Nazir Ahmed
-
కొడుకు చేసిన పనికి తండ్రికి శిక్ష.. పార్టీ సభ్యత్వం రద్దు..
లడఖ్: లడఖ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత నజీర్ అహ్మద్(74) కుమారుడు నెలరోజుల క్రితం ఒక బౌద్ధ మహిళను ప్రేమించి ఆమెతో కలిసి ఉడాయించాడు. దీంతో ఆగ్రహించిన స్థానిక బీజేపీ పార్టీ పెద్దలు ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. అచ్చం 'దేశముదురు' సినిమా కథను తలపిస్తూ లడఖ్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నజీర్ అహ్మద్ తనయుడు మంజూర్ అహ్మద్(39) ఓ బౌద్ధ యువతిని ప్రేమించాడు. తల్లిదండ్రులను ఎదిరించి మరీ పెళ్లాడాడు. వివాహానికి నజీర్ కుటుంబమంతా వ్యతిరేకమే అయినప్పటికీ బీజేపీ పార్టీ మాత్రం ఈ మతాంతర వివాహంలో ఆయన పాత్ర ఉందని ఆరోపిస్తూ ఆయన ప్రాధమిక పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ మేరకు లడఖ్ బీజేపీ పార్టీ చీఫ్ ఫంచోక్ స్టాంచిన్ బుధవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో సస్పెన్షన్ ఆర్డర్ జారీ చేశారు. పార్టీ బహిష్కరణ తర్వాత నజీర్ అహ్మద్ మాట్లాడుతూ.. నా కుమారుడికి ఆ బౌద్ధ యువతికి 2011లోనే నిఖా జరిగి ఉంటుంది. గతనెల వారు మళ్ళీ కోర్టు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి నాకు గానీ నా కుటుంబ సభ్యులకు గానీ ఎవ్వరికీ ఇష్టం లేదు. వారి పెళ్లి జరిగినప్పుడు నేను ఇక్కడ లేను. హాజ్ యాత్రకు వెళ్లాను. తిరిగొచ్చాక విషయం తెలిసినప్పటి నుండి వాడి కోసం గాలిస్తూనే ఉన్నాను. శ్రీనగర్ తదితర ప్రాంతాలన్నీ వెతికాను. ఎక్కడా వారి ఆచూకీ దొరకలేదు. నా కొడుకు పెళ్ళికి నన్నెందుకు నిందిస్తున్నారో నాకైతే అర్ధం కాలేదని వాపోయారు. ఇది కూడా చదవండి: చెంపదెబ్బకి అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడ్డాడు.. తర్వాత.. -
భారత్‌పై విషం చిమ్మే నజీర్.. ఎట్టకేలకు పాపం పండింది
భారత్‌పై, ప్రభుత్వ విధానాలపై వీలు చేసుకుని మరీ విషం చిమ్ముతూ.. పాక్ అండతో కశ్మీర్ ప్రచారకర్తగా తనను తాను ప్రచారం చేసుకున్నాడు లార్డ్ నజీర్ అహ్మద్(64). అయితే లైంగిక దాడుల పర్వంలో ఎట్టకేలకు ఈ చీడపురుగు పాపం పండింది. మైనర్లపై లైంగిక వేధింపుల కేసులో జైలు శిక్ష పడింది. బ్రిటిష్-పాక్ సంతతికి చెందిన రాజకీయ నేత లార్డ్ నజీర్ అహ్మద్‌కు పిల్లలపై లైంగిక వేధింపుల కేసులో ఐదున్నరేళ్ల శిక్ష ఖరారైంది. ఈ మేరకు శుక్రవారం షెఫీల్డ్ క్రౌన్ కోర్టు నజీర్‌ను దోషిగా నిర్ధారించి.. శిక్ష ఖరారు చేసింది. 70వ దశకంలో ఇద్దరు మైనర్లపై నజీర్ అహ్మద్ లైంగిక వేధింపులపై పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. 1971 నుంచి 1974 మధ్య ఈ వేధింపుల పర్వం సాగినట్లు సమాచారం. వేధింపులతో పాటు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడన్నది ప్రధాన ఆరోపణ. ఇదిలా ఉంటే.. నాలుగు దశాబ్దాలుగా బాధిత కుటుంబాల పోరాటం, మీటూ ఉద్యమం ప్రభావంతో 2019 మార్చిలో ఈ ఆరోపణలకు సంబంధించి నజీర్పై నేరారోపణలు నమోదు అయ్యాయి. కశ్మీర్‌ను ఉద్ధరిస్తానంటూ.. నజీర్ అహ్మద్ పీఓకేలో జన్మించాడు. అయితే రోథర్హమ్(యూకే)కు తండ్రి వలస వెళ్లడంతో.. నజీర్ అక్కడే పెరిగి, వ్యాపారాలతో రాణించాడు. 1998లో టోనీబ్లేయర్ ప్రధాని సారథ్యంలో నజీర్ హౌజ్ ఆఫ్ ది లార్డ్స్‌గా పని చేశాడు. 2013లో లేబర్ పార్టీకి రాజీనామా చేసి.. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో 2020లో హౌజ్ ఆఫ్ లార్డ్స్‌కు రాజీనామా చేశాడు. ఇతగాడి వేధింపులు నిజమేనని హౌజ్ కమిటీ ఒకటి నిర్ధారణ కూడా చేసింది. ఖలీస్థానీ గ్రూపుతో మంచి సంబంధాలు కలిగి ఉన్న నజీర్.. వీలుచిక్కినప్పుడల్లా భారత్‌పై విషం చిమ్ముతుంటాడు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తోనూ అతనికి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ ఇద్దరూ కలిసినప్పుడల్లా.. నజీర్ భారత్ మీద విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. ఒకానొక దశలో ప్రధాని మోదీపైనా వివాదాస్పద ప్రకటన ఇచ్చాడు నజీర్. కశ్మీర్ క్రూసేడర్ అంటూ తనకు తాను ప్రగల్భాలు పలికే నజీర్.. పీవోకే ప్రాంతాన్ని ఉద్దరిస్తానంటూ ఫండింగ్ చేయడం ప్రారంభించాడు. సంస్కరణల పేరుతో కశ్మీర్ మహిళలను బలవంతంగా లోబర్చుకున్నట్లు నజీర్ మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో లండన్‌లో ఉండే కశ్మీర్ కమ్యూనిటీ మీటూ తరహా ఉద్యమంతో నజీర్ పీఠాన్ని కదిలించారు కూడా. నజీర్పై జైలు శిక్ష పడడంపై కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది. చదవండి: అడుగు పెట్టకముందే ఇమ్రాన్ ఖాన్‌కు షాకిచ్చిన చైనా -
వైఎస్ జగన్ పథకాలు దేశానికే ఆదర్శం
కల్లూరు/పులిచెర్ల/తిరుమల (చిత్తూరు జిల్లా): దేశంలోనే ఎక్కడా లేని అద్భుతమైన పథకాలను ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, జమ్మూ–కశ్మీర్ ఎంపీ నజీర్ అహమ్మద్ కొనియాడారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరులో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కల్లూరులో ఎస్‌హెచ్‌జీ గ్రూపులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నజీర్ అహమ్మద్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రజలకిచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ఒకటిన్నర సంవత్సర కాలంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడం హర్షణీయమన్నారు. బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్రెడ్డి సాధ్యం చేశారని ప్రశంసించారు. ఇటువంటి ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి దొరకడం ఇక్కడి ప్రజల అదృష్టమని అన్నారు. ముఖ్యంగా డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ముఖ్యమంత్రి తీసుకున్న చొరవ గొప్పగా ఉందని ప్రశంసించారు. పర్యటనలో భాగంగా దిగువపోకల వారిపల్లెలో వాటర్‌షెడ్‌లో చేపట్టిన చెక్ డ్యాంను కమిటీ సభ్యులు పరిశీలించారు. కమిటీ చైర్మన్ ప్రతాప్‌రావ్ జాదవ్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు మిధున్‌రెడ్డి, రెడ్డెప్ప, నజీర్ అహమ్మద్, తలారి రంగయ్య, రాష్ట్ర ఈజీఎస్ డైరెక్టరు చిన్నతాతయ్య, జాయింట్ కలెక్టరు మార్కండేయులు, డ్వామా పీడీ చంద్రశేఖర్, ఎన్ఆర్జీఎస్ స్టేట్ కౌన్సిల్ సభ్యుడు విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, కల్లూరులో పర్యటనకు ముందు తిరుమల శ్రీవారిని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు దర్శించుకున్నారు. -
అహ్మద్ వనీకి ‘అశోక చక్ర’
న్యూఢిల్లీ: ఉగ్రవాదం బాటవీడి సైన్యంలో చేరి అమరుడైన లాన్స్‌నాయక్ నజీర్ అహ్మద్ వనీ(38)కి కేంద్రం అశోకచక్ర పురస్కారాన్ని ప్రకటించింది. 2018, నవంబర్ 25న షోపియాన్ జిల్లాలోని హీరాపూర్ గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడ్డ అహ్మద్ వనీ ప్రాణాలు కోల్పోయారు. శరీరంలోకి బుల్లెట్లు దిగి రక్తం కారుతున్నప్పటికీ ఓ లష్కరే కమాండర్ సహా ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన తర్వాతే ఆయన నేలకొరిగారు. ఈ నేపథ్యంలో వనీ చూపిన ధైర్యసాహసాలకు గానూ శాంతి సమయంలో అందించే అత్యున్నత సైనిక పురస్కారం అశోకచక్రను ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వనీ భార్య మహజబీన్‌కు ఈ పురస్కారాన్ని అందించనున్నారు. 2004లో వనీ ఆర్మీలోని ‘జమ్మూకశ్మీర్ 162 ఇన్ఫాంట్రీ బెటాలియన్’లో చేరారు. ఉగ్రవాదులపై పోరాటంలో చూపిన తెగువకు గానూ 2007, 2018లో సేనామెడల్‌ను అందుకున్నారు. కుల్గామ్ జిల్లాలోని ఛెకీ అష్ముజీ గ్రామానికి చెందిన వనీకి భార్య మహజబీన్తో పాటు కుమారులు అథర్, షహీద్ ఉన్నారు. ఆయనకు డ్యూటీనే అత్యుత్తమం నజీర్ వనీ కుటుంబాన్ని అమితంగా ప్రేమించేవారని ఆయన భార్య, ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మహజబీన్ తెలిపారు. వనీ ధైర్యవంతుడైన సైనికుడనీ, తన రాష్ట్రంలో శాంతి కోసం పరితపించేవాడని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. జీవితాంతం వనీ పలు ప్రమాదాలను ఎదుర్కొన్నాడనీ, చాలామందికి స్ఫూర్తిగా నిలిచాడని జవాన్లు అన్నారు. -
‘బంగారు గుడ్లు పెట్టే బాతు’ను చంపిందెవరు?
న్యూఢిల్లీ: ‘మా దేశంలో బంగారు గుడ్లు పెట్టే బాతును చంపేశారు’ భారత్‌లోని ప్రముఖ షూ ఎక్స్‌పోర్టర్ కంపెనీ ‘పార్క్ ఎక్స్‌పోర్ట్స్’ సీఈవో నజీర్ అహ్మద్, ఆగ్రా నుంచి టెలిఫోన్లో రాయిటర్స్ సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్య ఇది. ఎందుకు ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ఆయన అంటున్న బంగారు గుడ్లు పెట్టే బాతు ఏమిటీ? దాన్ని ఎవరు చంపేశారు? చంపితే ఆయనకెందుకు అంత ఆందోళన! నజీర్ అహ్మద్ ప్రముఖ షూ కంపెనీ యజమాని కనుక ఆయన మాట్లాడుతున్నది ఆయన కంపెనీ ఉత్పత్తుల ఎగుమతుల గురించేనని సులభంగానే గ్రహించవచ్చు. ఇక ఆయన బంగారు బాతుగా వర్ణించినది తోళ్ల పరిశ్రమ. ఈ పరిశ్రమపై ఆధారపడే పలు భారత్‌కు చెందిన కంపెనీలు చెప్పులు, బూట్లు, తోలు బ్యాగులు, వస్త్రాలను ఎగుమతి చేస్తున్నాయి. వీటి ఎగుమతుల్లో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం భారత్. వీటి ఎగుమతులు గత మార్చి నెల నుంచి ఇప్పటి వరకు భారీగా పడిపోయాయి. పర్యవసానంగా కొన్ని తోళ్ల పరిశ్రమలతోపాటు కొన్ని చెప్పుల పరిశ్రమలు మూతపడ్డాయి. దాదాçపు 30 లక్షల మంది చిరుద్యోగులు రోడ్డున పడ్డారు. గత ఏప్రిల్–మే నెలలో దేశం నుంచి బూట్ల ఎగుమతులు నాలుగు శాతం అంటే, 68 కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులు పడిపోయాయి. సెప్టెంబర్ నాటికి 13 శాతం పడిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో యాభై శాతానికిపైగా ఎగుమతులు పడిపోయే ప్రమాదం ఉంది. జారా అండ్ క్లార్క్స్కు చెందిన ఇండిటెక్స్, హెచ్ అండ్ ఎమ్ లాంటి అంతర్జాతీయ బ్రాండ్ కంపెనీలు బూట్ల దిగుమతిలో భారత్‌కు స్వస్తి చెప్పి చైనా, బంగ్లాదేశ్, ఇండోనేషియా, పాకిస్తాన్ దేశాలకు ఆర్డర్లు ఇవ్వడం ప్రారంభించాయని భారత ఎగుమతిదారుల సంఘాల సమాఖ్య మాజీ అధ్యక్షుడు చెన్నైకి చెందిన ప్రముఖ చెప్పుల వ్యాపారి ఎం. రఫీక్ అహ్మద్ తెలిపారు. దేశంలో తోళ్ల పరిశ్రమ కుంటుపడడం వల్ల తాము సకాలంలో ఆర్డర్లను పూర్తి చేయలేమనే ఉద్దేశంతోనే అంతర్జాతీయ బ్రాండ్ కంపెనీలు తరలిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ గత మార్చి నెలలో పదవీ బాధ్యతలు స్వీకరించడంతోనే దేశంలో తోళ్ల పరిశ్రమకు గడ్డుకాలం ప్రారంభమైంది. రాష్ట్రంలోని లైసెన్స్‌లేని కబేళాలను నిషేధిస్తూ ఆయన తీసుకొచ్చిన ఉత్తర్వులు తోళ్ల పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీసింది. చిన్న చిన్న మాంసం కొట్లు అనియత రంగంలో ఎక్కువగా పనిచేస్తున్నాయని, వాటన్నింటికీ లైసెన్స్ తీసుకోవడం కష్టమని వాటి యజమానులు ఎన్ని విజ్ఞప్తులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వినిపించుకోలేదు. బర్రెలను కోసే చిన్న చిన్న కొట్లతోపాటు పెద్ద స్థాయి కబేళాలు కూడా మూత పడ్డాయి. చెప్పుల పరిశ్రమకు ఎక్కువగా బర్రెల చర్మాలనే వాడుతారు. మాంసం, తోళ్ల ఎగుమతుల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చింది. ఈ రెండు పరిశ్రమల కారణంతా రాష్ట్ర ఖజానాకు ఏటా 56 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. ఈ నేపథ్యంలోనే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవసాయ అవసరాలకు మినహా పశువులను సంతల్లో విక్రయించరాదంటూ నిబంధనలను తీసుకొచ్చింది. ఈ ఉత్తర్వులు పుండు మీద కారం చల్లినట్లయింది. దేశంలో మాంసంతోపాటు తోళ్ల పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింటూ వచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టేను మంజూరు చేసినప్పటికీ గోరక్షకుల దాడికి భయపడుతుండడంతో తోళ్ల పరిశ్రమ కోలుకోలేక పోయింది. జీఎస్టీ కారణంగా ఉత్పత్తుల ధరలు కూడా ఆరేడు శాతం పెరగడం ప్రతికూల ప్రభావాన్నే చూపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన కొత్తలో తోళ్ల పరిశ్రమ ఎగుమతులను 2020 నాటికి 2700 కోట్ల డాలర్లకు తీసుకెళతానని, లక్షలాది కొత్త ఉద్యోగాలు సష్టిస్తానని దేశ ప్రజలకు వాగ్ధానం చేశారు. అందులో భాగంగానే ఆయన ప్రభుత్వం 2016–2017 ఆర్థిక సంవత్సరానికి తోళ్ల పరిశ్రమ ఎగుమతులను 570 కోట్ల డాలర్లుగా నిర్ధేశించింది. అందులో సగానికి సగం కూడా సాధించకపోగా, మొత్తం పరిశ్రమకే ముప్పు ముంచుకొచ్చింది. కొత్త ఉద్యోగాలు రాకపోగా, ఉన్న 30 లక్షల ఉద్యోగాలు ఊడిపోయాయి. ఇక్కడ బంగారు బాతును ఎవరు చంపారో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. (దారితప్పిన దేశ ఆర్థిక పురోగతిని చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆర్థిక వ్యవస్థను సరైన దారిలో పెట్టేందుకు మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం నాడు ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రత్యేక వార్తా కథనం) -
అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతి
సుండుపల్లి మండలంలోని చెన్నంరాజుగారిపల్లిలో నజీర్ అహమ్మద్ (59) అనే వ్యక్తి అతిగా మద్యం సేవించి మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. మడితాడు గ్రామానికి చెందిన నజీర్ రోజూ మద్యం సేవించడానికి చెన్నరాజుగారిపల్లి వస్తుంటాడు. రోజూ లాగే మద్యం సేవించాడు. ఆదివారం ఊరి చివరన అపస్మారక స్థితిలో గ్రామస్తులకు కనిపించాడు. నజీర్‌ను పరిశీలించగా మృతి చెందాడని అర్థమైంది. దీంతో స్థానికులు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.