
అరుణ్ జైట్లీ పర్యటనలో బెలూన్ పేలుళ్లు
బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ పంజాబ్ పర్యటన నిజంగానే 'ధమాకా' అనిపించింది. ఆయన రాక సందర్భంగా ఏర్పాటుచేసిన గ్యాస్ బెలూన్లకు మంటలు అంటుకుని అవికాస్తా పేలిపోయాయి. జైట్లీ వస్తున్నారని టపాసులు కాల్చడంతో వాటినుంచి నిప్పురవ్వలు రేగి ఈ హాట్ ఎయిర్ బెలూన్లకు అంటుకుంది.
దీంతో జైట్లీ సహా కొందరు పార్టీ నాయకులకు కొద్దిగా కాలిన గాయాలయ్యాయి. అమృతసర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న అరుణ్ జైట్లీకి బీజేపీ, అకాలీదళ్ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో స్వాగతం పలకాలనుకున్నారు. ఇంతకు ముందు ఈ స్థానానికి మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఈసారి పోటీ నుంచి తప్పుకోవడంతో జైట్లీ రావాల్సి వచ్చింది. ఇంతకుముందు జైట్లీ రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న విషయం తెలిసిందే.