
కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టిన గజరాజు
ఆయన ముద్దుపెట్టుకుంటే ముచ్చట పడాలే తప్ప మూతి కొరక కూడదు.
ఎన్నికల వేళ ఎవరికీ కోపం రాకుండా చూసుకోవడం పార్టీలకు ముఖ్యం. అందునా యూపీ లాంటి రాష్ట్రంలో, కాంగ్రెస్ లాంటి పార్టీకి ఛోటా నేతతోనైనా జాగ్రత్తగా ఉండాల్సిందే. అవసరమైతే వారి తప్పుల్ని చూసీ చూడనట్టు ఊరుకోవాల్సిందే.
ఇందుకు నేత గా మారిన నటి నగ్మాను ముద్దాడిన గజరాజ్ సింగ్ నిలువెత్తు సాక్షి. సదరు గజరాజ్ సింగ్ నగ్మాలు పొదివి పట్టుకుని ముద్దాడిన దృశ్యాలు ప్రపంచమంతటా ప్రసారమయ్యాయి. పాపం నగ్మాకి పట్టలేని కోపం వచ్చింది. అయితే ఇన్నాళ్లయినా గజరాజ్ సింగ్ పై చిన్న పాటి చర్య తీసుకునేందుకు కూడా కాంగ్రెస్ సాహసించడం లేదు. ఎందుకంటే నగ్మాపోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఉన్న ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయనే. అందుకే ఆయన్ని ముట్టుకునే సాహసం పార్టీ చేయడం లేదు. ఆయన ముద్దుపెట్టుకుంటే ముచ్చట పడాలే తప్ప మూతి కొరక కూడదు. కనీసం మూతి విరుపు కూడా చేయకూడదు.
ఎమ్మెల్యే గారి వ్యవహారాన్ని ప్రమోద్ కాత్యాన్ అనే మరో నాయకుడు గట్టిగా విమర్శించాడు. పార్టీ గజరాజ్ సింగ్ ను వదిలేసి కాత్యాన్ ను పార్టీ నుంచి బహిష్కరించింది. అవును మరి... అరిటాకు ముల్లుపై పడినా, ముల్లు అరిటాకుపై పడినా నష్టం అరిటాకుకే మరి.