న్యూఢిల్లీ: ‘మా దేశంలో బంగారు గుడ్లు పెట్టే బాతును చంపేశారు’ భారత్‌లోని ప్రముఖ షూ ఎక్స్‌పోర్టర్ కంపెనీ ‘పార్క్ ఎక్స్‌పోర్ట్స్’ సీఈవో నజీర్ అహ్మద్, ఆగ్రా నుంచి టెలిఫోన్‌లో రాయిటర్స్ సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్య ఇది. ఎందుకు ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ఆయన అంటున్న బంగారు గుడ్లు పెట్టే బాతు ఏమిటీ? దాన్ని ఎవరు చంపేశారు? చంపితే ఆయనకెందుకు అంత ఆందోళన!
నజీర్ అహ్మద్ ప్రముఖ షూ కంపెనీ యజమాని కనుక ఆయన మాట్లాడుతున్నది ఆయన కంపెనీ ఉత్పత్తుల ఎగుమతుల గురించేనని సులభంగానే గ్రహించవచ్చు. ఇక ఆయన బంగారు బాతుగా వర్ణించినది తోళ్ల పరిశ్రమ. ఈ పరిశ్రమపై ఆధారపడే పలు భారత్‌కు చెందిన కంపెనీలు చెప్పులు, బూట్లు, తోలు బ్యాగులు, వస్త్రాలను ఎగుమతి చేస్తున్నాయి. వీటి ఎగుమతుల్లో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం భారత్. వీటి ఎగుమతులు గత మార్చి నెల నుంచి ఇప్పటి వరకు భారీగా పడిపోయాయి. పర్యవసానంగా కొన్ని తోళ్ల పరిశ్రమలతోపాటు కొన్ని చెప్పుల పరిశ్రమలు మూతపడ్డాయి. దాదాçపు 30 లక్షల మంది చిరుద్యోగులు రోడ్డున పడ్డారు.
గత ఏప్రిల్–మే నెలలో దేశం నుంచి బూట్ల ఎగుమతులు నాలుగు శాతం అంటే, 68 కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులు పడిపోయాయి. సెప్టెంబర్ నాటికి 13 శాతం పడిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో యాభై శాతానికిపైగా ఎగుమతులు పడిపోయే ప్రమాదం ఉంది. జారా అండ్ క్లార్క్స్‌కు చెందిన ఇండిటెక్స్, హెచ్ అండ్ ఎమ్ లాంటి అంతర్జాతీయ బ్రాండ్ కంపెనీలు బూట్ల దిగుమతిలో భారత్‌కు స్వస్తి చెప్పి చైనా, బంగ్లాదేశ్, ఇండోనేషియా, పాకిస్తాన్ దేశాలకు ఆర్డర్లు ఇవ్వడం ప్రారంభించాయని భారత ఎగుమతిదారుల సంఘాల సమాఖ్య మాజీ అధ్యక్షుడు చెన్నైకి చెందిన ప్రముఖ చెప్పుల వ్యాపారి ఎం. రఫీక్ అహ్మద్ తెలిపారు. దేశంలో తోళ్ల పరిశ్రమ కుంటుపడడం వల్ల తాము సకాలంలో ఆర్డర్లను పూర్తి చేయలేమనే ఉద్దేశంతోనే అంతర్జాతీయ బ్రాండ్ కంపెనీలు తరలిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ గత మార్చి నెలలో పదవీ బాధ్యతలు స్వీకరించడంతోనే దేశంలో తోళ్ల పరిశ్రమకు గడ్డుకాలం ప్రారంభమైంది. రాష్ట్రంలోని లైసెన్స్‌లేని కబేళాలను నిషేధిస్తూ ఆయన తీసుకొచ్చిన ఉత్తర్వులు తోళ్ల పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీసింది. చిన్న చిన్న మాంసం కొట్లు అనియత రంగంలో ఎక్కువగా పనిచేస్తున్నాయని, వాటన్నింటికీ లైసెన్స్ తీసుకోవడం కష్టమని వాటి యజమానులు ఎన్ని విజ్ఞప్తులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వినిపించుకోలేదు. బర్రెలను కోసే చిన్న చిన్న కొట్లతోపాటు పెద్ద స్థాయి కబేళాలు కూడా మూత పడ్డాయి. చెప్పుల పరిశ్రమకు ఎక్కువగా బర్రెల చర్మాలనే వాడుతారు. మాంసం, తోళ్ల ఎగుమతుల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చింది.
ఈ రెండు పరిశ్రమల కారణంతా రాష్ట్ర ఖజానాకు ఏటా 56 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. ఈ నేపథ్యంలోనే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవసాయ అవసరాలకు మినహా పశువులను సంతల్లో విక్రయించరాదంటూ నిబంధనలను తీసుకొచ్చింది. ఈ ఉత్తర్వులు పుండు మీద కారం చల్లినట్లయింది. దేశంలో మాంసంతోపాటు తోళ్ల పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింటూ వచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టేను మంజూరు చేసినప్పటికీ గోరక్షకుల దాడికి భయపడుతుండడంతో తోళ్ల పరిశ్రమ కోలుకోలేక పోయింది. జీఎస్టీ కారణంగా ఉత్పత్తుల ధరలు కూడా ఆరేడు శాతం పెరగడం ప్రతికూల ప్రభావాన్నే చూపింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన కొత్తలో తోళ్ల పరిశ్రమ ఎగుమతులను 2020 నాటికి 2700 కోట్ల డాలర్లకు తీసుకెళతానని, లక్షలాది కొత్త ఉద్యోగాలు సష్టిస్తానని దేశ ప్రజలకు వాగ్ధానం చేశారు. అందులో భాగంగానే ఆయన ప్రభుత్వం 2016–2017 ఆర్థిక సంవత్సరానికి తోళ్ల పరిశ్రమ ఎగుమతులను 570 కోట్ల డాలర్లుగా నిర్ధేశించింది. అందులో సగానికి సగం కూడా సాధించకపోగా, మొత్తం పరిశ్రమకే ముప్పు ముంచుకొచ్చింది. కొత్త ఉద్యోగాలు రాకపోగా, ఉన్న 30 లక్షల ఉద్యోగాలు ఊడిపోయాయి. ఇక్కడ బంగారు బాతును ఎవరు చంపారో సులభంగానే అర్థం చేసుకోవచ్చు.
(దారితప్పిన దేశ ఆర్థిక పురోగతిని చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆర్థిక వ్యవస్థను సరైన దారిలో పెట్టేందుకు మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం నాడు ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రత్యేక వార్తా కథనం)
Comments
Please login to add a commentAdd a comment