నరేంద్ర మోడీవి హెలికాప్టర్ రాజకీయాలు
వారణాసి: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీవి హెలికాప్టర్ రాజకీయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, ఆయనపై వారణాసి నుంచి పోటీ చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఎన్నికల ప్రచారానికి కేవలం రెండు గంటల ముందు హెలికాప్టర్‌లో వారణాసి చేరుకున్న మోడీ... ఎన్నికల అనంతరం ప్రజలకు కనిపించరన్నారు. తాను మాత్రం ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని శుక్రవారం వారణాసిలో నిర్వహించిన రోడ్‌షోలో ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ చరిత్రాత్మక ఎన్నికల్లో మోడీ సారథ్యంలోని అవినీతి రాజకీయాలకు మద్దతిస్తారో లేక ప్రేమ, గౌరవంతో కూడిన స్వచ్ఛమైన రాజకీయాలకు పట్టం కడతారో తేల్చుకోవాలని సూచించారు. గంగా హారతిని కూడా మోడీ రాజకీయ లబ్ధికి వాడుకోవాలని చూస్తున్నారని...గంగా హారతి నిర్వహించేందుకు అధికారులు అనుమతి ఇచ్చినా ఇవ్వలేదని మోడీ అబద్ధాలాడారని కేజ్రీవాల్ దుయ్యబట్టారు.
ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ కుల, మత రాజకీయాలకు పాల్పడటంతోపాటు మీడియాకు ముడుపుల ఎర వేస్తోందని ఆరోపించారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా తాను భారీ మెజారిటీతో గెలుస్తానని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, శనివారం ప్రచారం గడువు ముగిశాక వారణాసిలో ఓటు హక్కు లేని కేజ్రీవాల్ కుటుంబంతోపాటు అమిత్ షా, అరుణ్‌జైట్లీ తదితర బీజేపీ నేతలంతా ఎన్నికల నిబంధన ప్రకారం నగరాన్ని వీడాల్సిందేనని అధికారులు శుక్రవారం స్పష్టం చేశారు.