కాయ్ రాజా.. కాయ్!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:జిల్లాలో ఫ్యాన్ గాలి హోరెత్తుతుంటే... బెట్టింగుల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్‌కు అనుకూలంగా జోరు కొనసాగుతోంది. పోలింగ్‌కు సమయం ఆసన్నంకావడంతో బెట్టింగుల బ్యాటింగ్‌కు పిచ్ రెడీ అవుతోంది. బెట్టింగ్‌ల సరళి అంతా వైఎస్సార్‌సీపీ గెలుపుపైనే కొనసాగుతోంది. ఎన్నికల్లో గాలి ఎటు వీస్తే... బెట్టింగుల జోరూ అటే సాగుతుందన్నది అందరికీ తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే ఈ సారి జిల్లాలో పందెపు రాయుళ్లందరూ వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపుపై భారీగా బెట్టింగులకు దిగుతున్నారు. సాధారణంగా పోలింగ్ తరువాత నుంచి బెట్టింగులు మొదలవుతాయి. ఈసారి పోలింగ్‌కు వారం ముందు నుంచే బెట్టింగులకు తెర లేచినట్టు సమాచారం. అది కూడా వైఎస్సార్ కాంగ్రెస్‌కు అనుకూలంగా భారీగా పందాలకు సిద్ధపడుతుండగా... టీడీపీ గెలుపుపై పందాలు కాసేందుకు పెద్దగా ముందుకు రాకపోవడం గమనార్హం. దీంతో ఒకటికి రెండు ప్రాతిపదికన వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా బెట్టింగులకు కూడా సిద్ధపడుతుండటం జిల్లాలో ఓటింగ్ సరళిని ముందే వెల్లడిస్తోంది.
బెట్టింగుల పిచ్ రెడీ!...
ఎన్నికల్లో ప్రచారం, ఓటింగ్‌ల తరువాత అత్యంత ఆసక్తికరమైన అంశం బెట్టింగులే. పోలీసులు ఎంత కట్టడి చేద్దామనుకున్నా బెట్టిం గులు జోరుగానే సాగుతాయన్నది అందరికీ తెలిసిందే. ఈసారి ఎన్నికలు ఎంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్నాయో... బెట్టింగులూ అంత ఆసక్తికరంగా మారుతున్నాయి. విజయవాడ, విశాఖపట్నం కేంద్రంగా బెట్టింగులకు ఇప్పటికే తెరలేచింది. విజయవాడ, విశాఖపట్నంలకు చెందిన కొందరు జిల్లాలో బెట్టింగులకు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో10 అసెంబ్లీ నియోజక వర్గాలు, శ్రీకాకుళం ఎంపీ నియోజకవర్గంలో ఫలితాలపై బెట్టింగుల కౌంటర్ ఓపెన్ చేశారు. ముందుగా జిల్లాలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై కచ్చితమైన అంచనాకు వచ్చాక పందేలకు తలుపులు తెరిచారు. ప్రస్తుతానికి ఒక్కొక్కటి కనీసం రూ.50 వేల నుంచి గరిష్టంగా రూ.50 లక్షల వరకు పందాలు కాసుకోవచ్చని ఆఫర్ ఇచ్చారు. పోలింగ్ తరువాత పందెం విలువ రూ.కోటి దాటి కూడా ఒక్కో పందెం కాసేందుకు అవకాశమిస్తామని చెబుతున్నారు.
‘ఫ్యాన్’ గెలుపుపైనే పందాల జోరు
జిల్లాలో కనీసం 8 స్థానాలు... గరిష్టంగా మొత్తం 10 స్థానాలూ వైఎస్సార్ కాంగ్రెస్ గెలుస్తుందన్న దిశగా పందాలు సాగుతున్నాయి. టీడీపీ గెలుపుపై పందాలు కాయడానికి ఎవరూ ఆసక్తిచూపించకపోవడంతో బెట్టింగ్ కేంద్రాల నిర్వాహకులను నివ్వెరపరుస్తోంది. టీడీపీ గెలుపుపై ఏమాత్రం నమ్మకంలేకపోవడంతోనే ఎవరూ పందాలకు ముందుకు రావడం లేదని వారు నిర్ధారణకు వచ్చేశారు. తాము బలంగా ఉన్నామని టీడీపీ గొప్పగా చెప్పుకుంటున్న ఒకట్రెండు నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీ విజయంపై ఎవ్వరూ బెట్టింగుకు సుముఖత చూపించడం లేదు. ఆ ఒకట్రెండు నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఓడిపోతుందనే వాదన బలపడుతోంది.
వైఎస్సార్ సీపీకే అనుకూలం
జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లలోనూ వైఎస్సార్ కాంగ్రెస్‌కే అనుకూల పరిస్థితి ఉందని బెట్టింగ్ రాయళ్లు తేల్చి చెబుతున్నట్టు సమాచారం. దీంతో బెట్టింగ్ కేంద్రాల నిర్వాహకులు పందాల పంథా మార్చారు. ‘ఒకటికి రెండు’ అనే ప్రాతిపదికన పందాలు నిర్వహిస్తున్నారు. అంటే వైఎస్సార్ కాంగ్రెస్ గెలిస్తే రూ.100కు రూ.100 ఇస్తే... అదే టీడీపీ గెలిస్తే రూ.100కు రూ.200 ఇస్తామన్న కోణం లో పందాలకు ముందుకొస్తున్నట్టు సమాచారం. ఇంత ఆఫర్ ఇచ్చినా టీడీపీ తరఫున పందెం కాసేవారు కరువవు తున్నట్టు సమాచారం. జిల్లాలో కనీసం రూ.50వేల నుంచి రూ.10 లక్షల వరకు పందాలు కాయ డం ప్రారంభించారు. ఆ లెక్కన జిల్లాలో ఇప్పటికే 10 నియోజకవర్గాలకు కలిపి రూ.5 కోట్ల వరకు పం దాలు కాసినట్లు సమాచారం. పోలింగ్ సమయూనికి రూ.50 లక్షల చొప్పున పందాలక ముందుకొస్తార ని నిర్వాహకులు చెబు తున్నారు. ఎన్నికల లెక్కింపు సమయానికి బెట్టింగుల విలువ వంద కోట్ల కు చేరుకుంటుందని అంచనా.