టికెట్ ఆశావహులు అనుకున్నంత పనిచేశారు. తమకు దక్కక పోవడంతో తమతమ పార్టీలకు ‘రెబెల్’లు మోగించారు. బుధవారం వారంతా నామినేషన్లు వేసి తమ అధినేతలకు సవాల్ విసిరారు. ఈ బెడద ‘హస్తానికి’ ఎక్కువగా ఉండగా బీజేపీ, టీడీపీల పొత్తు వికటించి అక్కడా తిరుగుబాట్లు కనిపిస్తున్నాయి. ఇక గులాబీ పక్షానికి ఈ చిక్కులు తప్పడం లేదు. ఉప సంహరణ అనంతరమూ వీరు రంగంలో ఉంటే ఆయా పక్షాలకు ఇక్కట్లే.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రధాన రాజకీయ పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తూ భంగపడిన ఔత్సాహికులు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగారు. కొందరు ముందస్తుగా నామినేషన్ వేసి టికెట్ కోసం ప్రయత్నించినా ప్రయోజనం దక్కలేదు. మ రికొందరు మాత్రం టికెట్ కోసం చివ రి నిముషం వరకు లాబీయింగ్ చేసినా దక్కక పోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి అత్యధికంగా తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీ, టీడీపీ పొత్తు మూలంగా టికెట్ ఆశించిన ఇరు పార్టీల నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. నారాయణపేట సీటును బీజేపీకి కేటాయించక పోవడంతో పార్టీ జిల్లా అధ్యక్షుడు రతంగ్ పాండు రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
కాంగ్రెస్ నుంచి జడ్చర్ల టికెట్ ఆశించిన మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం.రమేశ్‌రెడ్డి, కొల్లాపూర్ నుంచి విష్ణువర్దన్ రెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట నుంచి పులి అంజనమ్మ, టీఆర్‌ఎస్ టికెట్ దక్కక పోవడంతో కాంగ్రెస్‌లో చేరిన ఇబ్రహీం తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. నామినేషన్ల పర్వం ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులను బుజ్జగించేందుకు అధికాారిక అభ్యర్థులు, పార్టీలు సామ దాన బేద దండోపాయాలు ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 11, 12న నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ఉండడంతో చివరి వరకు ఎందరు తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉంటారో చూడాల్సిందే.
అన్ని పార్టీల్లోనూ రె‘బెల్స్’
Published Thu, Apr 10 2014 4:01 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement