పచ్చ గుట్టు.. పబ్లిగ్గా రట్టు!
- అనకాపల్లి లాడ్జిలో ‘దేశం’ యవ్వారం
- నోట్ల పంపిణీకి ‘పెద్దల’ రహస్య వ్యూహం
- లాడ్జీలోనే ‘పచ్చచొక్కాల’ మకాం.. మంతనాలు
- ఎన్నికల అధికారులు, పోలీసుల తనిఖీలు
- అప్పటికే పలాయనం
అనకాపల్లి నుంచి ‘సాక్షి’ ప్రతినిధి : అనకాపల్లిలో తెలుగుదేశం గుట్టు లాడ్జి సాక్షిగా రచ్చకెక్కింది. పచ్చనోట్ల పంపిణీకి భారీ ఏర్పాట్లు సాగుతున్నట్టు అక్కడి వాతావరణాన్ని బట్టి స్పష్టమవుతోంది. ఎంపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్, మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాస్ సిండికేట్ తెరచాటున నడిపిన వ్యవహారం స్థానికుల అప్రమత్తత కారణంగా వెలుగు చూసింది. ప్రజాగ్రహం వెల్లువ కావడంతో పచ్చముఠా కంగుతింది.
ముందే తోక ముడిచింది. ఫిర్యాదు అందడంతో ఎన్నికల అధికారులు, పోలీసులు లాడ్జిని నిశితంగా సోదా చేయగా అనుమానాస్పద ఆధారాలు లభించినా, అసలు కథ మాత్రం అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. వారం రోజులుగా తెలుగు తమ్ముళ్లకు అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ప్రజల నుంచి చేదు అనుభవాలు ఎదురైన నేపథ్యంలో ఈ కథ చోటు చేసుకుంది.
అసలేం జరిగింది? : అనకాపల్లిలోని ఓ లాడ్జి ముందుకు గత రాత్రి ఓ వాహనం వచ్చింది. ఆ వాహనంలో వచ్చిన వ్యక్తులు అందులోంచి కొన్ని బ్యాగులు, తెలుగుదేశం పార్టీకి చెందిన కరపత్రాలు, జెండాలు దించడాన్ని స్థానికులు గమనించారు. అనుమానంతో చుట్టపక్కల వా ళ్లు నిఘా పెట్టారు. రాత్రి 12 గంటల తర్వాత ఆ లాడ్జిలోని రూములోకి కొందరు దఫదఫాలుగా రావడం, చేతి సంచులతో వెళ్ళడం స్థానికుల కళ్లబడింది. లోపల టీడీపీ నేతలున్నట్టు తేలిం ది.
చుట్టపక్కల చోటామోటా నేతలతో బేరాలు చేస్తున్నట్టు తెలియవచ్చింది. ఎవరిని ప్రశ్నించి నా సంతృప్తికరమైన సమాధానం రాలేదు. శుక్రవారం ఉదయం కూడా మరో వాహనం రావ డం, మళ్ళీ బ్యాగులు లోనికి వెళ్లడం స్థానికుల దృష్టికి వచ్చింది. సందేహించిన జనం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో అధికారు లు లాడ్జికి బయల్దేరారు. కానీ ఈ సమాచా రం ముందే లాడ్జిలో ‘ముఖ్యులకు’ చేరింది. దాంతో వారు ఆఘమేఘాల మీద లాడ్జి నుంచి పలాయనం చిత్తగించారు. టీడీపీ కరపత్రాలు, ఎన్నికల ప్రచార సామాగ్రిని మాత్రం వదిలేశారు.
గంటా, అవంతి లింక్?
లాడ్జీలో అణువణువూ శోధించిన పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. నోట్ల కట్టలపై ఉండే లేబుల్స్ ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సందేహాలు కమ్ముకుంటున్నాయి. హడావిడిలో మరచిపోయిన సెల్‌ఫోన్‌ను పోలీసులు తనిఖీ చేసినట్టు తెలిసింది. అందులోంచి గంటాకు, అవంతికి గత రెండు రోజులుగా ఎక్కువసేపు కాల్స్ వెళ్లినట్టు పోలీసు వర్గాలు గుర్తించాయి. లాడ్జిలో మకాం వేసిన ఇద్దరి కోసం పోలీసులు వెదుకులాట మొదలు పెట్టారు. ఈ లోగానే గంటా వర్గీయుల నుంచి పోలీసులపై ఒత్తిడి పెరుగుతున్నట్టు తెలుస్తోంది.
స్థానికుల ఫిర్యాదుతో తనిఖీలు
అనకాపల్లి రూరల్: పట్టణంలోని శ్రీనివాస లాడ్జిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి చెందిన వారు డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు రావడంతో ఎన్నికల అధికారులు, పోలీసులు శుక్రవారం ఆకస్మిక దాడులు చేశారు. రెండురోజులుగా లాడ్జిలో ఈ తతంగం నడుస్తున్నట్టు స్థానికుల నుంచి ఫిర్యాదు అందడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పోలీసులు లాడ్జిలో సోదాలు నిర్వహించారు.
ప్రతీ రూమ్‌లో క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించారు. ఒక రూమ్ తాళాలు లేవని లాడ్జి సిబ్బంది బుకాయించారు. అయితే తాళాలు వెంటనే తెచ్చి రూమ్‌ను తెరవకపోతే లాడ్జిని సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో వెంటనే తాళాలు తెచ్చి రూమ్‌ను తెరిచారు. రూమ్‌లో తెలుగుదేశం పార్టీ కరపత్రాలు లభించాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు లాడ్జి సిబ్బందిని ప్రశ్నించగా రామారావు అనే వ్యక్తి పేరు మీద ఒకరు రూమ్ తీసుకున్నట్టు చెప్పారు. కేసు నమోదు గురించి సీఐ చంద్రను ప్రశ్నించగా, నగదు దొరకనందున కేసు నమోదు చేయలేదని చెప్పారు. దాడుల్లో ఎన్నికల నియమావళి అమలు సిబ్బంది బి. సత్యనారాయణ, బి. వెంకటేశ్వరరావు, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ సిబ్బంది కె. రత్నాకర్, పోలీస్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.