నంద్యాల, న్యూస్‌లైన్: టీడీపీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. వాటిని సరిదిద్దుకోలేక ఆపార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. నంద్యాలలో 36వ వార్డు కీలకంగా మారింది. ఈ వార్డు జనరల్ మహిళకు కేటాయించారు. అంతేగాక మున్సిపల్ చైర్మన్ పదవి కూడా జనరల్ మహిళకు కేటాయించారు. ఈ వార్డులోనే ఎమ్మెల్యే శిల్పా 15సంవత్సరాల నుంచి తన రాజకీయ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. దీంతో ఈ వార్డు వైఎస్సార్సీపీకి, టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంగిశెట్టి సరస్వతి చైర్‌పర్సన్ అభ్యర్థిగా ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డి ప్రకటించారు. అయితే శిల్పా నిర్ణయాన్ని ఈ వార్డుకు చెందిన ప్రధాన నాయకులు వ్యతిరేకిస్తున్నారు.
ఈ వార్డు నుంచి ఎవరూ పోటీకి ముందుకు రాని సమయంలో తన బావమరిది జగదీశ్వరరెడ్డి సతీమణిని బరిలోకి దించాలని శిల్పా భావించారు. అయితే ఆమెకు ఓటు లేదని మున్సిపల్ అధికారులు పేర్కొనడంతో మరో అభ్యర్థి కోసం గాలింపును జరిపారు. వారిలో మాజీ కౌన్సిలర్ రమమహేశ్వరి, ప్రముఖ వ్యాపారి బిందెల సుదర్శనం సతీమణిని ఈ వార్డు నుంచి పోటీ చేయించడానికి శిల్పా సిద్ధమయ్యారు. వీరికి చైర్మన్ పదవికి కూడా ఆఫర్ ఇవ్వడంతో నామినేషన్ వేశారు. చివరి సమయంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్‌కుమార్ చక్రం తిప్పి తన సోదరుడికి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేసుకున్నాడని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.
గతంలో ఈ వార్డు నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి కోడలు లక్ష్మిదేవికి ఈ సారి అవకాశం కల్పించలేదు. దీంతో శిల్పాపై సంజీవరెడ్డి అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. అంతేగాక వైఎస్సార్సీపీ అభ్యర్థి అనుషాకు మద్దతును కూడా ప్రకటించారు. సరస్వతిని స్థానికేతర వార్డులకు చెందిన మహిళగా ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఇన్ని రకాలుగా 36వ వార్డులో టీడీపీ అభ్యర్థి సమస్యలను ఎదుర్కొంటున్నారు. మొత్తమ్మీద ఈ వార్డులో ఎత్తుకు పైఎత్తులు వేస్తూ విజయమే లక్ష్యయంగా భూమానాగిరెడ్డి, వైఎస్సార్సీపీ అభ్యర్థిని అనూషలు ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు.