కరుణ స్నేహ ‘హస్తం’
చెన్నై: ఒకప్పటి తమ మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు డీఎంకే చీఫ్ కరుణానిధి మళ్లీ స్నేహ హస్తం అందించారు. ఆ పార్టీ పశ్చాత్తాపం ప్రకటిస్తే క్షమించేస్తామని, లోక్‌సభ ఎన్నికల తర్వాత మద్దతిస్తామని అన్నారు. కరుణ బుధవారమిక్కడ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి ప్రసంగించారు. కాంగ్రెస్ తమపట్ల కృతజ్ఞత చూపలేదని, అది తమిళనాడుతోపాటు దేశవ్యాప్తంగా అధోగతికి చేరిందని తొలుత నిప్పులు చెరిగి తర్వాత రాజీ మంత్రం పఠించారు.
కాంగ్రెస్ కేంద్రంలోని తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికే మొగ్గుచూపి, కృతజ్ఞత మరచిందని 2జీ కేసులో తన కుమార్తె కనిమొళి, కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా ఎదుర్కొన్న సమస్యలను ఉద్దేశించి అన్నారు. మంచిగా జీవించాలంటే కృతజ్ఞత చూపాలని, కాంగ్రెస్ తనకు ఆపన్నహస్తం అందించిందెవరో తెలుసుకోకుండా డీఎంకేను, దాని సభ్యులకు కష్టాలపాలు చేసిందని, ఇప్పుడు దానికి మూల్యం చెల్లిస్తోందని అన్నారు.