నల్లారి శకం ముగిసింది
చిత్తూరు జిల్లాలో చంద్రబాబు వ్యాఖ్య
రాష్ట్ర రాజకీయాల్లో నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి శకం ముగిసిపోయిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించా రు. ఆదివారం చిత్తూరు జిల్లాలోని పీలేరు, పుంగనూరు, పలమనేరు, కుప్పంలో ఎన్నికల బహిరంగసభల్లో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ సీమాంధ్రకు న్యాయం చేయలేని కిరణ్ ఇప్పుడేదో ఉద్ధరిస్తానంటూ ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకోలేని అసమర్థ సీఎంగా కిరణ్ చరిత్రలో మిగిలిపోతాడని దుయ్యబట్టారు. టీడీపీ ప్రభుత్వం తమ హయాంలో సింహాచలం, శేషాచలం అడవుల్లో ఎర్రచందనం మొక్కలు నాటిందన్నారు.
అయితే కిరణ్ సోదరుడు, పీలేరు అభ్యర్థి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి వాటిని నరికించి అమ్మేశాడని ఆరోపించారు. ఈ ఎన్నికలతో సీమాంధ్రలో జై సమైక్యాంధ్ర, కాంగ్రెస్ పార్టీలు గల్లంతు కావడం తథ్యమని అన్నారు. కాగా పీలేరు బహిరంగ సభలో చంద్రబాబునాయుడి ప్రసంగంలో రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం. కాగా, చంద్రబాబు బహిరంగ సభకు జనాన్ని తరలించడం కోసం పార్టీ నేతలు నానా తంటాలు పడ్డారు. కొద్దిమందితోనే సభను అరగంటలో ముగించారు. కుప్పం సభకు రాష్ట్ర సరిహద్దు గ్రావూల నుంచి ప్రజలను తరలించారు. డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ చేసి విందు భోజనాలు పెట్టారు.