క్రాస్ ఓటింగ్‌తో కుదేలు.. | any party not get majority of seats | Sakshi
Sakshi News home page

క్రాస్ ఓటింగ్‌తో కుదేలు..

Published Thu, May 15 2014 12:10 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

any party not get majority of seats

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  ప్రాదేశిక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మెజార్టీ ఓట్లను కైవసం చేసుకుని అన్ని పార్టీల కంటే ముందువరుసలో నిలిచింది. అటు జిల్లా పరిషత్ ప్రాదేశిక స్థానాల్లో అత్యధిక ఓట్లు సాధించగా, ఇటు మండల పరిషత్ ప్రాదేశిక స్థానాల్లోనూ హవా చూపింది. అయితే అన్ని పార్టీలకు క్రాస్ ఓటింగ్ నమోదు కావడంతో సీట్ల సంఖ్యలో భారీ తేడాలు చోటుచేసుకున్నాయి. ఫలితంగా జిల్లా పరిషత్‌తోపాటు 14 మండల పరిషత్‌లలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాలేదు. ప్రధానంగా ఎంపీటీసీ కోటాలోనే ఓట్లు క్రాస్ కావడంతో మండల పరిషత్ కుర్చీలు కైవసం చేసుకోవడంలో ఆయా పార్టీలు విఫల మయ్యాయి.

 రెండు కేటగిరీల ఓట్లను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఎంపీటీసీ కోటా లో 16,266 ఓట్లు క్రాస్ అయ్యాయి. అదేవిధంగా టీఆర్‌ఎస్ పార్టీకి ఎంపీటీసీ కోటాలో 36,329 ఓట్లు, టీడీపీకి 43,057 ఓట్లు క్రాసయ్యాయి. బీజేపీకి ఎంపీటీసీ కోటాలో 7523 ఓట్లు క్రాసయ్యాయి. ఓటరు వేసే రెండు ఓట్లు ఒకే పార్టీకి పోల్ అయితే హంగ్ సమస్య తలెత్తేది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా మంగళవారం నాటి ఫలితాలను ఒకసారి గమనిస్తే...33 మండలాల్లోని ప్రాదేశిక స్థానాలకు సంబంధించి అధికంగా కాంగ్రెస్ పార్టీ 219 సీట్లు గెలుచుకుంది. అదే తరహాలో 14 జెడ్పీటీసీలను గెలుచుకుంది.

అయితే రెండోస్థానంలో ఉన్న టీఆర్‌ఎస్ 145 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించగా, 12 జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. మూడో స్థానంలో తెలుగుదేశం పార్టీ నిలిచింది. టీడీపీ 129 ఎంపీటీసీ, 7 జెడ్పీటీసీ స్థానాల్లో విజేతగా నిలిచింది. బీజేపీకి జిల్లా పరిషత్ స్థానాన్ని గెలుచుకోనప్పటికీ ప్రధాన పార్టీలకు గట్టిపోటీ ఇచ్చింది. 52 ఎంపీటీసీ స్థానాల్లో గెలిచి పలు మండల పరిషత్‌లో కీలకంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement