లెదర్ పార్కుకు గ్రీన్ సిగ్నల్
► రూ.125 కోట్లు విడుదల చేసి కేంద్రం
► లెదర్ పార్కు ఏర్పాటైతే తమ
► గ్రామాలు కనుమరుగవుతాయని
► బాధితుల ఆందోళన
► 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వ వాదన
కోట మండలం కొత్తపట్నం సెజ్‌లో అంతర్జాతీయ తోళ్ల పరిశ్రమ(మెగా లెదర్ క్లస్టర్) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ రూ.125 కోట్లు మంజూరు చేసింది. 2012 నుంచి తీవ్ర వివాదాస్పద అంశంగా మారిన ఈ వ్యవహారానికి రాష్ర్ట ప్రభుత్వ సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఆజ్యం పోసింది.
సాక్షి ప్రతినిధి - నెల్లూరు: కోట మండలం కొత్తపట్నం సెజ్‌లో తోళ్ల పరిశ్రమ ఏర్పాటు కోసం సర్వేనంబర్ 321లో 530 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. కొత్తపట్నం పంచాయితీ వావిళ్లదొరువు వద్ద 2012, డిసెంబరు 27వ తేదీ ప్రజాభిప్రాయ సేకరణ కోసం అధికారులు గ్రామసభ ఏర్పాటు చేశారు. అప్పటి గూడూరు సబ్ కలెక్టర్ నివాస్, డీఆర్‌ఓ రామిరెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ మహేష్ ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు గ్రామసభకు హాజరయ్యారు. లెదర్ పార్క్ ఏర్పాటును చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించి గ్రామసభను అడ్డుకున్నారు. షామియానాలను కూలదోశారు. కుర్చీలను విసిరి చెల్లాచెదురుగా పడవేశారు. దీంతో హడలిపోయిన అధికారులు గ్రామసభను వాయిదా వేశారు. ఆ తర్వాత 2013, మార్చి 6న అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీధర్ నేతృత్వంలో భారీ పోలీసు బందోబస్తు నడుమ రెండోసారి గ్రామసభ నిర్వహించారు.
ప్రజలు కలెక్టర్‌తో పాటు అధికారులందరి మీద తిరగబడ్డారు. ప్రజాసంఘాలు, పౌరహక్కులు, జనవిజ్ఞాన వేదిక నాయకులు బాధిత గ్రామాల ప్రజలకు మద్దతు ప్రకటించారు. అధికారులపై ప్రజలు ఇసుక వర్షం కురిపించి, కారం పొడి చల్లి, చెప్పులు విసిరారు. పోలీసు వలయంలో జిల్లా కలెక్టర్‌ను తరలించారు. నిరసన కారుల మధ్య గోవిందపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులుండటంతో పోలీసులు, అధికారులు వెనక్కి తగ్గారు. పాఠశాల విద్యార్థులను గ్రామసభకు తీసుకువచ్చినవారిపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఆందోళనల మధ్యే ప్రజాభిప్రాయం
తోళ్ల పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వ అభిప్రాయం ఒకరు విన్నా పబ్లిక్ హియరింగ్ పూర్తయినట్లేనని కలెక్టర్ శ్రీధర్ ప్రకటించారు. ఈ ప్రకటన అప్పట్లో సంచలనం రేపింది. ఈ వివాదాల అనంతరం లెదర్ పార్కు వ్యవహారం మరుగున పడింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రతిపాదనకు మళ్లీ ప్రాణం పోసింది. లెదర్ పార్కు ఏర్పాటుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. రాష్ర్ట ప్రభుత్వ కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం ఇందుకు ఆమోదం తెలిపి రూ.125 కోట్లు మంజూరు చేసింది. ఇక్కడ రూ.500 కోట్లు పెట్టుబడులు పెట్టడం ద్వారా 20 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుందని.. ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యం కూడా లభిస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.
జనంలో భయం
తోళ్ల పరిశ్రమ ఏర్పాటు వల్ల చెన్నై నుంచి కొత్తపట్నం వరకు రోజూ 800 లారీల రాకపోకలుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పార్కు పనిచేయడం ప్రారంభిస్తే కొత్తపట్నం పంచాయితీ పరిధిలో ఉన్న వావిళ్లదొరువు, గోవిందపల్లి, గోవిందపల్లిపాళెం, మిట్టపాళెం, జంగిటవానిదిబ్బ, శ్రీనివాససత్రం, యమదిన్నెపాళెం, గున్నంపడియ గ్రామాలు కనుమరుగయ్యే అవకాశముందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. లెదర్ పార్కు చుట్టుపక్కల ఉండే 40 గ్రామాలు జల, వాయు కాలుష్యం బారిన పడే ప్రమాదం ఉందని వారు భయపడుతున్నారు. పరిశ్రమ ఏర్పాటుతో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన 5 సొనకాలువలు, చెరువులు, సముద్రపు క్రీక్(ఉప్పు కాలువలు) పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు. క్రీక్‌ను నమ్ముకుని చేపల వేటతో జీవిస్తున్న మూడు వందల గిరిజన కుటుంబాలు, గోవిందపల్లి పాళెంలోని రెండు వందల మత్య్సకార కుటుంబాలకు జీవనోపాధి పోయే ప్రమాదం ఏర్పడుతుందని చెబుతున్నారు.
తోళ్లపరిశ్రమలో పచ్చితోలును నిల్వ చేసేందుకు వాడే సున్నం, ఉప్పు, సోడియం సల్ఫైడ్, తోళ్లను శుభ్ర పరిచే టానింగ్ ప్రక్రియలో వాడే సర్ఫూరిక్ యాసిడ్, క్రోమియం, ఫినాల్ లాంటి రసాయనాలు అత్యంత ప్రమాదకరమైనవని జనం ఆందోళన చెందుతున్నారు. ఈ మిశ్రమాలతో కూడిన వాసనను పీల్చడం వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, అల్సర్లతో పాటు ముక్కులకు, చేతివేళ్లకు సంబంధించిన వ్యాధులు సోకుతాయని వారు ఆందోళన చెందుతున్నారు. కుళ్ళిపోయిన వ్యర్థాల ద్వారా వచ్చే నీటిని సముద్రంలోకి వదలడం వల్ల మత్య్ససంపద అంతరించిపోతుందని మత్స్య కారులు చెబుతున్నారు.
ఆధునిక పరిజ్ఞానంతో ఇబ్బందులుండవు
కోట వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన మెగా లెదర్‌పార్క్ నిర్వహణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. మత్స్య కారులు, లెదర్ పార్క్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనవసర భయంతో పార్కు ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారని వారు చెబుతున్నారు.