కోట్లకు ఓట్లొచ్చేనా..! | election spending of this time is Rs 200 crore | Sakshi
Sakshi News home page

కోట్లకు ఓట్లొచ్చేనా..!

Published Sun, May 11 2014 1:40 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

election spending of this time is Rs 200 crore

సాక్షి, ఒంగోలు: ఈసారి జరిగిన ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా రికార్డులకెక్కాయి. జిల్లాలో సుమారు రూ.200 కోట్లకు పైగానే ఖర్చయినట్లు రాజకీయ పరిశీలకులు లెక్కలేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి రూ.28 లక్షలు, ఎంపీ అభ్యర్థి రూ.70 లక్షలకు మించి ఖర్చు చేయరాదు. కానీ ప్రధాన పార్టీలకు చెందిన ఒక్కో అభ్యర్థి రూ.10 కోట్ల వరకు వెదజల్లారు. ఇక, ఆయా పార్టీల ప్రధాన నాయకులు పోటీపడిన నియోజకవర్గాల్లో ప్రలోభాల పర్వం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగింది. ధన, మద్య ప్రవాహం ఏరులై పారింది. జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 187 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.

మూడు లోక్‌సభ స్థానాలకూ మొత్తం 29 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరందరూ ఎన్నికల ఖర్చుకు ఏమాత్రం వెనుకాడలేదు. పదిమంది సభ్యులున్న సంఘానికి ఒక అభ్యర్థి రూ.5 వేలిస్తే.. మరో అభ్యర్థి ఏకంగా రూ.పదివేలు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇలా ఒకరికంటే మరొకరు రెండింతలు చొప్పున డబ్బు వారి చేతిలో పెట్టారు. జిల్లాలోని 50 వేలకు పైగానే ఉన్న మహిళా సంఘాలు, 12 వేల యువజన సంఘాలు, గ్రామగ్రామాన ఉన్న కులసంఘాలు, వాడవాడలా ఉన్న కాలనీ అభివృద్ధి కమిటీలకు ఈసారి అన్ని పార్టీల నుంచి ప్రలోభాలు దక్కాయి. సంఘాల వారీగానే కాకుండా ప్రత్యక్షంగానూ ఇంటింటికీ లబ్ధి చేకూరింది.

ఈవిధంగా కాగితాల్లోకి చేరని ఖర్చు రూ.కోట్లకు మించిపోయిందనేది బహిరంగ రహస్యమే.. నిన్నటిదాకా ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లకు డబ్బులు పంచిన పార్టీల నేతలు... ప్రస్తుతం జిల్లా కేంద్రంలో గెస్ట్‌హౌస్‌లు, లాడ్జీల్లో సేదదీరుతూ ఎక్కడెక్కడ ఓటుబ్యాంకు తమపార్టీ తరఫున డిపాజిట్ అయిందనే లెక్కల్లో మునిగారు. ఏ ప్రాంతంలో ఎంతెంత పంపిణీ చేశాం.. నోట్లకు ఏమేరకు ఓట్లు రాలాయనే అంచనాలను పార్టీ అభ్యర్థుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఒక్కో అసెంబ్లీ అభ్యర్థి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు... ఎంపీ అభ్యర్థి రూ.60 లక్షల వరకు ఖర్చుచేసినట్లు అధికారికంగా కాగితాల్లో లెక్కలేసి ఎన్నికల కమిషన్‌కు ఇప్పటికే సమర్పిస్తున్నారు. అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చుపెట్టినా ...అధికారుల నిఘా కళ్లకు ఏమాత్రం పట్టుబడకుండా జాగ్రత్తపడ్డారు.

 ఓట్ల కొనుగోలుకు తెగ బడ్డ టీడీపీ..
 ఈసారి అధికారం తెచ్చుకోకపోతే, రాజకీయంగా కొన్ని దశాబ్దాలపాటు వెనకబడి పోతామనే అధినేత చంద్రబాబు మాటలతో.. జిల్లాలో ఆపార్టీ అభ్యర్థులు ఓట్ల కొనుగోలుకు తెగబడ్డారు. సీట్ల కేటాయింపులోనే పారిశ్రామికవేత్తలు, కోటీశ్వరులను ఎంపిక చేసుకుని మరీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆమేరకు అభ్యర్థులు తాము పోటీచేసిన నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా ఖర్చుచేశారు. దర్శి, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థులు ఓటుకు రూ.2 వేలు చొప్పున పంపిణీ చేసినట్లు వెలుగు చూస్తుండగా.. చీరాల, కనిగిరిలోనూ ఆపార్టీ అభ్యర్థులు రూ.1500కు తగ్గకుండా అందజేసినట్లు ఓటర్లు చెబుతున్నారు.

ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్‌నకు రెండ్రోజుల ముందుగానే ఇంటింటికీ పంపిణీ చేసిన అభ్యర్థులు.. ఓటింగ్‌నకు బయల్దేరే సమయంలోనూ పోలింగ్‌బూత్‌ల వద్దనే ఓటుస్లిప్పు ప్రకారం డబ్బు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు జిల్లావ్యాప్తంగా మొత్తం రూ.7 కోట్ల 28 లక్షల 29 వేల 650 సీజ్ చేయగా, అందులో లెక్కలు చూపని రూ.3 ఓట్ల 41 లక్షల 23 వేల 220లను ఆదాయపన్ను శాఖకు అప్పగించారు. ఇంకా రూ.28 లక్షల 31 వేల 780పై విచారణ కొనసాగుతోంది. నగదు తరలిస్తూ పట్టుబడిన వారిపై 49 కేసులు నమోదు కాగా, వీరిలో అధికంగా టీడీపీకి చెందిన నేతలే ఉండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement