మహిళలకు సముచిత స్థానం | appropriate position women in ysrcp | Sakshi
Sakshi News home page

మహిళలకు సముచిత స్థానం

Published Sat, Apr 19 2014 2:15 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

appropriate position women  in ysrcp

 సాక్షి ప్రతినిధి, ఏలూరు : మహిళలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పించింది. ఈ ఎన్నికల్లో రెండు సీట్లు కేటాయించింది. మహిళలపై ఎనలేని అభిమానం ఉందని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ మాత్రం ఒక సీటుతోనే సరిపెట్టడం గమనార్హం. కొవ్వూరు అభ్యర్థిగా తానేటి వనిత, చింతలపూడి అభ్యర్థిగా డాక్టర్ మద్దాల దేవిప్రియను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. కొద్దిరోజుల క్రితం వరకూ గోపాలపురం ఎమ్మెల్యేగా ఉన్న తానేటి వనిత ఏడాది క్రితం టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతోపాటు ప్రజా సమస్యలపైనా పోరాటాలు చేశారు.

కొద్దినెలల క్రితం ఆమెను కొవ్వూరు సమన్వయకర్తగా నియమించిన వైఎస్సార్ సీపీ తాజా ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీకి దింపింది. చింతలపూడి నియోజకవర్గంలో డాక్టర్ దేవీప్రియకు సీటిచ్చింది. దేవీప్రియ మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ సతీమణి. మహిళలకు అవకాశం ఇవ్వాలనే ఏకైక లక్ష్యంతో ఆమెకు చింతలపూడి సీటును కేటాయించారు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఒకే ఒక సీటును మహిళలకు ఇచ్చింది. చింతలపూడిలో పీతల సుజాతను ఆ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు మహిళలకు అవకాశం ఇవ్వడంతో దిక్కుతోచని స్థితిలో సుజాతకు చివరి నిమిషంలో చింతలపూడి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఆమె మొదటి నుంచీ సీటు అడుగుతున్నా చంద్రబాబు పట్టించుకోలేదు.

 కొవ్వూరు, గోపాలపురం, చింతలపూడిలో ఏదో ఒకచోట తనకు అవకాశం ఇవ్వాలని ఆమె పదేపదే కోరుతూ వచ్చారు. అయినా పట్టించుకోని బాబు చివరకు చింతలపూడి సీటు ఇవ్వడం విశేషం. సుజాత నియోజకవర్గానికి చెందిన వారు కాకపోవడంతో ఆమె అభ్యర్థిత్వాన్ని స్థానిక నాయకులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో పార్టీలో గందరగోళం నెలకొంది. గత ఎన్నికల్లోనూ టీడీపీ ఒక మహిళకే అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పాలకొల్లు, గోపాలపురం స్థానాలను మహిళలకు కేటాయించింది. పాలకొల్లులో కాంగ్రెస్ అభ్యర్థి బంగారు ఉషారాణి ఏకంగా పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవిని ఓడించి సంచలనం సృష్టించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement