బీసీలకు బాబు బురిడీ
* తెలంగాణలో బీసీని సీఎం చేస్తానంటూ హైడ్రామా
* ఆర్.కృష్ణయ్యను బరిలోకి దించి.. పట్టించుకోని వైనం
* ఆయన ఓటమికి పరోక్షంగా ప్రయత్నాలు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ముందు హామీలివ్వడం, ఎన్నికలయ్యాక వాటిని తుంగలో తొక్కడం అలవాటుగా మార్చుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఈసారి వెనుకబడిన తరగతుల వారికి టోపీ పెట్టేశారు. బీసీ వర్గాల వారికి వంద సీట్లు కేటాయిస్తానని గత ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు టిక్కెట్ల కేటాయింపులో మొండిచెయ్యి చూపారు. ఈసారి బీజేపీతో పొత్తు కట్టడంతో మైనార్టీఓట్లు దూరమవుతాయని భావించి మరోసారి బీసీ ఓట్లపై కన్నేశారు.
తెలంగాణలో బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తానంటూ ఆర్భాటంగా ప్రకటించారు. సీఎం అభ్యర్థిగా దశాబ్దాలుగా బీసీల హక్కులకోసం పోరాడుతున్న ఆర్.కృష్ణయ్య పేరును వెల్లడించారు. టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పార్టీ పరంగా విడుదల చేసిన ఎన్నికల పత్రికా ప్రకటనల్లో ఆయన ఫొటో కూడా ప్రచురించారు. కానీ ఆయన విజయం సాధించకుండా ఉండటానికి చేయాల్సిన పనులన్నీ తెరవెనుక చేశారని బీసీ వర్గాలు మండిపడుతున్నాయి. కృష్ణయ్య గెలుపుకోసం కాకుండా పలువురు నేతలు ఆయన ఓటమి కోసం పనిచేయడంపై బుధవారం జరిగిన ఎన్నికల పోలింగ్ సరళిని విశ్లేషించుకున్న బీసీ వర్గాల్లో అనుమానాలు తలెత్తాయి.
ఒక పథకం ప్రకారం పార్టీ నాయకత్వమే ఇదంతా చేయించిందని గ్రహించిన బీసీ సామాజిక వర్గాలకు చెందిన నేతలు ఆగ్రహంతో ఉన్నారు. పోలింగ్ సరళిని విశ్లేషించుకున్న కృష్ణయ్య సన్నిహితులు, బీసీ సంఘాల నేతలు కూడా చంద్రబాబు వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది. చంద్రబాబును నమ్ముకుని నిండా మునిగామని బీసీ సంఘాలకు చెందిన ఒక నాయకుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
* తెలంగాణలో టీడీపీ విజయం సాధిస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించే సమయంలో సీఎం అభ్యర్థిగా ఆర్. కృష్ణయ్య పేరును వెల్లడించారు. దీంతో తెలంగాణతోపాటు సీమాంధ్ర ప్రాంతంలో బీసీ సామాజికవర్గాలన్నీ ఏకపక్షంగా తమకే ఓటేస్తాయని చంద్రబాబు భావించారు.
* తెలుగుదేశం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పార్టీ పరంగా విడుదల చేసిన ఎన్నికల పత్రికా ప్రకటనల్లో ఎన్‌టీ రామారావు, చంద్రబాబు, కృష్ణయ్య ఫొటోలను ముద్రించారు. సొంత సామాజికవర్గంతోపాటు సెటిలర్ల ఓట్లు అధికంగా ఉంటే ఎల్బీనగర్ నియోజకవర్గంలో కృష్ణయ్యను పోటీకి పెట్టారు. తెలంగాణకు బీసీని సీఎం చేస్తానని పలు సభల్లో బల్లగుద్ది చెప్పి కృష్ణయ్యను బరిలోకి దింపిన చంద్రబాబు.. ఆ తర్వాత ఆయన గురించి పట్టించుకోవటం మానేశారు. ఆయన గెలుపుకోసం ముఖ్య నేతలెవ్వరికీ ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు.
* ఎల్బీనగర్ టిక్కెట్టు ఆశించి భంగపడ్డ ఎస్‌వీ కృష్ణప్రసాద్ అనుచరులు కృష్ణయ్య నామినేషన్ దాఖలు సమయంలోనే ఆయన వాహనశ్రేణితో పాటు అనుచరులపై దాడి చేశారు. అయినప్పటికీ కృష్ణప్రసాద్‌పై చంద్రబాబు చర్య తీసుకోలేదు. పలు చోట్ల టిక్కెట్టు ఆశించి భంగపడ్డవారిని పిలిపించి బుజ్జగించిన చంద్రబాబు కృష్ణ ప్రసాద్ తో కనీసం మాట్లాడలేదు. దీంతో కృష్ణప్రసాద్‌తో పాటు ఆయన అనుచరులందరూ కాంగ్రెస్‌లో చేరారు.
* సినీ నటుడు, చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణకు కృష్ణ ప్రసాద్ అత్యంత సన్నిహితుడు. బాలకృష్ణ లేదా చంద్రబాబు ఒకసారి పిలిచి మాట్లాడితే కృష్ణప్రసాద్ ఎన్నికల విజయానికి సహకరించేవారని, అలా పిలిచి మాట్లాడకపోవడంలోనే మతలబు ఉన్నట్టు బలంగా వినిపిస్తోంది. కాాంగ్రెస్‌లో చేరడానికి ముందు ఆయన చంద్రబాబు, బాలకృష్ణలకు సమాచారం కూడా ఇచ్చారని కూడా సమాచారం.
* కృష్ణయ్య 40 ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. ఆయనను బీసీ సీఎంగా తెరమీదకు తేవటం ద్వారా రెండు ప్రాంతాల్లో లబ్ధిపొందేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని పార్టీలోని బీసీ నేతలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయటంలో అందె వేసిన చెయ్యి చంద్రబాబుదని, తమ నేతను కూడా ఆ కోవలోనే ఉపయోగించుకున్నారనే వాదన బీసీ వర్గాల నుంచి వస్తోంది.
వందసీట్ల వాగ్దానమూ డొల్లే
* ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి రాష్ట్ర వ్యాప్తగా బీసీలకు వంద సీట్లు ఇస్తానని పదేపదే చెబుతూ వచ్చిన బాబు తీరా ఎన్నికల సమయానికి అందులో సగం కూడా ఇవ్వకపోవడంతో బీసీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది.
* తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లలో బీజేపీకి 45 సీట్లు కేటాయించారు. మిగిలిన 74 సీట్లలో 18 సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించారు. బీజేపీకి కేటాయించగా మిగిలిన తొమ్మిది లోక్‌సభ సీట్లల్లో ఒక్కటి మాత్రమే బీసీకి కేటాయించారు.
* సీమాంధ్ర లో 175 అసెంబ్లీ సీట్లకు గాను బీజేపీకి 13 సీట్లు కేటాయించారు. మిగిలిన 162 సీట్లలో 40 సీట్లు చంద్రబాబు బీసీ సామాజికవర్గాలకు కేటాయించారు. టీడీపీ 21 ఎంపీ సీట్లలో పోటీచేస్తుండగా మూడు సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించారు. ఇలా బీసీలకు అతి తక్కువ సీట్లు కేటాయించటం ద్వారా తన వంద సీట్ల హామీకి బాబు తిలోదకాలిచ్చారు. కేవలం బీసీ ఓటర్లను ఆక ర్షించేందుకే వంద సీట్లు ఇస్తామని తొలి నుంచి చెప్తున్న చంద్రబాబు అభ్యర్థుల ఎంపిక సమయం నుంచే ఆ వర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు బీసీ సీఎం మంత్రం జపించారనే వాదన ఆ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.