ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కని దుస్థితి నెలకొంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా బలహీనపడింది. ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీకి నిలబడే అభ్యర్థులు కూడా కరువయ్యారు. పార్టీలో ఉన్నారో లేదో కూడా తెలియనివారిని అధిష్టానం పోటీకి నిలబెట్టింది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను చవిచూసిన ప్రజలు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటెయ్యకుండా మొఖం చాటేశారు. దీంతో ఎక్కడా కూడా ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్ దక్కే పరిస్థితి లేదు. సగటున ఏ ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్‌లోనూ పట్టుమని మూడు వేల ఓట్లు కూడా పడలేదు. ఏలూరులో ఆ పారీ అభ్యర్థి పద్మరాజుకు 1,452 ఓట్లు, దెందులూరులో కాంగ్రెస్ అభ్యర్థి మాగంటి బబ్బుకు 2,515, చింతలపూడిలో యడ్లపల్లి రాజారావుకు 1,646 ఓట్లు పడ్డాయి. చాలా చోట్ల ఇదే స్థాయిలో ఓట్లు వచ్చాయి. ఎంపీ అభ్యర్థులకు సైతం చెప్పుకోదగ్గ రీతిలో ఓట్లు రాలేదు. దీంతో రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్‌పై తీవ్ర ప్రభావం చూపిందనే చెప్పాలి.