్ జనరల్ మేనేజర్ (బిజినెస్) గోవిందస్వామిముత్తు, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ జయలక్ష్మి, జిల్లా పరిశ్రమలశాఖ జీఎం చాంద్‌బాషా పాల్గొన్నారు. చదవండి: (వైఎస్ జగన్ మాట ఇస్తే తప్పరు: తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి) స్థలాన్ని పరిశీలించిన కంపెనీ ప్రతినిధులు పులివెందుల: పులివెందులలోని జేఎన్టీయూ వెనుక వైపున నిర్మించనున్న అపాచి లెదర్ కంపెనీ ఏర్పాటు స్థలాన్ని సోమవారం ఆ కంపెనీ ప్రతినిధులు పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఏపీఐఐసీ భూములలో 27.94 ఎకరాల విస్తీర్ణాన్ని ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి కంపెనీ ప్రతినిధులకు చూపించారు. స్థలాన్ని పరిశీలించిన వారిలో అపాచి కంపెనీ ప్రతినిధులు స్పెషల్ అసిస్టెంట్లు సైమన్, హరియన్, వైస్ జీఎం ముత్తు గోవిందుస్వామి, సివిల్ ఇంజినీర్ గుణ, పీఆర్ఓ రాజారెడ్డిలు ఉన్నారు. చదవండి: (మనం కట్టేవి 'ఊళ్లు') -
‘బంగారు గుడ్లు పెట్టే బాతు’ను చంపిందెవరు?
న్యూఢిల్లీ: ‘మా దేశంలో బంగారు గుడ్లు పెట్టే బాతును చంపేశారు’ భారత్‌లోని ప్రముఖ షూ ఎక్స్‌పోర్టర్ కంపెనీ ‘పార్క్ ఎక్స్‌పోర్ట్స్’ సీఈవో నజీర్ అహ్మద్, ఆగ్రా నుంచి టెలిఫోన్లో రాయిటర్స్ సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్య ఇది. ఎందుకు ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ఆయన అంటున్న బంగారు గుడ్లు పెట్టే బాతు ఏమిటీ? దాన్ని ఎవరు చంపేశారు? చంపితే ఆయనకెందుకు అంత ఆందోళన! నజీర్ అహ్మద్ ప్రముఖ షూ కంపెనీ యజమాని కనుక ఆయన మాట్లాడుతున్నది ఆయన కంపెనీ ఉత్పత్తుల ఎగుమతుల గురించేనని సులభంగానే గ్రహించవచ్చు. ఇక ఆయన బంగారు బాతుగా వర్ణించినది తోళ్ల పరిశ్రమ. ఈ పరిశ్రమపై ఆధారపడే పలు భారత్‌కు చెందిన కంపెనీలు చెప్పులు, బూట్లు, తోలు బ్యాగులు, వస్త్రాలను ఎగుమతి చేస్తున్నాయి. వీటి ఎగుమతుల్లో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం భారత్. వీటి ఎగుమతులు గత మార్చి నెల నుంచి ఇప్పటి వరకు భారీగా పడిపోయాయి. పర్యవసానంగా కొన్ని తోళ్ల పరిశ్రమలతోపాటు కొన్ని చెప్పుల పరిశ్రమలు మూతపడ్డాయి. దాదాçపు 30 లక్షల మంది చిరుద్యోగులు రోడ్డున పడ్డారు. గత ఏప్రిల్–మే నెలలో దేశం నుంచి బూట్ల ఎగుమతులు నాలుగు శాతం అంటే, 68 కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులు పడిపోయాయి. సెప్టెంబర్ నాటికి 13 శాతం పడిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో యాభై శాతానికిపైగా ఎగుమతులు పడిపోయే ప్రమాదం ఉంది. జారా అండ్ క్లార్క్స్కు చెందిన ఇండిటెక్స్, హెచ్ అండ్ ఎమ్ లాంటి అంతర్జాతీయ బ్రాండ్ కంపెనీలు బూట్ల దిగుమతిలో భారత్‌కు స్వస్తి చెప్పి చైనా, బంగ్లాదేశ్, ఇండోనేషియా, పాకిస్తాన్ దేశాలకు ఆర్డర్లు ఇవ్వడం ప్రారంభించాయని భారత ఎగుమతిదారుల సంఘాల సమాఖ్య మాజీ అధ్యక్షుడు చెన్నైకి చెందిన ప్రముఖ చెప్పుల వ్యాపారి ఎం. రఫీక్ అహ్మద్ తెలిపారు. దేశంలో తోళ్ల పరిశ్రమ కుంటుపడడం వల్ల తాము సకాలంలో ఆర్డర్లను పూర్తి చేయలేమనే ఉద్దేశంతోనే అంతర్జాతీయ బ్రాండ్ కంపెనీలు తరలిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ గత మార్చి నెలలో పదవీ బాధ్యతలు స్వీకరించడంతోనే దేశంలో తోళ్ల పరిశ్రమకు గడ్డుకాలం ప్రారంభమైంది. రాష్ట్రంలోని లైసెన్స్‌లేని కబేళాలను నిషేధిస్తూ ఆయన తీసుకొచ్చిన ఉత్తర్వులు తోళ్ల పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీసింది. చిన్న చిన్న మాంసం కొట్లు అనియత రంగంలో ఎక్కువగా పనిచేస్తున్నాయని, వాటన్నింటికీ లైసెన్స్ తీసుకోవడం కష్టమని వాటి యజమానులు ఎన్ని విజ్ఞప్తులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వినిపించుకోలేదు. బర్రెలను కోసే చిన్న చిన్న కొట్లతోపాటు పెద్ద స్థాయి కబేళాలు కూడా మూత పడ్డాయి. చెప్పుల పరిశ్రమకు ఎక్కువగా బర్రెల చర్మాలనే వాడుతారు. మాంసం, తోళ్ల ఎగుమతుల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చింది. ఈ రెండు పరిశ్రమల కారణంతా రాష్ట్ర ఖజానాకు ఏటా 56 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. ఈ నేపథ్యంలోనే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవసాయ అవసరాలకు మినహా పశువులను సంతల్లో విక్రయించరాదంటూ నిబంధనలను తీసుకొచ్చింది. ఈ ఉత్తర్వులు పుండు మీద కారం చల్లినట్లయింది. దేశంలో మాంసంతోపాటు తోళ్ల పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింటూ వచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టేను మంజూరు చేసినప్పటికీ గోరక్షకుల దాడికి భయపడుతుండడంతో తోళ్ల పరిశ్రమ కోలుకోలేక పోయింది. జీఎస్టీ కారణంగా ఉత్పత్తుల ధరలు కూడా ఆరేడు శాతం పెరగడం ప్రతికూల ప్రభావాన్నే చూపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన కొత్తలో తోళ్ల పరిశ్రమ ఎగుమతులను 2020 నాటికి 2700 కోట్ల డాలర్లకు తీసుకెళతానని, లక్షలాది కొత్త ఉద్యోగాలు సష్టిస్తానని దేశ ప్రజలకు వాగ్ధానం చేశారు. అందులో భాగంగానే ఆయన ప్రభుత్వం 2016–2017 ఆర్థిక సంవత్సరానికి తోళ్ల పరిశ్రమ ఎగుమతులను 570 కోట్ల డాలర్లుగా నిర్ధేశించింది. అందులో సగానికి సగం కూడా సాధించకపోగా, మొత్తం పరిశ్రమకే ముప్పు ముంచుకొచ్చింది. కొత్త ఉద్యోగాలు రాకపోగా, ఉన్న 30 లక్షల ఉద్యోగాలు ఊడిపోయాయి. ఇక్కడ బంగారు బాతును ఎవరు చంపారో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. (దారితప్పిన దేశ ఆర్థిక పురోగతిని చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆర్థిక వ్యవస్థను సరైన దారిలో పెట్టేందుకు మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం నాడు ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రత్యేక వార్తా కథనం) -
చరిత్రకు పాదుకలిచ్చిన చర్మం
కొత్త కోణం దేశంలో దాదాపు 25 లక్షల మంది తోలు పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. కొందరు ముస్లింలు మినహా మిగిలిన వారంతా అంటరాని కులాలవాళ్లే. ఈ దేశం తోలు పరిశ్రమల ద్వారా ఎగుమతి చేస్తున్న వస్తువుల వల్ల గత సంవత్సరం రూ.41 వేల కోట్ల ఆదాయం వచ్చింది. వేల ఏళ్లుగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు తమ పరిజ్ఞానం ద్వారా ఎంతో మేలు చేసినా, దళితుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా తోలు పరిశ్రమలకు అధిపతులు కాలేకపోయారు. ఇదీ దళితులకీ తోలుకీ ఉన్న వ్యథాభరిత చారిత్రక సంబంధం. ‘‘వేరెవరయ్యా? వారెవరయ్యా? అష్టాదివారలకు నావారు నను తక్కువ కులమని తాకనాడితె ఎక్కువ కులమంత ఎంచెన్ నే అంటముట్టరాని రాజుల వద్ద కళ్యాణికున్నది నావారు నే అంట ముట్టరాని కోమట్ల వద్ద నట్టనడింట్ల నావారు నే అంటముట్టరాని బ్రాహ్మణీకులంలో జంజానికున్నది నావారు’’ మాదిగ కుల చరిత్రను చిందుకళాకారులు తరతరాలుగా మౌఖికంగా ప్రచారం చేస్తున్నారు. వారు ప్రదర్శించే జాంబపురాణంలోని పంక్తులివి. అస్తిత్వ ఉద్యమాలు ఊపందుకోక ముందు అంటరాని కులాల పేరు సైతం ప్రస్తావనకు నోచుకోలేదు. అలాంటి పరిస్థితుల నుంచి తమ పేరుని ఓ ధిక్కార స్వరంగా వినిపించేంతగా మాదిగలు ఎదగడానికి ఆ కులం పునాదు లపై నిలిచిన సబ్బండ వర్గాల, సకల వృత్తుల, సర్వకులాల, సర్వజాతుల అభివృద్ధికి అదే అంటరాని కులం చేసిన చారిత్రక సేవే కారణం. అటువంటి చరిత్ర నేటికి మౌఖిక చరిత్రే. ఇప్పుడది అప్రస్తుతమనిపించొచ్చు. కానీ ఇప్పుడదే ప్రస్తుతంగా నాకనిపిస్తోంది. ఏ దేశమైనా, ఏ ప్రజలైనా గత చరిత్ర పునాదుల మీదనే వర్తమానాన్ని అర్థం చేసుకొని, భవిష్యత్‌ను పునర్నిర్మించు కోవాలి. గోసంరక్షణ పేరుతో ఇటీవల దేశమంతటా జరుగుతోన్న ఘటనలు మాదిగల, చమార్ల, జాటావుల, మోచిల రక్తసిక్త తోలు చరిత్రను మళ్లీ తెరపైకి తెచ్చాయి. గతంలోగానీ, వర్తమానంలో గానీ దళితులుగా పేర్కొన్న అంట రాని కులాలు పశువులను చంపి తిన్న దాఖలాలు లేవు, చనిపోయింతర్వాత తినడమే తప్ప. రైతుల ఇళ్లల్లో ఆరుగాలం కష్టపడ్డ ఎద్దులను, బతికినంత కాలం పాలు, పెరుగు, వెన్న, నెయ్యిలతో శక్తిని ఇచ్చిన ఆవులను చనిపోయిన తర్వాత, వాటిని ఊరిబయట పారవేసే పనిని అంటరాని కులాలే చేశాయి. ఇంకా చేస్తున్నాయి. అప్పటి వరకు వాటి శ్రమతో వ్యవసాయం చేసిన వాళ్లు, పుట్లు, పుట్లు పంటలను పండించిన వాళ్లు, వాటి పెరుగు, పాలు, వెన్న, నెయ్యితో సమృద్ధిగా పాడిని అనుభవించిన వాళ్లు కళేబరాన్ని ముట్టడానికి కూడా సాహసించరు. ఇంతటితో రైతుల, యజమానుల పని అయిపోతుంది. కానీ అప్పుడే అంటరానివాడైన దళితుడి పని మొదలవుతుంది. ఆ పశువుల తోలును తీసి, అందులో లభించిన మాంసాన్ని వారు తీసుకెళతారు. ఇక్కడ రెండు విషయాలున్నాయి. ఈ సమాజాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచేందుకు తన సర్వస్వాన్నీ ధారపోసే దళితుడి ఆకలి బాధ ఒకటైతే, అంతకన్నా ప్రధా నమైనది తాత్కాలిక ప్రయోజనం కన్నా భవిష్యత్ ప్రయోజనాన్ని ఆశించి చేసే తోలు పని మరొకటి. చచ్చిన పశువు మాంసాన్ని తినడం ఈ సమాజంలోని ఆర్థిక అంతరాలను వేలెత్తి చూపుతోంది. నిజానికి ఇక్కడ మాంసం ప్రాధా న్యం తక్కువ. దళితుల దృష్టి చర్మంపైనే ఉంటుంది. దళితుల చేతుల్లో శుద్ధి అయిన ఆ చర్మమే లేకపోతే ఎన్నో కులాలకు అసలు చరిత్రే ఉండేది కాదు. ప్రస్తుతం చర్మాలను శుభ్రంచేసి, తోలును తయారు చేయడానికి అధునాతన పద్ధతులు వచ్చాయి. వందల ఏళ్లుగా ఆ సాంకేతిక పరిజ్ఞానం వారికే సొంతం. మలినంలో మాణిక్యాలు ఒలిచిన చర్మాలను వినియోగంలోకి తీసుకొచ్చే క్రమంలో మొదట తోలుని పదిరోజుల పాటు సున్నంలో ఉంచుతారు. సున్నం లేని కాలంలో సుద్దమన్ను వాడేవారు. సున్నం లేదా, సుద్దమన్నుతో చర్మం మీది వెంట్రుకలు ఊడి పోతాయి. ఆ తర్వాత దానిని తంగేడు చెట్టు తొక్కను నానవేసిన లంద (గొయ్యి)లో దాదాపు పదిరోజులు ఉంచుతారు. రెండు రోజులకోసారి బయ టకు తీసి పిండి, మళ్లీ అందులోనే వేస్తారు. అప్పుడు ఎండలో ఆరబెడతారు. పూర్తిగా ఎండిన తోలు వస్తువులు చేయడానికి అనువుగా ఉంటుంది. ఈ లందలు ఇంటి పక్కనే తవ్వుతారు. భరించలేనంతగా ఉంటుంది వాసన. అయినా వేల ఏళ్లుగా అలాగే జరుగుతోంది. రెండవది- ఈ రోజు గ్రామీణ వ్యవస్థలో ఇంకా మినుకు మినుకుమం టున్న వృత్తులన్నీ ఒకనాడు తోలు ఉత్పత్తుల మీదనే ఆధారపడినాయి. ఇప్ప టికీ మారుమూల పల్లెల్లో ఇది కనిపిస్తుంది. వాటినే నేను ఈ వ్యాసం ప్రారం భంలో ప్రస్తావించాను. ఒక్కమాటలో చెప్పాలంటే, తోలు లేకుండా గ్రామీణ వృత్తుల పుట్టుకను, పెరుగుదలను ఊహించలేం. అందుకే జాంబ పురాణం ద్వారా తమ కృషిని, తోలు గొప్పతనాన్ని తరతరాలుగా మౌఖిక రూపంలో కళాకారులు ప్రచారం చేస్తున్న కథలు మనకు తోలుతో పెనవేసుకొని దళి తుల జీవితాలను సాక్షాత్కరింపచేస్తాయి. ఆ జాంబ పురాణ పంక్తులలో ‘తోలు’ అని కనిపించదు. ‘వారు’ అన్న పదమే తోలుకు బదులుగా ఉపయో గించాడు కవి. ఒక్కొక్క వృత్తిలో తోలు ఎట్లా కీలక భూమిక పోషించిందో తరచి చూడాలంటే చరిత్రను మననం చేసుకోవాలి. రాజులూ, సైనికులూ గుర్రా లను ఉపయోగించేవారు. గుర్రపు కళ్లెం, లేదా జీను తోలుతోనే తయారవు తుంది. వ్యవసాయ కులాలు, రెడ్లు, కాపులు ఎడ్ల మెడలకూ, నాగలికీ నడుమ బిగించే పరికరం తోలుతో చేస్తారు. రేకు, ప్లాస్టిక్ డబ్బాలు లేనప్పుడు వైశ్యులు తోలుతిత్తిలోనే నూనెను తీసుకొచ్చేవారు. అన్ని వృత్తులకూ ఆధారం తాటి, ఈత చెట్లు ఎక్కే గౌండ్ల కులస్తులకు చెట్లెక్కేప్పుడు కత్తులు పెట్టుకునే గౌసన్, నడుముకు బెల్టు కట్టి ఎక్కడానికి ఉపయోగించే తాడు, మొక్తాద్ తోలు వస్తువులే. సాలెలు మగ్గం నేసేటప్పుడు వాడే పికాస్ పరికరం తోలుదే. సారె మీద నుంచి తీసిన పచ్చికుండలను బోర్ల వేయడానికి ఉప యోగించేది తోలు. అల్యూమినియం, ఇత్తడి అందుబాటులో లేనప్పుడు అందరూ కుండల్లో వండుకుని తిన్నారు. కమ్మరి, అవుసుల(కంసాలి) వాడే కొలిమి తిత్తులు కూడా మొదట్లో తోలుతో తయారైనవే. గొల్ల కుర్మలు మేకలు, గొర్రెలు అడ వుల్లో మేపేటప్పుడు దూది, చెకుముకి రాయి పెట్టుకోవడానికి ఉపయోగించే చేతి సంచి, జంతువులను పారదోలడానికి ఉపయోగించే ఒడిశెల తోలువే. చాకలివారు ఉపయోగించే గాడిదల గంతలకు ఉపయోగించేది తోలునే. క్షురకులు కత్తులు పెట్టుకోవడానికి వాడే గౌసన్ తోలు ఉత్పత్తియే. మజ్జిగ చిలికే కవ్వాన్ని కదిపే తాడు, బట్టలు కుట్టే మేర కులస్తులు గుండీలు కుట్టేటప్పుడు సూది గుచ్చుకోకుండా వేలుకు తొడిగేది తోలు వస్తువులే. మద్దెల, మృదంగం, జమిడిక, డప్పు, డమరుకం అన్నీ తోలుతోనే చేసేవారు. ముదిరాజ్, బెస్తకులం వాళ్లు వేటాడే తుపాకీకి గౌసన్ కూడా తోలు నుంచి వచ్చిందే. వ్యవసాయం, దాని అనుబంధ వృత్తులన్నీ తోలు లేకుండా ఆరంభం కాలేదని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి సాంకేతిక పరిజ్ఞ్ఞానాన్ని మొత్తం సమాజానికి అర్పించిన దళితులు ఇప్పటికీ ఎటువంటి గౌరవాన్ని పొందలేకపోగా, ఇంకా అణచివేతకు, అవమానాలకు గురవుతూనే ఉండడ మంటే, ఈ సమాజాన్ని నిలబెట్టిన సకల వృత్తుల పునాదులను మర్చిపోవ డమే. ఆధునిక సమాజం లందలను ధ్వంసం చేసింది. కానీ డబ్బున్న వాళ్లు ఈ సాంకేతిక పరిజ్ఞనం నుంచి యాంత్రీకరణ వైపు మళ్లి వేలకోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. మళ్లీ అక్కడ కార్మికులుగా పనిచేస్తున్నది ఎవరంటే- అదే దళితులు. వ్యథాభరిత సంబంధం దేశంలో దాదాపు 25 లక్షల మంది తోలు పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. కొందరు ముస్లింలు మినహా మిగిలినవారంతా అంటరాని కులాలవాళ్లే. ఈ ముస్లింలు గతంలో అంటరాని వాళ్లే. హిందూ సమాజంలో ఉన్న అవమా నాలు, అణచివేతలు భరించలేక మతం మారినవారే వీళ్లంతానని చరిత్ర చెబుతుంది. వాళ్లు మాత్రమే ఈరోజు తోలు పరిశ్రమల్లో కార్మికులుగా ఉన్నారు. ఈ దేశం తోలు పరిశ్రమల ద్వారా ఎగుమతి చేస్తున్న వస్తువుల వల్ల గత సంవత్సరం రూ.41 వేల కోట్ల ఆదాయం వచ్చింది. వేల ఏళ్లుగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు తమ పరిజ్ఞానం ద్వారా ఎంతో మేలు చేసినా, దళితుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా తోలు పరిశ్రమలకు అధిపతులు కాలేకపోయారు. ఇదీ దళితులకీ తోలుకీ ఉన్న వ్యథాభరిత చారిత్రక సంబంధం. ఈ నేపథ్యం నుంచే మనం ఆవు మాంసం వివాదాన్ని పరిశీలించాలి. నిజానికి ఏ సమాజమైనా కొంచెం వివేచన కలిగి ఉంటే, సమాజానికి ఉప యుక్తమైన సాంకేతిక పరిజ్ఞానం సృష్టించిన ఆ జాతికి, కులానికి ఎల్లకాలం రుణపడి ఉండాలి. ఇప్పటికీ అటువంటి పరివర్తన భారత సమాజంలో రాకపోవడం విచారకరం. రాకపోగా, ఆ వృత్తినే నీచమైనదిగా, వాళ్లంతా దుర్మార్గులుగా ఈ సమాజానికి కనిపించడం భారతీయత పేరుతో కొన సాగుతోన్న అసమానతలకు, వైరుధ్యాలకూ పరాకాష్ట. వ్యవసాయంలో స్థిర మైన నీటి వసతిని కల్పించి, పంటలకు గ్యారంటీ ఇచ్చిన చెరువుల నిర్మాణం, నిర్వహణలో దళితులదే అగ్రస్థానం. ఈ దేశం సృష్టించిన సంపదలో అంటరాని కులాల భాగస్వామ్యం అమోఘమని పైన పేర్కొన్న విషయాలు రుజువు చేస్తున్నాయి. పారిశ్రామిక అభివృద్ధిలో మొదటిగా ఉనికిలోనికి వచ్చిన రైల్వేలు, గనులలో కూడా ప్రాణాలకు తెగించి పనిచేసిన తొలి రైల్వే శ్రామికులు అంటరాని కులాలే. అవి ఆధునీకరణ చెంది, రక్షణ గ్యారంటీ అయిన తర్వాత అన్ని కులాలు చేరాయి. అయినా అవమానాలే! అంటే ఈ సమాజం గమనాన్ని, అభివృద్ధినీ కొనియాడే ప్రతి సందర్భంలోనూ గుర్తు చేసుకోవాల్సింది దళితజాతి ఈ సమాజానికి చేసిన సేవనే. కానీ నేటి పరిణామాలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఈ సమాజానికి దళితజాతి చేసిన సేవలను కొనియాడకపోయినా పరవాలేదు. కానీ అనుక్షణం వేటాడి వెంటాడి జరుపుతున్న దాడులు దళితులను అవమాన భారంతో దహించి వేస్తున్నాయి. ఇది ఈ సమాజ ఐక్యతకు అవరోధం. దేశం దేశం అని జపించే వారంతా గతాన్ని గుర్తు చేసుకొని, వర్తమానాన్ని అర్థం చేసుకొని, భవిష్యత్త్‌ని నిర్దేశించుకోకపోతే, పరిణామాలు విషమంగానే ఉంటాయి. (వ్యాసకర్త: మల్లేపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213) -
లెదర్ పార్కుకు గ్రీన్ సిగ్నల్
► రూ.125 కోట్లు విడుదల చేసి కేంద్రం ► లెదర్ పార్కు ఏర్పాటైతే తమ ► గ్రామాలు కనుమరుగవుతాయని ► బాధితుల ఆందోళన ► 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వ వాదన కోట మండలం కొత్తపట్నం సెజ్‌లో అంతర్జాతీయ తోళ్ల పరిశ్రమ(మెగా లెదర్ క్లస్టర్) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ రూ.125 కోట్లు మంజూరు చేసింది. 2012 నుంచి తీవ్ర వివాదాస్పద అంశంగా మారిన ఈ వ్యవహారానికి రాష్ర్ట ప్రభుత్వ సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఆజ్యం పోసింది. సాక్షి ప్రతినిధి - నెల్లూరు: కోట మండలం కొత్తపట్నం సెజ్‌లో తోళ్ల పరిశ్రమ ఏర్పాటు కోసం సర్వేనంబర్ 321లో 530 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. కొత్తపట్నం పంచాయితీ వావిళ్లదొరువు వద్ద 2012, డిసెంబరు 27వ తేదీ ప్రజాభిప్రాయ సేకరణ కోసం అధికారులు గ్రామసభ ఏర్పాటు చేశారు. అప్పటి గూడూరు సబ్ కలెక్టర్ నివాస్, డీఆర్ఓ రామిరెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ మహేష్ ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు గ్రామసభకు హాజరయ్యారు. లెదర్ పార్క్ ఏర్పాటును చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించి గ్రామసభను అడ్డుకున్నారు. షామియానాలను కూలదోశారు. కుర్చీలను విసిరి చెల్లాచెదురుగా పడవేశారు. దీంతో హడలిపోయిన అధికారులు గ్రామసభను వాయిదా వేశారు. ఆ తర్వాత 2013, మార్చి 6న అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీధర్ నేతృత్వంలో భారీ పోలీసు బందోబస్తు నడుమ రెండోసారి గ్రామసభ నిర్వహించారు. ప్రజలు కలెక్టర్‌తో పాటు అధికారులందరి మీద తిరగబడ్డారు. ప్రజాసంఘాలు, పౌరహక్కులు, జనవిజ్ఞాన వేదిక నాయకులు బాధిత గ్రామాల ప్రజలకు మద్దతు ప్రకటించారు. అధికారులపై ప్రజలు ఇసుక వర్షం కురిపించి, కారం పొడి చల్లి, చెప్పులు విసిరారు. పోలీసు వలయంలో జిల్లా కలెక్టర్‌ను తరలించారు. నిరసన కారుల మధ్య గోవిందపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులుండటంతో పోలీసులు, అధికారులు వెనక్కి తగ్గారు. పాఠశాల విద్యార్థులను గ్రామసభకు తీసుకువచ్చినవారిపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆందోళనల మధ్యే ప్రజాభిప్రాయం తోళ్ల పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వ అభిప్రాయం ఒకరు విన్నా పబ్లిక్ హియరింగ్ పూర్తయినట్లేనని కలెక్టర్ శ్రీధర్ ప్రకటించారు. ఈ ప్రకటన అప్పట్లో సంచలనం రేపింది. ఈ వివాదాల అనంతరం లెదర్ పార్కు వ్యవహారం మరుగున పడింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రతిపాదనకు మళ్లీ ప్రాణం పోసింది. లెదర్ పార్కు ఏర్పాటుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. రాష్ర్ట ప్రభుత్వ కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం ఇందుకు ఆమోదం తెలిపి రూ.125 కోట్లు మంజూరు చేసింది. ఇక్కడ రూ.500 కోట్లు పెట్టుబడులు పెట్టడం ద్వారా 20 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుందని.. ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యం కూడా లభిస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. జనంలో భయం తోళ్ల పరిశ్రమ ఏర్పాటు వల్ల చెన్నై నుంచి కొత్తపట్నం వరకు రోజూ 800 లారీల రాకపోకలుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పార్కు పనిచేయడం ప్రారంభిస్తే కొత్తపట్నం పంచాయితీ పరిధిలో ఉన్న వావిళ్లదొరువు, గోవిందపల్లి, గోవిందపల్లిపాళెం, మిట్టపాళెం, జంగిటవానిదిబ్బ, శ్రీనివాససత్రం, యమదిన్నెపాళెం, గున్నంపడియ గ్రామాలు కనుమరుగయ్యే అవకాశముందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. లెదర్ పార్కు చుట్టుపక్కల ఉండే 40 గ్రామాలు జల, వాయు కాలుష్యం బారిన పడే ప్రమాదం ఉందని వారు భయపడుతున్నారు. పరిశ్రమ ఏర్పాటుతో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన 5 సొనకాలువలు, చెరువులు, సముద్రపు క్రీక్(ఉప్పు కాలువలు) పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు. క్రీక్‌ను నమ్ముకుని చేపల వేటతో జీవిస్తున్న మూడు వందల గిరిజన కుటుంబాలు, గోవిందపల్లి పాళెంలోని రెండు వందల మత్య్సకార కుటుంబాలకు జీవనోపాధి పోయే ప్రమాదం ఏర్పడుతుందని చెబుతున్నారు. తోళ్లపరిశ్రమలో పచ్చితోలును నిల్వ చేసేందుకు వాడే సున్నం, ఉప్పు, సోడియం సల్ఫైడ్, తోళ్లను శుభ్ర పరిచే టానింగ్ ప్రక్రియలో వాడే సర్ఫూరిక్ యాసిడ్, క్రోమియం, ఫినాల్ లాంటి రసాయనాలు అత్యంత ప్రమాదకరమైనవని జనం ఆందోళన చెందుతున్నారు. ఈ మిశ్రమాలతో కూడిన వాసనను పీల్చడం వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, అల్సర్లతో పాటు ముక్కులకు, చేతివేళ్లకు సంబంధించిన వ్యాధులు సోకుతాయని వారు ఆందోళన చెందుతున్నారు. కుళ్ళిపోయిన వ్యర్థాల ద్వారా వచ్చే నీటిని సముద్రంలోకి వదలడం వల్ల మత్య్ససంపద అంతరించిపోతుందని మత్స్య కారులు చెబుతున్నారు. ఆధునిక పరిజ్ఞానంతో ఇబ్బందులుండవు కోట వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన మెగా లెదర్‌పార్క్ నిర్వహణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. మత్స్య కారులు, లెదర్ పార్క్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనవసర భయంతో పార్కు ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారని వారు చెబుతున్నారు. -
'తోళ్ల పరిశ్రమ రద్దు చేయండి'
నెల్లూరు : గత ప్రభుత్వం మంజూరు చేసిన తోళ్ల పరిశ్రమను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోట మండల కేంద్రంలో సోమవారం భారీ ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. తోళ్ల పరిశ్రమ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు శ్యాంప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో 4 వేల మందికి పైగా పాల్గొన్నారు. కోట, వాకాడు, చిల్లకూరు మండలాల ప్రజలు కోటలోని సబ్‌కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. తోళ్ల పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు, రసాయనాలతో వాతావరణ, వాయు కాలుష్యం పెరుగుతోదని వారు ప్లకార్డులు ప్రదర్శించారు. పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భవ్యమైన కెరీర్‌కు.. లెదర్ టెక్నాలజీ
ప్రాచీన కాలంలో జంతువుల చర్మాన్నే మనుషులు దుస్తులుగా ధరించేవారు. ఆధునిక యుగంలో రకరకాల వస్త్రాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. జంతు చర్మంతో రూపొందించిన వస్తువులను ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. తోలుతో తయారు చేసిన పాదరక్షలు, బ్యాగులు, పర్సులు, బెల్ట్‌లు, రెయిన్ కోట్లకు మంచి డిమాండ్ ఉంది. తోలు వస్తువుల వాడకాన్ని హోదాకు చిహ్నంగా భావిస్తున్నారు. భారత్‌లో తోలు పరిశ్రమ వేగంగా అభి వృద్ధి చెందుతోంది. తోలు ఎగుమతుల ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరు తోంది. మనదేశంలో ప్రతిఏటా 2 బిలియన్ చదరపు అడుగుల ముడి తోలు ఉత్పత్తవు తోంది. ఈ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకా శాలు పుష్కలంగా లభిస్తున్నాయి. లెదర్ టెక్నా లజీని కెరీర్‌గా ఎంచుకుంటే.. భవిష్యత్తుకు ఢోకా ఉండదని నిస్సందేహంగా చెప్పొచ్చు. అవకాశాలు ఎన్నెన్నో.. లెదర్ టెక్నాలజీ కోర్సులను చదివిన వారికి మెరుగైన అవకాశాలు దక్కుతున్నాయి. ప్రధానంగా తోలు శుద్ధి పరిశ్రమల్లో లెదర్ టెక్నాలజిస్టుల అవసరం ఎక్కువగా ఉంది. మనదేశంలో హైదరాబాద్, చెన్నై, ఆగ్రా, కాన్పూర్, జలంధర్, కోల్‌కతా, ముంబై తదితర నగరాల్లో తోలు పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. లెదర్ గూడ్స్, లెదర్ గార్మెంట్స్ కంపెనీలు లెదర్ టెక్నాలజిస్టులను నియమించుకుంటు న్నాయి. లెదర్ కెమికల్స్ కంపెనీల్లోనూ అవకాశాలుంటాయి. దేశ విదేశాల్లో తోళ్ల వ్యాపారం నిర్వహించే సంస్థల్లోనూ ఉద్యోగాలు పొందొచ్చు. ఈ రంగంలో కొంత అనుభవం సంపాదించిన తర్వాత సొంతంగా లెదర్ ఫినిషింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకుంటే అధిక ఆదాయం పొందడానికి ఆస్కారం ఉంటుంది. తగిన ఆసక్తి ఉంటే యూనివర్సిటీ లు/కళాశాలల్లో ఫ్యాకల్టీగా కూడా స్థిరపడొచ్చు. టెక్నాలజీని అప్డేట్ చేసుకోవాలి లెదర్ టెక్నాలజిస్టుగా రాణించాలంటే.. టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, శ్రమించే తత్వం, నాయకత్వ లక్షణాలు ఉండాలి. తోలు శుద్ధి పరిశ్రమలు సాధారణంగా జనావాసాలకు దూరంగా ఏర్పాటవుతాయి. ఇందులో రసాయనాల వినియోగం ఎక్కువ. కాబట్టి అక్కడ పనిచేసేందుకు సిద్ధపడాలి. లెదర్ టెక్నాలజిస్టులకు కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, బయోటెక్నాలజీ, ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్‌పై బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అర్హతలు: లెదర్ టెక్నాలజీలో డిప్లొమా, బీటెక్, ఎంటెక్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత డిప్లొమా/బీటెక్‌లో చేరొచ్చు. ఎంటెక్ కూడా పూర్తిచేస్తే మంచి అవకాశాలు ఉంటాయి. వేతనాలు: లెదర్ టెక్నాలజీలో బీటెక్ పూర్తిచేసిన వారు ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం అందుకోవచ్చు. తర్వాత అనుభవం, పనితీరు ఆధారంగా వేతనం పెరుగుతుంది. లెదర్ టెక్నాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ-గోల్కొండ, హైదరాబాద్ సెంట్రల్ లెదర్ రీసెర్చ ఇన్స్టిట్యూట్ - చెన్నై వెబ్సైట్: www.clri.org అన్నా యూనివర్సిటీ-చెన్నై వెబ్సైట్: www.annauniv.edu వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ-కోల్‌కతా వెబ్సైట్: www.wbut.ac.in హర్కోర్ట్ బట్లర్ టెక్నలాజికల్ ఇన్స్టిట్యూట్-కాన్పూర్ వెబ్సైట్: www.hbti.ac.in విదేశాల్లోనూ అవకాశాలు ‘‘పాస్.. ఫెయిల్‌తో సంబంధం లేకుండా మెరుగైన కెరీర్‌ను అందించే కోర్సులు... లెదర్ టెక్నాలజీ, ఫుట్‌వేర్ టెక్నాలజీ. మూడున్నరేళ్ల కోర్సు సమయంలో ఏడాదిపాటు ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది. కోర్సు పూర్తయ్యాక ప్రారంభ వేతనం రూ.10వేల వరకూ ఉంటుంది. మనదేశంతోపాటు విదేశాల్లోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయి. లెదర్ టెక్నాలజీ కోర్సులను అభ్యసిస్తే మంచి వేతనంతో కెరీర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు’’ - అన్నే శివాజీ, సీనియర్ లెక్చరర్, గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ, హైదరాబాద్