ఎన్నికల గోదాలో ముగ్గురు మాజీ సీఎంలు
శ్రీదేవి, సాక్షి-ఢిల్లీ: చార్‌ధామ్‌లకు నెలవైన పర్వతప్రాంత రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో లోక్‌సభ ఎన్నికలు పలువురు హేమాహేమీల ప్రతిష్టకు సవాలుగా మరాయి. ఈ రాష్ట్రంలోని ఐదు లోక్‌సభ స్థానాల నుంచి పోటీపడుతున్న ప్రముఖుల్లో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రి తనయుడు, ముఖ్యమంత్రి భార్యతో పాటు దేశంలోనే తొలి మహిళా డీజీపీ ఉన్నారు. మే 7న లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న ఈ రాష్ర్టంలో నామినేషన్ల పర్వం శనివారం నుంచి ఆరంభమైంది. ఈ రాష్ట్రంలో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యనే ఉన్నా, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇద్దరు అభ్యర్థులను ప్రకటించి తన ఉనికిని చాటుకుంది. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీ ఉత్తరాఖండ్ క్రాంతిదళ్ ఎన్నికల ముందే చీలికల కారణంగా బలహీనపడింది.
ఉత్తరాఖండ్‌లోని ఐదు లోక్‌సభ నియోజక వర్గాలు- అల్మోడా, నైనిటాల్- ఉధమ్‌సింగ్ నగర్, తెహ్రీ గడ్వాల్, గడ్వాల్, హరిద్వార్ కాగా, వీటిలో అల్మోడా ఎస్సీలకు రిజర్వ్ చేశారు. ఐదు లోక్‌సభ స్థానాలలో మూడింటి నుంచి బీజేపీ నిలబెట్టిన అభ్యర్థులు మాజీ ముఖ్యమంత్రులే కావడం విశేషం. గడ్వాల్ నుంచి బీజేపీ మాజీ ముఖ్యమంత్రి బీసీ ఖండూరీకి టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి రాష్ట్ర మంత్రి హరక్ సింగ్ రావత్ ఆయనపై పోటీకి దిగారు. తెహ్రీ నుంచి మాజీ సీఎం విజయ్ బహుగుణ తనయుడు సాకేత్ బహుగుణకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. 2012 ఉప ఎన్నికలో సాకేత్‌ను ఓడించిన రాజ్యలక్ష్మీ షాను బీజేపీ బరిలోకి దింపింది. నైనిటాల్‌లో బీజేపీ మాజీ ముఖ్యమంత్రి బీసీ ఖోషియారీ, కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీల మధ్య పోటీ జరగనుంది. అల్మోడాలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ ప్రదీప్ తమ్టా, బీజేపీ ఎమ్యెల్యే అజయ్ తమ్టాతో తలపడనున్నారు. హరిద్వార్‌లో బీజేపీ మరో మాజీ సీఎం రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, సీఎం హరీష్ రావత్ సతీమణి రేణుకా రావత్‌ల మధ్య పోటీ జరుగనుంది. ఇక్కడ ఆప్ మాజీ డీజీపీ కంచన్ చౌదరి టికెట్ ఇచ్చింది.
పునరావాసమే కీలకం
గత ఏడాది ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన ఉత్తరాఖండ్‌లో వరదబాధిత ప్రాంతాలలో పునరావాసం, పునరుద్ధరణ కార్యక్రమాలే ఈ ఎన్నికల్లో ప్రధానాంశం కానుంది. పునరావాస పనులు నత్తనడకన సాగుతుండటంపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలలో అసంతప్తి తీవ్రంగా ఉంది. ఈ అసంతప్తిని గమనించిన కాంగ్రెస్ కొంతకాలం కిందట ముఖ్యమంత్రిని మార్చింది. పునరావాస పనులలో ప్రభుత్వ వైఫల్యం బీజేపీకి అనుకూలించే అవకాశం ఉంది. ప్రముఖ ఘడ్వాలీ నేత మాజీ ఎంపీ సత్పాల్ మహారాజ్ ఇటీవల తన మద్దతుదారులతో కలిసి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడం కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బే. ఈ ఎన్నికలలో బీజేపీ గెలిచినట్లయితే రాష్ట్రంలో తమ ప్రభుత్వ మనుగడకు కూడా ముప్పు వచ్చే ప్రమాదం పొంచి ఉండడంతో గెలుపు కోసం కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది.