మోర్తాడ్, న్యూస్‌లైన్: స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైన గెలవాలన్న తపనతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన సంస్థలను సైతం తమ స్వార్థం కోసం వినియోగించుకుంటోంది. స్థానిక సంస్థల, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ శాతం పెరిగేలా సహకార సంఘాల చైర్మన్లు కృషి చేయాలని సహకార బ్యాంకు పాలకవర్గం ఆదేశించినట్లు తెలిసింది. జిల్లాలో ఎక్కువ మంది సహకార సంఘాల చైర్మన్లు కాంగ్రెస్‌కు చెందినవారు ఉన్నారు. సహకార బ్యాంకు పాలకవర్గ సభ్యులలో కూడా ఎక్కువ మంది పార్టీ మద్దతుదారులే. సహకార సంఘాలలో సభ్యులుగా ఉన్నవారికి ఎన్నికల తర్వాత కొత్త రుణాలు ఇస్తామని, రుణ పరిమితిని పెంచుతామని హామీలు ఇచ్చి పార్టీకి ఓట్లు వేయించాలని సహకార బ్యాంకు పాలక వర్గం అనధికారికంగా తీర్మానించి సంఘాల చైర్మన్‌లకు అందించింది.
గెలిపించే బాధ్యత
జిల్లాలో 142 సహకార సంఘాలు ఉండగా ఇందు లో దాదాపు 90 మంది సహకార సంఘాల చైర్మ న్లు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఉన్నారు. ఎన్నిక ల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యతలను సహకార సంఘాల చైర్మ న్లు తీసుకోవాలని పాలకవర్గం సూచించింది. తమ పార్టీకి చెందిన చైర్మన్లు ఉన్న సహకార సంఘాల తో కాంగ్రెస్ ఓటు బ్యాంకును పెంచేందుకు వినియోగించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఇందులో భాగంగానే బ్యాంకు పాలకవర్గం సభ్యులతో సంఘాల చైర్మన్‌లకు మౌఖిక ఆదేశాలిప్పించారు. రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు అయిన సహకార సంఘాలు చివరకు రాజకీయ కార్యక్రమాలకు వేదికగా మారాయని పలువురు విమర్శిస్తున్నారు.
కాంగ్రెస్‌కు ‘సహకారం’ అందించండి
Published Thu, Mar 27 2014 3:07 AM | Last Updated on Sat, Sep 2 2017 5:12 AM
Advertisement
Advertisement