చంద్రబాబు 'ఉప' పల్లవి!
తెలంగాణలో తాను సంధించిన బీసీ బాణం బెడిసి కొట్టడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు సీమాంధ్రలో 'ఉప' పల్లవి అందుకున్నారు. విభజన విషయంలో రెండు కళ్ల సిద్ధాంతం పాటించిన ఆయన ఇప్పుడు రెండు ఉప ముఖ్యమంత్రి పదవులంటూ కొత్త రాగం ఆలపిస్తున్నారు. తెలంగాణలో తమ పార్టీ ఎలాగు నెగ్గదని తెలిసిన నారా బాబు బీసీ బాణం సంధించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తానని ప్రకటించారు. ఈ రకంగానైనా ఓటర్లను ఆకట్టుకోవాలని చూశారు. బీసీ నేత ఆర్. కృష్ణయ్యను సీఎంగా అభ్యర్థిగా ప్రకటించినా ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఎంతో ఘనంగా ప్రకటించిన బీసీ డిక్లరేషన్కు బాబుగారు నీళ్లొదిలారు.
ఇదిలావుంచితే సీమాంధ్రలో చంద్రబాబు 'డిప్యూటీ సీఎం' పదవిని తెరపైకి తెచ్చారు. తాను అధికారంలోకి వస్తే సీమాంధ్రకు రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు ఏర్పాటు చేస్తానంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఇందులో ఒకటి బీసీలకు, మరోటి కాపులకు కట్టబెడతానని హామీయిచ్చారు. అంతేకాకుండా కాపులను బీసీల్లో చేర్చేందుకు కమిషన్ వేస్తామని చెప్పారు.
కోస్తాలో అధిక సంఖ్యలో ఉన్న కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు చంద్రబాబు ఈ వాగ్దానాలు చేశారు. 'ఫ్యాన్' ప్రభంజనాన్ని చూసి భీతిల్లుతున్న చంద్రబాబు రోజుకో హామీయిస్తున్నారు. బాబు ఊకదంపుడు వాగ్దానాలను ప్రజలు నమ్మ పరిస్థితిలో లేరు. నిన్నకాక మొన్న ఇచ్చిన బీసీ డిక్లరేషన్ వాగ్దానాన్నే చంద్రబాబు తుంగలో తుక్కారు. 9 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కాపులను పట్టించుకోలేని చంద్రబాబు ఇప్పుడు వారికి ఏదో చేసేస్తానని చెప్పడం హాస్యాస్పదం. చంద్రబాబు కల్లబొల్లి మాటలకు ఓట్లు రాలవన్నది సుస్పష్టం.