చంద్రబాబుపై తిరుగుబావుటా!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ‘గిరిజన హక్కులను కాలరాసిన నమ్మక ద్రోహి చంద్రబాబు. డబ్బే గెలిచింది. నీతే ఓడింది. డబ్బుకు టిక్కెట్ అమ్ముకున్నారు. పదేళ్ల పాటు కష్టపడిన టీడీపీ నాయకులకు అన్యాయం చేశారు..’ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయరాజ్‌కు చంద్రబాబు చేసిన అన్యాయంపై ప్లకార్డుల ద్వారా ప్రదర్శించిన గిరిజనుల ఆవేదనిది.
చచ్చిపోయిన పార్టీని బతికించాను. ఐదేళ్లుగా కష్టపడి పని చేశాను. చంద్రబాబు తప్పు చేశారు. ఊరికి సంబంధం లేని వ్యక్తికి టిక్కెట్ ఇచ్చారు. భవిష్యత్‌లో కార్యకర్తకు కష్టమొస్తే ఎవరు ఆదుకుంటారు?. చీపురుపల్లి టిక్కెట్ ఆశించి భంగపడిన కె. త్రిమూర్తుల రాజు, ఆయన అనుచరుల ఆవేదనిది. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. ఇప్పుడా పార్టీ టీసీపీ (తెలుగు కాంగ్రెస్ పార్టీ) అయిపోయింది. విధేయతగా ఉన్న మాలాంటి నాయకులు చాలా వరకు దెబ్బతిన్నాం. ఇది ముమ్మాటికీ నమ్మకద్రోహమే. చంద్రబాబు దెబ్బ కొట్టారు. కనీస మర్యాదలు పాటించలేదు. పార్టీ తెలుగు కాంగ్రెస్‌గా మారి పోయింది. కాంగ్రెస్ లక్షణాలు సంతరించుకున్నాయి. దొడ్డిదారిన వచ్చినోళ్లకి టిక్కెట్లు ఇచ్చారు. సత్తువ లేని పార్టీకి జవసత్వాలు నింపిన మావోటి వాళ్లకు మొండి చూపారు. అరకు ఎంపీ టిక్కెట్ దక్కని మాజీ డీవీజీ శంకరరావు ఆక్రోషమిది.
పార్టీలు మారిన వ్యక్తులకు ప్రాధాన్యమిచ్చారు. ఓ మహిళ ఆధారంగా రాజకీయాలు నెరుపుతున్న నేతకు పెద్ద పీట వేశారు. రెండున్నర దశాబ్ధాలుగా పార్టీకి సేవలందిన మాకు తీరని అన్యాయం చేశారు. చంద్రబాబు తీరుతో మనస్తాపానికి గురైన మాజీ మంత్రి పడాల అరుణ కన్నీటి పర్యంతమవుతూ వ్యక్తం చేసిన గోడిది.
ఇలా చెప్పుకుంటే పోతే పార్టీ అభివృద్ధికి కృషి చేసి మోసపోయిన నాయకులు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు వారంతా తీవ్ర ఆవేదన చెందు తున్నారు. పార్టీకి శాపనార్థాలు పెడుతున్నారు. కాంగ్రెస్ లక్షణాలను పుణికి పుచ్చుకుని తెలుగు కాంగ్రెస్‌గా మారిపోయిందని ఆరోపిస్తున్నారు.
డబ్బే పరమావధిగా, కార్పొరేట్ నేతలు చెప్పిందే వేదంగా, ఇచ్చుకో, పుచ్చుకో ధోరణితో పార్టీ భ్రష్టుపట్టిపోయిందని ఆవేదన చెందుతున్నారు. వీరంతా ప్రస్తుత తెలుగు కాంగ్రెస్‌పై మండి పడుతున్నారు. నమ్మక ద్రోహానికి పాల్పడిన పార్టీని ఓడించేందుకు సిద్ధమవుతున్నారు. రెబెల్‌గా సత్తా చూపాలని నిర్ణయించుకుంటున్నారు. ఆ క్రమంలోనే కురుపాంలో నిమ్మక జయరాజ్, చీపురుపల్లిలో కె.త్రిమూర్తుల రాజు, కెంబూరి రామ్మోహనరావు రెబెల్‌గా నామినేషన్ వేశారు. మిగతా అసంతృప్తి వాదులు సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చిన పార్టీ అభ్యర్థులకు షాకిచ్చే నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు. టిక్కెట్ల కేటాయింపుతో చంద్రబాబు నైజం బయటపడింది. అధినేత వ్యవహార శైలీ ఎంటో నమ్ముకున్న నేతలకు తెలిసొచ్చింది. వాడుకుని వదిలేసిన నేతగా, నమ్మిన వారికి వెన్నుపోటు పొడిచే నాయకుడిగా అర్థం చేసుకున్నారు. తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బకొట్టనున్నారు. మొత్తానికి ఇదెక్కడికి దారితీస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
నిమ్మక జయరాజ్‌కు జరిగిన అన్యాయంతో గిరిజనులంతా చంద్రబాబుపై మండి పడుతున్నారు. ఆయన తీరును ఎండగడుతూ ప్లకార్డులతో నిరసన తెలియజేస్తున్నారు. చంద్రబాబు యూజ్ అండ్ త్రో పాలసీని ప్రజల మధ్య ఎండగడుగుతున్నారు. ఎన్నికల్లో గట్టిగా బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే వైఎస్సార్ సీపీని పెద్ద ఎత్తున ఆదరిస్తున్న గిరిజనులు త్వరలో జరిగే ఎన్నికల్లో వన్‌సైడ్‌గా వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నారు. ఇప్పటికే అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. లోపాయికారీగా పిలుపునిచ్చుకుంటున్నారు. ఇక, త్రిమూర్తులరాజుకు, పడాల అరుణకు జరిగిన అన్యాయంతో వారి అనుచరులంతా ఒక నిర్ణయానికొచ్చారు. ఆ పార్టీకి గట్టిగా బుద్ది చెప్పాలని కంకణ బద్దులయ్యారు. విసృ్తత సమావేశాలు ఏర్పాటు చేసుకుని భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. మొత్తానికి జరుగుతున్న పరిణామాలు, రెబెల్ అభ్యర్థులతో ఆ పార్టీలో తిరుగుబాటు గుబులు చోటు చేసుకుంది.