నేటి నుంచి జిల్లాలో షర్మిల పర్యటన
21 నుంచి 25 వరకు రోడ్‌షో
పట్టణాల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ వెల్లడి
సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల శుక్రవారం నుంచి జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఐదు రోజులపాటు జరగనున్న ఈ ప్రచార కార్యక్రమం వినుకొండ నుంచి ప్రారంభిస్తారు. జిల్లాలో గత ఏడాది ఫిబ్రవరి 22 నుంచి 33 రోజులపాటు షర్మిల పాదయాత్ర చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ అధిష్టానంపై ఆమె చేసిన విమర్శలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. పాదయాత్రలో భాగంగా పేద, బల హీనవర్గాల ప్రజల బాధలకు కొన్ని చోట్ల వెంటనే స్పందించి సహాయం అందించే ఏర్పాట్లు చేశారు.
కొన్ని గ్రామాల్లో సామాజిక సమస్యలు పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు. అప్పులు తీర్చలేక కిడ్నీలు అమ్ముకున్న పేదవారిని పరామర్శించారు. ఆర్థిక వెసులుబాటు లేక చదవు మధ్యలో నిలిపివేసిన కొందరు విద్యార్థులు మళ్లీ కళాశాలలు, పాఠశాలలకు వెళ్లే విధంగా చూశారు.
పాదయాత్రలో వృద్ధులు, మహిళలపై ఆమె చూపిన ఆదరణ, ఆప్యాయతలను జిల్లా ప్రజలు ఇంకా మననం చేసుకుంటూనే ఉన్నారు. పాదయాత్ర తరువాత గత ఏడాది ఆగస్టు 11 వ తేదీన గుంటూరులో విజయమ్మ చేపట్టిన దీక్షకు మద్దతుగా షర్మిల హాజరయ్యారు. మారిన రాజకీయ పరిణామక్రమంలో విపక్షాల కుట్రలను ప్రజలకు వివరించేందుకు జిల్లాలో గత ఏడాది సెప్టెంబరు 11న బస్‌యాత్రను నిర్వహించారు.
పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ...
ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈ నెల 6,7 తేదీల్లో ‘వైఎస్సార్ జనభేరి’ పేరిట కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. పదిహేను రోజుల అనంతరం జగన్ సోదరి షర్మిల ఎన్నికల ప్రచారానికి వస్తుండటంతో కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది.
వినుకొండ నుంచి ప్రారంభం..
చిలకలూరిపేట: ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 21వ తేదీ నుంచి 25 వరకు జిల్లాలోని మున్సిపల్ పట్టణాల్లో పర్యటించనున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ వెల్లడించారు.
గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షర్మిల పర్యటన వివరాలను ఆయన ప్రకటించారు. 21న వినుకొండ 22న చిలకలూరిపేట, 23న బాపట్ల, పొన్నూరు, రేపల్లె, 24న తెనాలి, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, 25న మంగళగిరి, తాడేపల్లిలలో షర్మిల పర్యటిస్తారని మర్రి రాజశేఖర్ వివరించారు.ఈ క్రమంలో పలు చోట్ల రోడ్‌షోలు జరుగుతాయన్నారు.
టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలతో ప్రజలు సతమతం...
నాలుగేళ్లుగా మున్సిపాలిటీల్లో అభివృద్ధి కుంటుపడిందని, అధికారులలో జవాబుదారీతనం లోపించి చిన్నసమస్యలు సైతం పరిష్కారానికి నోచకోక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మర్రి రాజశేఖర్ తెలిపారు.
టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలతో, సమస్యలు పరిష్కారానికి నోచుకోక సతమతమౌవుతున్న ప్రజలు వైఎస్సార్ సీపీకి మద్దతు పలుకుతున్నారని చెప్పారు. వరుస ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. షర్మిల పర్యటనలో పార్టీలోని అన్ని విభా గాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
సమావేశంలో చిలకలూరిపేట పట్టణ కన్వీనర్ ఏవీఎం సుభానీ, మండల కన్వీనర్ చాపలమడుగు గోవర్ధన్, యడ్లపాడు మండల కన్వీనర్ చల్లా యజ్ఞేశ్వరరెడ్డి పాల్గొన్నారు.