సినిమా హిట్ కావాలంటే క్లైమాక్స్‌లో సత్తా ఉండాలి. అలాగే రాజకీయాల్లో విజయం సాధించాలంటే చివరి ఎపిసోడ్‌లో అలర్ట్‌గా ఉండాలి. నామినేషన్, ప్రచారం, పోలింగ్, కౌంటింగ్ ముగిసినా... చివరి అంకమైన పాలకవర్గాల ఏర్పాటు ప్రధానపార్టీలకు సవాల్‌గా మారింది. బొటాబొటి మెజార్టీ వస్తే...అటువారిని ఇటు...ఇటు వారిని అటు కొనేసి పాలకవర్గాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీంతో తమపార్టీ తరఫున గెలిచిన అభ్యర్థులను కాపాడుకునేందుకు పార్టీలు క్యాంపు రాజకీయానికి తెరలేపుతున్నాయి. అభ్యర్థులను పుణ్యక్షేత్రాలతో పాటు గోవా, కేరళ లాంటి పర్యాటక ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.
సాక్షి, కడప: జిల్లాలో కడప కార్పొరేషన్, 7 మునిసిపాలిటీలకు మార్చి 30న ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల షెడ్యూలు ప్రకారం ఏప్రిల్2నే ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికలపై వీటి ఫలితాలు ప్రభావం చూపుతాయని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఫలితాలను మే 12న లెక్కించాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో నేడు మునిసిపాలిటీల ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఎన్నికైన కౌన్సిలర్లు చైర్మన్లను, కార్పొరేటర్లు మేయర్‌ను వెంటనే ఎన్నుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ ఎంపికలో ఎంపీ, ఎమ్మెల్యేలకు ఓటు వేసే సౌలభ్యం ఉండటం, జూన్2న కొత్త రాష్ట్రం ఏర్పాటు కానుండటంతో అప్పటిదాకా చైర్మన్, మేయర్ అభ్యర్థులు నిరీక్షించకతప్పదు. సోమవారం కడప కార్పొరేషన్ పరిధిలో 50మంది కార్పొరేటర్లు, 7 మునిసిపాలిటీల పరిధిలో 186మంది కౌన్సిలర్లు ఎన్నిక కానున్నారు. అలాగే జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల కౌంటింగ్ మంగళవారం జరగనుంది. 10 నియోజకవర్గాల పరిధిలో 50మంది జెడ్పీటీసీ, 559మంది ఎంపీటీసీలు ఎన్నిక కానున్నారు. ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు జిల్లా పరిషత్ చైర్మన్‌ను ఎన్నుకునేందుకు జూన్ 2 వరకూ నిరీక్షించాల్సిందే. ఈ క్రమంలో ఫలితాల వెల్లడి తర్వాత తమ పార్టీలకు చెందిన అభ్యర్థులను కాపాడుకునే యత్నంలో వైఎస్సార్‌కాంగ్రెస్, టీడీపీలు ఉన్నాయి. మండల పరిషత్, జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను ఆశిస్తున్న నేతలు గెలిచిన సభ్యులతో క్యాంపులు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు.
పుణ్యక్షేత్రాలు..పర్యాటక ప్రదేశాలు
జిల్లాలోని కార్పొరేషన్, 7మునిసిపాలిటీలు, 50 మండల పరిషత్, జిల్లా పరిషత్ చైర్మన్‌ల ఎన్నిక వచ్చే నెల 2 తర్వాత జరిగే అవకాశాలు ఉండటంతో అప్పటి వరకూ గెలిచిన అభ్యర్థులను కాపాడుకునేందుకు పలు పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపుతున్నాయి. ప్రస్తుతం వేసవి కావడంతో అభ్యర్థులు భార్య, పిల్లలతో సిద్ధమవుతున్నారు.
గతంలో క్యాంపు రాజకీయాలు నాలుగైదు రోజులు జరిగేవి. అనివార్య కారణాలతో గెలిచిన సభ్యులను 20రోజుల పాటు కాపాడుకోవాల్సిన పరిస్థితి. పార్టీలు కూడా చైర్మన్ పదవులను ఆశిస్తున్న నేతలను ఈ ఖర్చుకు అవసరమైన నిధులు సమకూర్చుకోవాలని సూచిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికలకు భారీగా ఖర్చు చేశామని 20రోజుల పాటు క్యాంపు నడపాలంటే తడిసిమోపెడవుతుందని చైర్మన్ అభ్యర్థులు చెబుతున్నారు.
అయితే ఇంతా కష్టపడి తీరా పదవి దక్కే సమయంలో నిర్లిప్తత ప్రదర్శిస్తే అసలుకే మోసం వస్తుందని ఖర్చుకు వెనుకాడకుండా ‘క్యాంపు’కు రెడీ అవుతున్నారు. కొందరు చైర్మన్ ఆశావహులు పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లేందుకు ప్రత్నిస్తున్నారు. ఇంకొందరు గోవా, కేరళ లాంటి ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనికోసం కొంతమంది ట్రావెల్ ఏజెన్సీలను కూడా సంప్రదిస్తున్నారు. ఫలితాలు వెలువడగానే సోమవారం సాయంత్రం నుంచే క్యాంపు రాజకీయాలు ఊపందుకోనున్నాయి.
ఇక క్యాంపు రాజకీయం
Published Mon, May 12 2014 2:59 AM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM
Advertisement
Advertisement