Miryalaguda ticket
-
'ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యా'
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. సామాజిక చిత్రాల దర్శకుడు ఎన్.శంకర్‌కు కాంగ్రెస్ మొండిచేయి చూపడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడానికి నిర్ణయించుకున్నారు. రాహుల్ టీమ్ సర్వేల మేరకు ఈ ప్రాంత ప్రజల్లో ఆదరణ ఉన్న శంకర్‌కు టికెటిస్తే, తమకు లాభిస్తుందని భావించిన కాంగ్రెస్ హైకమాండ్ ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. మిర్యాలగూడ నుంచి బరిలోకి దింపాలని భావించింది. అయితే జిల్లా కాంగ్రెస్ నేతలు దీనికి అంగీకరించక పోవడంతో ఆయన అభ్యర్థిత్వం ఖరారు కాలేదు. దీంతో ఆయా బీసీ సంఘాలు, తెలంగాణ ఉద్యమ సంఘాలు, జేఏసీల ఒత్తిడి మేరకు ఇండిపెండెంట్‌గానైనా బరిలోకి దిగాల్సిందేనని శంకర్ నిర్ణయం తీసుకునారు. మిర్యాలగూడ నుంచి సీపీఎం నుంచి జూలకంటి రంగారెడ్డి, టీఆర్ఎస్ నుంచి అమరేందర్‌రెడ్డి అభ్యర్థులుగా ఉన్నారు. సోమవారం కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్.భాస్కర్‌రావు, టీడీపీనుంచి బంటు వెంకటేశ్వర్లు పేర్లు ప్రకటించారు. వీరికి తోడు, శంకర్ పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో హాట్ సీట్లలో ఒకటిగా మిర్యాలగూడ నిలవనుంది. ఆయన తరఫున ప్రచారానికి కొన్నిజేఏసీలు సిద్ధమయ్యాయని చెబుతున్నారు. ‘తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసింది కుటుంబ వారసత్వ రాజకీయాలు కొనసాగడానికి కాదు. కొందరు నాయకులు కుల దురహంకారంతో బీసీలకు టికెట్లు ఇవ్వడానికి సుముఖంగా లేరు. తమ కుటుంబ సభ్యులు, లేదంటే వారి తొత్తులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. నాణ్యమైన రాజకీయం అంటే ఎలా ఉంటుందో చూపించేందుకు, తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల జెండాను ఎత్తి పట్టేందుకు మిర్యాలగూడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యా..’ అని డైరెక్ట్ర్ తెలిపారు. -
డైరెక్టర్ శంకర్‌కు టికెట్ ఇవ్వొద్దట..!
సామాజిక చిత్రాల దర్శకుడు, జైబోలో తెలంగాణ చిత్రం ద్వారా తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చిన డైరెక్టర్ ఎన్.శంకర్‌కు రిక్త'హస్తం' మిగిలింది. ఆయన పేరును మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ కూడా పరిశీలించింది. ఇందుకు రాహుల్ టీమ్ ఆయనకు ఈ విషయాన్ని తెలిపి అంగీకారం కూడా తీసుకుంది. ఇక, శంకర్ పేరును అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని అనుకుంటున్న తరుణంలో జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు మోకాలడ్డారు. తమ మాటను కాదని శంకర్‌కు టికెట్ ఖరారు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో తాము సహకరించేది లేదని కొందరు నేతలు అధినాయకత్వానికి తేల్చి చెప్పారని సమాచారం. శంకర్ సొంత నియోజకవర్గం కూడా మిర్యాలగూడ కావడంతో ఆయన ఇక్కడి నుంచే బరిలోకి దిగాలని భావించారు. ముందైతే తాను ఏపార్టీలో చేరడం లేదని కూడా ప్రకటించారు. ఒక దశలో టీఆర్ఎస్ సైతం అసెంబ్లీకి అంటే అసెంబ్లీకి, లోక్‌సభ సీటు కావాలంటే అదీ, ఏది కోరితే ఆ టికెట్‌ను శంకర్‌కు ఇచ్చేందుకు సిద్ధపడింది. ఇదే సమయంలో కాంగ్రెస్ సైతం ముందుకొచ్చింది. ఈలోగా టీఆర్ఎస్ తన అభ్యర్థుల ప్రకటన లాంఛనాన్ని పూర్తిచేయడంతో కాంగ్రెస్ నుంచి శంకర్‌కు టికెట్ దక్కుతుందని ఆయన సన్నిహితులంతా భావించారు. ఈలోగా నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి దిగ్విజయంగా అడ్డుకుని శంకర్ పేరును పెండింగులో పెట్టించినట్లు తెలుస్తోంది. శంకర్‌కు టికెట్ ఇవ్వొద్దు, జానారెడ్డి ఎవరి పేరు చెబితే వారికిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని ఏకంగా ఏఐసీసీ నాయకత్వానికి లేఖ రాశారని సమాచారం. వాస్తవానికి జానారెడ్డి తన తనయుడు రఘువీర్‌రెడ్డి రాజకీయ అరంగేట్రం కోసం మిర్యాలగూడ స్థానాన్ని అనువైనదిగా భావించారు. తీరా జిల్లా నేతలు అడ్డుతగలడంతో అదే రాహుల్ టీమ్ బాధ్యులు తిరిగి శంకర్‌కు విషయం చేరవేసి, ఏం చేద్దామంటూ కొత్త ప్రశ్నలు ముందు పెట్టినట్లు తెలుస్తోంది. దాంతో ఆయన తాను ఏపార్టీలో చేరటం లేదని వెల్లడించారు. ఇక జిల్లా కాంగ్రెస్ నేతల తీరు గురించి తెలుసుకున్న తెలంగాణవాదులు, శంకర్ సన్నిహుతులు కాంగ్రెస్ నేతల తీరుపై మండిపడుతున్నారు.