
జగన్ కోసం.. జన ప్రభంజనం
నల్లగొండ/ఖమ్మం: జననేత జగన్‌మోహన్‌రెడ్డి కోసం జనం ప్రభంజనంలా కదిలొచ్చారు. జననేతను చూడ్డానికి, వీలైతే మాట్లాడ్డానికి, అవకాశం దొరికితే కరచాలనం చేయడానికి యువకులు, యువతులు, మహిళలు పోటెత్తారు. మహానేత తనయుడిని కళ్లారా చూడాలని వృద్ధులు సైతం ముందుకొచ్చారు. దీంతో రోడ్లన్నీ జనగోదారులయ్యాయి. సభలన్నీ జనసంద్రాలయ్యాయి. శనివారం నిర్ణీత సమయం కన్నా ఒక గంట ఆలస్యంగా నల్లగొండ జిల్లా కోదాడకు చేరుకున్న వైఎస్ జగన్‌కు ఇక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీంతో హెలిప్యాడ్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని సభాస్థలికి చేరుకోవడానికి గంటకు పైగా పట్టింది. రోడ్ షోకు అనుమతి లేదని, వాహనంలో కూర్చునే వెళ్లాలని పోలీసులు అభ్యంతరం చెప్పారు. అయితే, వేలాదిగా ఎదురేగి వస్తున్న ప్రజలను కలవకుండా, మాట్లాడకుండా వాహనంలో ఎలా వెళ్లిపోతానని పోలీసులతో జగన్ వాగ్వాదానికి దిగారు. కావాలంటే అరెస్టు చేసుకోండని సీఐ మొగిలయ్యతో అన్నారు. జన హోరు చూసి వారు వెనక్కి తగ్గారు. ఇక, జగన్ దారిపొడవునా ఎదురొచ్చే మహిళలు, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ సభాస్థలికి చేరుకున్నారు. కోదాడ సభ తర్వాత 20 కిలోమీటర్ల దూరంలోని హుజూర్‌నగర్‌కు చేరుకోవడానికి జగన్‌కు రెండున్నర గంటల సమయం పట్టింది. బాలాజీనగర్, చిలుకూరుల్లోనూ కొద్ది సేపు ఆగారు. హుజూర్‌నగర్ శివారులో మిల్లులో పనిచేసే కార్మికులతో మాట్లాడారు.
కిక్కిరిసిన మధిర, కొత్తగూడెం..
హుజూర్‌నగర్ సభ అనంతరం హెలికాప్టర్‌లో ఖమ్మం జిల్లా మధిరకు వెళ్లిన జగన్‌కు.. అక్కడి ప్రజలు నీరాజనం పలికారు. మధిర సభకు ఎంత మంది జనం హాజరయ్యారో.. వారిలో సగం మంది మధిరలో హెలిప్యాడ్ దగ్గర జగన్‌కు ఎదురేగి స్వాగతం పలికారు. మధిర సభలో జగన్ మాట్లాడిన ప్రతి మాటకూ అద్భుతమైన జనస్పందన. ఇక్కడ సభ అనంతరం జగన్ కొత్తగూడెం వెళ్లే దారిలో పెద్ద ఎత్తున ప్రజలు ఎదురేగి హారతులు పట్టారు. కొత్తగూడెం సభకు వేలాది మంది హాజరై అభిమానం చాటుకున్నారు. మీలో ఫ్యాన్ గుర్తు తెలిసిన వాళ్లు చేతుల్లేపండి.. అని జగన్ అన్నప్పుడూ సభలోని అందరూ చేతులు పెకైత్తి.. జై జగన్ అంటూ నినదించారు. ఇక్కడ సభ అనంతరం జగన్ సత్తుపల్లి మండలం గంగారంలో బస చేశారు.