బీజేపీతో పొత్తుపై టీడీపీ ముస్లిం నేతల సమావేశం
అపవిత్ర పొత్తంటూ మండిపాటు
బీజేపీకి ఓటు వేయరాదని తీర్మానం
హిందూపురం బాలకృష్ణకు ఇస్తే.. ఘనీకి
‘అనంత’ ఎంపీ సీటివ్వాలి
అనంతపురం ఎమ్మెల్యే సీటు నదీంకు ఇవ్వాలి
అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : మతతత్వ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదని తెలుగుదేశం పార్టీ ముస్లిం, మైనార్టీ నేతలు స్పష్టం చేశారు. సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ మైనార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో అనంతపురం అర్బన్ స్థానం బీజేపీకి కేటాయిస్తే ఆ స్థానంతో పాటు అనంతపురం ఎంపీ స్థానంలో కూడా ఘోరంగా ఓడిపోవాల్సి ఉంటుందని నాయకులు హెచ్చరించారు.
బీజేపీకి సహకరించేది లేదంటూ అన్ని నియోజకవర్గాల నేతలు తీర్మానించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలు.. ి2009 ఎన్నికల్లో అనంతపురం స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థికి కేవలం 800 ఓట్లు, ఉప ఎన్నికల్లో 666 ఓట్లు వచ్చాయని, అలాంటి పార్టీకి ఈ సీటును ఎలా కేటాయిస్తారని హిందూపురం ఎమ్మెల్యే అబ్దుల్ ఘని, టీడీపీ నేత నదీమ్ అహ్మద్ ప్రశ్నించారు. మతతత్వ పార్టీ అయిన బీజేపీకి ముస్లింలు ఒక్కరు కూడా ఓటు వేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. అనంతపురం పార్లమెంట్ పరిధిలోని తాడిపత్రి, పామిడి, గుత్తి, గుంతకల్లు ప్రాంతాల్లో దాదాపు 2.70 లక్షల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారని, జిల్లా కేంద్రంలో టీడీపీకి సీటు కేటాయించకపోతే ఆ ప్రభావం ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలపై పడుతుందన్నారు.
జిల్లాలో ఒక ఎంపీ స్థానాన్ని ముస్లింలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలువురు మైనార్టీ నేతలు మాట్లాడుతూ.. హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలకృష్ణ పోటీ చేయాల్సి వస్తే అబ్దుల్ ఘనికి అనంతపురం ఎంపీ స్థానాన్ని, అనంతపురం ఎమ్మెల్యే స్థానాన్ని నదీం అహ్మద్‌కు కేటాయించాలన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారధి, పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులుకు అందజేశారు. సమావేశంలో మైనార్టీ నేతలు ఉమర్‌బాషా, ఫిరోజాబేగం, మైనుద్దీన్, రవూఫ్, అల్లాబకష్, ఖాజా పాల్గొన్నారు.
ఉన్ కో ఓట్ నై దాల్తే
Published Tue, Apr 8 2014 3:11 AM | Last Updated on Fri, Jun 1 2018 8:31 PM
Advertisement
Advertisement