
వలసపై సలసల...
జెడ్పీ పీఠంపై కన్నేసిన నేతలు
భద్రాచలం, న్యూస్‌లైన్ : జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్‌కావటంతో కుర్చీపై కన్నేసిన రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. జిల్లాలోని 46 మండలాల్లో జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి వాజేడు, వెంకటాపురం, చర్ల, పినపాక మండలాలు మాత్రమే ఎస్సీ మహిళలకు రిజర్వ్ చేయబడ్డాయి.
ఇక్కడ నుంచి గెలిచిన వారిలో ఎవరో ఒకరికి ఖచ్చితంగా జెడ్పీ చైర్‌పర్సన్ పదవి దక్కే అవకాశం ఉంది. దీంతో ప్రధాన రాజకీయపార్టీలన్నీ ఈ నాలుగు మండలాలపైనే దృష్టి సారించాయి. అయితే జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్, టీడీపీల నుంచి పెత్తనం చెలాయిస్తున్న నేతలు తమ అనుచరులకే జెడ్పీ పీఠం కట్టబెట్టాలని ఎవరికివారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎస్సీ మహిళకు రిజర్వ్ అయిన స్థానాల్లో ఆయా మండలాల నుంచి కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన అభ్యర్థులతో నామినేషన్‌లు వేయించారు.
సీపీఎం, టీడీపీ మరో అడుగు ముందుకేసి ఎస్సీ జనరల్ కు కేటాయించిన భద్రాచలం, ఏన్కూర్, అశ్వాపురం వంటి చోట్ల కూడా మహిళలతో నామినేషన్ వేయించటం ద్వారా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ఎస్సీ మహిళా అభ్యర్థులు పోటీలో నిలిచే మండలాల్లో స్థానిక ఎన్నికలు రసవత్తరంగా సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
వలస అభ్యర్థులపై స్థానికుల ఆగ్రహం :
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవి దక్కించుకునేందుకు నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై స్థానికులు భగ్గుమంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి అభ్యర్థులను తీసుకొచ్చి తమ మండలాల్లో పోటీకి నిలపడమేంటని ఆయా మండలాలకు చెందిన ప్రజానీకం మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు నేలకొండపల్లికి చెందిన మహిళచే వాజేడు మండలంలో నామినేషన్ వేయించారు.
మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ఆశీస్సులతోనే ఆమె అక్కడ నుంచి వాజేడుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. సీపీఎం నాయకులు కూడా మణుగూరు నుంచి ఇదే మండలానికి అభ్యర్థిని తీసుకొచ్చారు. ఇక వెంకటాపురం మండలంలో పరిశీలించినట్లైతే టీడీపీ నుంచి నామినేషన్ వేసిన గడిపల్లి కవిత కొత్తగూడెం వాస్తవ్యురాలు కాగా, ఈమెకు ఆ పార్టీ నేత ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అండదండలు ఉన్నట్లుగా ప్రచారం ఉంది.
ఇదే మండలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేసిన న ంబూరి సుజాతది వైరా కాగా, ఈమెను డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క ఇక్కడకు పంపిస్తున్నట్లుగా ఆ పార్టీ నాయకులు చె బుతున్నారు. పినపాకలో కాంగ్రెస్ నుంచి పోటీలో నిలుస్తున్న జాడి జమున హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆమెను పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఇక్కడికి తీసుకువస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే ఇదే మండలంలో టీడీపీ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థి మణుగూరుకు చెందిన వారు.
అదే విధంగా చర్లలో టీడీపీ నుంచి పోటీలో నిలుస్తున్న తోటమల్ల హరిత ఖమ్మం పట్టణానికి చెందిన వారు కాగా, సీపీఎం నుంచి బరిలో నిలుస్తున్న గెద్దల జ్యోతి అశ్వారావుపేట వాస్తవ్యురాలు. ఇలా దాదాపు నాలుగు మండలాల్లో కూడా ప్రధాన పార్టీలన్నీ వేరే మండలాలకు చెందిన అభ్యర్థులతోనే నామినేషన్‌లు వేయించాయి. దీనిపై ఆయా మండలాలకు చెందిన పార్టీల కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. తమ మండలాల వారికి కాదని వేరే ప్రాంతాల వారికి సీట్లు కట్టబెట్టడమేంటని కాంగ్రెస్, టీడీపీ లకు చెందిన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బయట వ్యక్తులకు ఓటేసిలేదని తెగేసి చెబుతున్నారు.
స్థానికులకు గుర్తింపునిచ్చింది ఒక్క వైఎస్‌ఆర్‌సీపీనే
ఎస్సీ మహిళలకు రిజర్వ్ అయిన స్థానాల్లో ఇతర ప్రాంతాలకు చెందిన వారితో పలు పార్టీలు నామినేషన్ వేయించగా...
ఒక్క వైఎస్‌ఆర్‌సీపీనే ఆయా మండలాల్లో గల స్థానిక కార్యకర్తలకు అవకాశం ఇచ్చింది. వెంకటాపురం, చర్ల, పినపాక మండలాల్లో పార్టీ నాయకుల ఆమోదం మేరకు స్థానిక మహిళా అభ్యర్థులనే బరిలో నిలిపారు. చర్ల మండలంలో చింతల శ్రావణి, వెంకటాపురంలో యన్నమల్ల జోత్సారాణి, పినపాక మండలంలో పంతగాని సంధ్యారాణి వైఎస్‌ఆర్‌సీపీ నుంచి నామినేషన్‌లు వేశారు.
సొంతమండలాల నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి అభ్యర్థులను దిగుమతి చేయటంపై ఆయా మండలాల్లోని ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా ఆలోచనలో పడ్డారు. దిగుమతి అభ్యర్థుల వల్ల మండల ప్రజానీకం నుంచి వ్యతిరేక వస్తుందేమోనని వీరు ఆందోళన చెందుతున్నారు. ఫలితాలపై కూడా ఇది ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయని చర్ల మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. మొత్తంగా... తమ ప్రాంత సమస్యలపై అవగాహన ఉన్న స్థానిక అభ్యర్థులకే పట్టం కట్టాలనే చర్చకూడా ఆయామండలాల్లో నడుస్తుండడం విశేషం.