
80 శాతం పోలింగ్
మూడుచోట్ల 11వ తేదీన రీపోలింగ్
అక్కడక్కడ ఘర్షణలు
మండుటెండలో విలవిల్లాడిన ఓటర్లు
వృద్ధులు, వికలాంగులకు
కానరాని ప్రత్యేక ‘క్యూ’లు
556 జెడ్పీటీసీ, 8,250 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతం: రమాకాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తొలిదశ ప్రాదేశిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదింటి వరకు దాదాపు 80శాతంపైగా పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి వెల్లడించారు. తొలిదశ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కొన్నిచోట్ల చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు.
ప్రస్తుత సమాచారం మేరకు కేవలం మూడుచోట్ల మాత్రమే రీపోలింగ్ నిర్వహించనున్నామని, ఏప్రిల్ 11న రీపోలింగ్ జరుగుతుం దని చెప్పారు. 556 జెడ్పీటీసీ, 8,250 ఎంపీటీసీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో సాయంత్రం ఐదు గంటల వరకు ‘క్యూ’లో నిల్చున్న ఓటర్లందరికీ ఓటు హక్కు కల్పించామని తెలిపారు. ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్‌మిట్టల్‌తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. పోలింగ్ ఉదయం ఉత్సాహంగా సాగిందని, మధ్యాహ్నం ఎండ వేడిమి పెరిగిన కొద్దీ మందకొడిగా జరిగినా.. చివరి రెండు గంటల ముందు ఓటర్లు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి రావడంతో వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించాలని ఆయా జిల్లాల కలెక్టర్లను, రిటర్నింగ్ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
ఈ ఎన్నికల్లో అక్కడక్కడ తెలుగుదేశం-వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయని తెలిపారు. పోలీసుల బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించడం వల్ల గొడవలు సద్దుమణిగాయని అన్నారు. ఖమ్మం జిల్లాలో ఓ ఎస్‌ఐ ఆత్మరక్షణార్థం గాలిలోకి కాల్పులు జరిపారని రమాకాంత్‌రెడ్డి తెలి పారు. కాగా పలుచోట్ల పోలీసులు లాఠీచార్జీ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ప్రకాశం జిల్లాలో సాయంత్రం నాలుగు గంటలకు ముందే పోలింగ్ 80 శాతం దాటిపోయిందని, విశాఖపట్టణంలో పోలింగ్ మందకొడిగా జరిగిందని వివ రించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఓడిగోళంలో ఒక కేంద్రం, నెల్లూరు జిల్లా కోవూరులోని ఒకటో పోలింగ్ కేంద్రం, మెదక్ జిల్లా సంగారెడ్డి మండలంలోని చెర్లగూడెంలో ఒకపోలింగ్ కేంద్రంలో ఏప్రిల్ 11న రీపోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.
ఓటర్లకు కనీస సౌకర్యాలు కరువు
ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉండడంతో ఓటు వేయడానికి వచ్చినవారు క్యూలలో నిల్చోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించినప్పటికీ.. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి సదుపాయాలు లేకపోవడం గమనార్హం. దాంతో వారు ఎండకు విలవిలలాడారు. కనీసం తాగునీరు సౌకర్యం కూడా కల్పించలేకపోయారు. ఎండ నుంచి ఉపశమనం కలిగించడానికి షామియానాలు కూడా వేయకపోవడం గమనార్హం. ఎండవేడిమిని తట్టుకోలేక నీడ లో నిల్చుని ఓట్లు వేద్దామని భావించిన ఓటర్లను పోలీసులు.. వెళ్లిపోండంటూ బెదిరించిన సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి.
బ్యాలెట్ బాక్స్‌ల భద్రతకు సీసీ కెమెరాలు..
బ్యాలెట్ బాక్స్‌లను మొదట మండల కేంద్రాలకు తరలిస్తారని, సోమవారం వాటిని రెవెన్యూ డివిజనల్ పరిధిలో లేదా డీఎస్పీ కార్యాలయాలు ఉన్న చోటకు తరలిస్తారని రమాకాంత్‌రెడ్డి తెలిపారు. అవసరం అనుకున్న ప్రాంతాల్లో మొత్తం బ్యాలెట్ బాక్స్‌లను జిల్లా కేంద్రాలకు తరలిస్తారని ఆయన చెప్పారు. బాక్సుల రక్షణ కోసం అవసరమైనచోట సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు.