
గాంధీల మూకు‘మ్మోడి’ నిప్పులు
మోడీ మతతత్వవాది అని సోనియా, రాహుల్, ప్రియాంక మండిపాటు
కన్యాకుమారి/కిషన్‌గంజ్/రాయ్‌బరేలీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకా గాంధీలు మూకుమ్మడిగా విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆయన అధికారాలన్నీ తనొక్కడికే దక్కాలని కోరుకుంటున్నారని నిప్పులు చెరిగారు. మోడీ, బీజేపీలది పూర్తిగా మతతత్వ వాదమని, దేశానికది ప్రమాదకరమని, ప్రజలు ఆయన దురాశను తిరస్కరించాలని బుధవారం వేర్వేరు చోట్ల జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో పిలుపునిచ్చారు.
దేశాన్ని స్వర్గం చేస్తారట: సోనియా
ఒక వ్యక్తి దేశమంతా తిరుగుతూ తానొక్కణ్నే భారత్‌ను స్వర్గంలా మారుస్తానంటున్నారని సోనియా.. మోడీ పేరు ప్రస్తావించకుండా విమర్శించారు. మతోన్మాదం, అధికారం, ధనం కలగలసిన ప్రమాదకర భావజాలానికి ఆయన ప్రతినిధి అని, దాన్ని ప్రజలు తిరస్కరించాలని తమిళనాడులోని కన్యాకుమారిలో జరిగిన సభలో పిలుపునిచ్చారు. మోడీ, బీజేపీలతో దేశ మతసామరస్యం ప్రమాదంలో పడిందని, దేశాన్ని మతప్రాతిపదికన చీల్చడమే వారి లక్ష్యమని అన్నారు. దేశం కోసం, లౌకికత్వం కోసం ఇందిర, రాజీవ్‌లు తమ జీవితాలను త్యాగం చేశారని, వారి త్యాగాలు వృథా కాకూడదన్నారు.
ప్రజలను పిచ్చివాళ్లను చేయొద్దు: రాహుల్
మోడీ ఇప్పటికైనా దేశ ప్రజలను పిచ్చివాళ్లను చేయ డం మానుకోవాలని రాహుల్ అన్నారు. ‘గుజరాత్ అభివృద్ధి ఘనత తనదేనని ఆయన అంటున్నారు. ఇప్పుడు మొత్తం దేశం గురించీ అదే అంటారు’ అని బీహార్‌లోని కిషన్‌గంజ్ సభలో ఎద్దేవా చేశారు. మోడీ అభివృద్ధి నమూనా టాటా, అంబానీల్లాంటి వారికి లబ్ధి చేకూర్చడానికే పనికొస్తుందన్నారు.
ఇది ఐక్యతా: ప్రియాంక
కొంతమంది అధికారమంతా కొద్దిమంది చేతుల్లోనే ఉండాలనుకుంటున్నారని ప్రియాంక.. మోడీ పేరు ప్రస్తావించకుండా విమర్శించారు. ‘అలాంటివారు ‘నా మాట వినండి. అన్ని నిర్ణయాలూ నేనే తీసుకుంటా. నేను సర్వశక్తి సంపన్నుడిని. దీన్ని చూసి మీరు ఓటేయాలి’ అంటార’ని దుయ్యబట్టారు. రాయ్‌బరేలీలో తన తల్లికి మద్దతుగా నిర్వహించిన సభల్లో ఆమె మాట్లాడారు.
ఈ ఎన్నికలు రెండు విరుద్ధ సిద్ధాంతాల మధ్య జరుగుతున్నాయని, దేశంలో ఐక్యత పెంపొందాలో, మతతత్వం చెలరేగాలో, అధికారం అందరి చేతుల్లో ఉండాలో, ఒక్కరి చేతుల్లో ఉండాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. కాగా, ప్రియాంక విమర్శలపై బీజేపీ ప్రతినిధి సుధాంశు త్రివేది స్పందించారు. కాంగ్రెస్ లోపాలు బయటపడ్డంతో ఆ పార్టీ బుర్ర చెడిపోయిందన్నారు. మోడీ ప్రచారానికి రూ.5 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని, అందులో అత్యధికం నల్లధనమేనని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆరోపించారు.