సీబీఐ.. డర్టీ ట్రిక్స్ డిపార్ట్‌మెంట్
బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణన్ గాంధీ ఘాటు విమర్శలు
న్యూఢిల్లీ: అధికార పక్షం చేతిలో పావుగా మారిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)ను పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణన్ గాంధీ మంగళవారం తన మాటలతో ఉతికి ఆరేశారు. ఢిల్లీలో సీబీఐ నిర్వహించిన ఓ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఆయన.. అదే కార్యక్రమంలో సీబీఐపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం చేతిలో గొడ్డలిగా మారి సీబీఐ అపకీర్తి మూటగట్టుకుందన్నారు. సీబీఐ.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ డర్టీ ట్రిక్స్(నీచపు కుయుక్తుల విభాగం)గా వ్యవహరిస్తోందని, చీకటి బట్టలు కట్టి, రహస్యాల ముసుగేసుకుని పారదర్శకతకు నిలువునా పాతరేసిందని దుయ్యబట్టారు. దర్యాప్తు సమయంలో సీబీఐ లీకులివ్వడం గర్హనీయమన్నారు. సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా సహా పలువురు ఉన్నతాధికారులు హాజరైన ఆ కార్యక్రమంలో గాంధీ వ్యాఖ్యలు ఇవీ..
నిజాయితీ పక్షాన నిలవాల్సిన సీబీఐ ప్రభుత్వం చేతిలో గొడ్డలిగా మారింది. సీబీఐని తరచు డీడీటీ అంటుంటారు. అంటే డైక్లోరో, డెఫైనిల్,ట్రైక్లోరోఈథేన్-రంగులేని, రుచిలేని, వాసన లేని కీటకంలా ఉండాలని దానర్థం. కానీ ఇది డిపార్ట్‌మెంట్ ఆఫ్ డర్టీ ట్రిక్స్‌గా మారింది. కొంతకాలం సీబీఐ ఆర్టీఐ పరిధిలో ఉంది. ఆ సమయంలో కొంపలేమీ కూలిపోలేదు కానీ.. చీకటి, రహస్య శక్తులు సీబీఐని చట్ట పరిధి నుంచి బయటకు లాక్కొచ్చేశాయి. ఇది చాలా బాధాకరమైన విషయం. రాజకీయ పార్టీల కుట్రల కారణంగా ప్రభుత్వంలో సీనియర్ అధికారులపై సీబీఐని ప్రయోగిస్తుండడం శోచనీయం. ఇలాంటి సమయాల్లో సీబీఐ నైతికతతో వ్యవహరించాలి.