
కోడ్ ఉల్లంఘన కేసులో ముఖేష్‌గౌడ్ అరెస్ట్
హైదరాబాద్ : ఎన్నికల నామినేషన్ సందర్భంగా కోడ్ ఉల్లంఘించిన మాజీమంత్రి ముఖేష్ గౌడ్ ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. అతని సహ కార్పోరేటర్ శంకర్ యాదవ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఆయనపై గురువారం కేసు నమోదు అయ్యింది. అనుమతి లేకుండా ముఖేష్ గౌడ్ బైక్ ర్యాలీ నిర్వహించారని కేసు నమోదు చేసిన పోలీసులు ఎట్టికేలకు అరెస్టు చేశారు. గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన ముఖేష్ గౌడ్ భారీ ర్యాలీగా వెళ్లారు. దీనికి రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకోకపోవడంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా విడిచిపెట్టేది లేదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినా నేతలు వాటిని పెడచెవిన పెట్టడంతో తిప్పలు తప్పడం లేదు.
ఇంతకుముందు మార్చి 30వ తేదీన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గుంటూరు జిల్లా మాచర్లలోని 29వ వార్డు పోలింగ్ స్టేషన్లోకి వెళ్లి గందరగోళం సృష్టించిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి కి బెయిల్ రద్దయింది. పోలింగ్ సిబ్బందితో పాటు ఇతర పార్టీలకు చెందిన ఏజెంట్లపై కూడా తీవ్ర ఆగ్రహం చేసి అక్కడ ఉన్న ఈవీఎంలను చెల్లాచెదురు చేయడంతో అతనిపై ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి పిన్నెల్లి బెయిల్ ను గురజాల కోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే.