
డైరెక్టర్ శంకర్‌కు టికెట్ ఇవ్వొద్దట..!
సామాజిక చిత్రాల దర్శకుడు, జైబోలో తెలంగాణ చిత్రం ద్వారా తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చిన డైరెక్టర్ ఎన్.శంకర్కు రిక్త'హస్తం' మిగిలింది. ఆయన పేరును మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ కూడా పరిశీలించింది. ఇందుకు రాహుల్ టీమ్ ఆయనకు ఈ విషయాన్ని తెలిపి అంగీకారం కూడా తీసుకుంది. ఇక, శంకర్ పేరును అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని అనుకుంటున్న తరుణంలో జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు మోకాలడ్డారు.
తమ మాటను కాదని శంకర్కు టికెట్ ఖరారు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో తాము సహకరించేది లేదని కొందరు నేతలు అధినాయకత్వానికి తేల్చి చెప్పారని సమాచారం. శంకర్ సొంత నియోజకవర్గం కూడా మిర్యాలగూడ కావడంతో ఆయన ఇక్కడి నుంచే బరిలోకి దిగాలని భావించారు. ముందైతే తాను ఏపార్టీలో చేరడం లేదని కూడా ప్రకటించారు.
ఒక దశలో టీఆర్‌ఎస్ సైతం అసెంబ్లీకి అంటే అసెంబ్లీకి, లోక్‌సభ సీటు కావాలంటే అదీ, ఏది కోరితే ఆ టికెట్‌ను శంకర్‌కు ఇచ్చేందుకు సిద్ధపడింది. ఇదే సమయంలో కాంగ్రెస్ సైతం ముందుకొచ్చింది. ఈలోగా టీఆర్‌ఎస్ తన అభ్యర్థుల ప్రకటన లాంఛనాన్ని పూర్తిచేయడంతో కాంగ్రెస్ నుంచి శంకర్‌కు టికెట్ దక్కుతుందని ఆయన సన్నిహితులంతా భావించారు.
ఈలోగా నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి దిగ్విజయంగా అడ్డుకుని శంకర్ పేరును పెండింగులో పెట్టించినట్లు తెలుస్తోంది. శంకర్‌కు టికెట్ ఇవ్వొద్దు, జానారెడ్డి ఎవరి పేరు చెబితే వారికిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని ఏకంగా ఏఐసీసీ నాయకత్వానికి లేఖ రాశారని సమాచారం. వాస్తవానికి జానారెడ్డి తన తనయుడు రఘువీర్‌రెడ్డి రాజకీయ అరంగేట్రం కోసం మిర్యాలగూడ స్థానాన్ని అనువైనదిగా భావించారు.
తీరా జిల్లా నేతలు అడ్డుతగలడంతో అదే రాహుల్ టీమ్ బాధ్యులు తిరిగి శంకర్‌కు విషయం చేరవేసి, ఏం చేద్దామంటూ కొత్త ప్రశ్నలు ముందు పెట్టినట్లు తెలుస్తోంది. దాంతో ఆయన తాను ఏపార్టీలో చేరటం లేదని వెల్లడించారు. ఇక జిల్లా కాంగ్రెస్ నేతల తీరు గురించి తెలుసుకున్న తెలంగాణవాదులు, శంకర్ సన్నిహుతులు కాంగ్రెస్ నేతల తీరుపై మండిపడుతున్నారు.