సాధారణ ఎన్నికల్లో కుదిరిన పొత్తు
సాక్షిప్రతినిధి, వరంగల్ : భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలు జతకట్టాయి. సాధారణ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు అంగీకారం కుదిరిందని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు. పొత్తు విషయూన్ని టీడీపీ తెలంగాణ ఎన్నికల కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి దయాకర్‌రావు బుధవారం వెల్లడించారు.
ఏ స్థానంలో ఎవరు పోటీ చేయాలనే విషయం పైనే చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. సీట్ల విషయంలో తకరారు ఎలా ఉన్నా.. రెండు పార్టీలు ఎన్నికల్లో కలిసి ముందుకుసాగడం ఠమొదటిపేజీ తరువాయి
ఖరారైంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా 50 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుందని కమలనాథులు అంటున్నారు.
వరంగల్ జిల్లాలో ఒక లోకసభ, ఐదు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుందని, పొత్తులపై చర్చల సందర్భంగా తమ పార్టీ కోరే స్థానాల జాబితాను టీడీపీకి అందజేసినట్లు చెబుతున్నారు. వీటన్నింటినీ బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే పొత్తుతో కొన్ని సీట్లలో ఇబ్బంది ఉండగా... మరికొన్ని సీట్లలో గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థులు ఎవరనేది రెండు పార్టీలకూ అర్థం కావడం లేదు.
వరంగల్ లోక్‌సభకు సంబంధించి దొమ్మాటి సాంబయ్య టీడీపీ అభ్యర్థిగా ప్రచారం చేశారు. పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి వెళ్తుండడంతో సాంబయ్య రాజకీయ పయనం ఆసక్తికరంగా మారింది. లోక్‌సభ స్థానానికి పోటీ చేసేందుకు టీఆర్‌ఎస్ నుంచి మళ్లీ టీడీపీలో చేరిన సాంబయ్యకు బీజేపీతో పొత్తు ఇబ్బందికర పరిస్థితి తెచ్చింది.
వరంగల్ పశ్చిమ(హన్మకొండ)లో 1999లో టీడీపీ పొత్తుతో బీజేపీ గెలిచింది. మళ్లీ 2004లో ఓడిపోయింది. అరుుతే గతంలో గెలిచిన సీటు కావడంతో దీని కోసం బీజేపీ పట్టుబడుతోంది. మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు ఇక్కడ మళ్లీ పోటీ చేయనున్నారు. ఇతర నేతలు టి.రాజేశ్వరరావు, రావు పద్మలు ఇక్కడ టికెట్ రేసులో ఉన్నారు. వరంగల్ పశ్చిమలో టీడీపీ ప్రభావం లేకపోవడంతో బీజేపీ సొంత బలంతోనే ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి.
వరంగల్ తూర్పు సెగ్మెంట్‌లోనూ పోటీ చేసేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసుకుంటోంది. స్థానిక బీజేపీ నేత లు వంగాల సమ్మిరెడ్డి, చింతాకుల సునీల్, రావు పద్మ, ఆకారపు మోహన్, అల్లం నాగరాజు, గందె నవీన్‌లు టికెట్ ఆశిస్తున్నారు. వరంగల్ తూర్పులో టీడీపీ గెలిచే పరిస్థితి లేకపోవడంతో ఈ సీటు తమకే వస్తుందని బీజేపీ నేతలు అంటున్నారు.
భూపాలపల్లి నియోజకవర్గంలో బీజేపీ పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తోంది. ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించే వారు ఎక్కువగానే ఉన్నారు. నరహరి వేణుగోపాల్‌రెడ్డి, నాగపురి రాజమౌళి, కాసర్ల రాంరెడ్డి, చందుపట్ల జంగారెడ్డి కుటుంబం ఇకడ టిక్కెట్ ఆశిస్తోంది. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు వల్ల పోటీ చేసే అవకాశం కోల్పోయిన టీడీపీ నియోజకవర్గ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణరావుకు ఈసారి బీజేపీతో పొత్తు ఇబ్బందులు సృష్టిస్తోంది. ఈ సీటును బీజేపీకి ఇస్తే గండ్ర తీవ్రమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఇక్కడ టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
జనగామ అసెంబ్లీ స్థానంలో బీజేపీకి సొంత నాయకులు లేరు. ఇటీవలే పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేయనున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎడబోయిన బస్వారెడ్డి ఈ సెగ్మెంట్‌లో ఇంచార్జీగా ఉన్నారు. బస్వారెడ్డి పోటీకి ఆసక్తిగా లేకపోవడంతో ఈ సీటును బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ అంగీకారం తెలిపింది.
వర్ధన్నపేట నియోజకవర్గాన్ని బీజేపీ కోరుతోంది. టీడీపీకి ఇక్కడ నాయకులు ఎవరూ లేకపోవడంతో ఈ సీటును బీజేపీకి ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిసింది. బీజేపీ నుంచి ఇక్కడ ఎవరు పోటీ చేస్తారనే విషయంలో స్పష్టత రావడం లేదు.మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ వర్ధన్నపేటలో పోటీ చేస్తే... తమ అభ్యర్థులు బరిలో ఉండకపోవచ్చని టీడీపీ, బీజేపీ నేతలు చెబుతున్నారు.