
గంటా వారి రియాల్టీ షో ఫ్లాప్
- ఓటర్లకు తాయిలాలు..
- అయినా దక్కని మద్దతు
తగరపువలస,న్యూస్‌లైన్: భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థ్ధి గంటా శ్రీనివాసరావు స్థానిక నేతలు, ఓటర్లతో మైండ్‌గేమ్ ఆడుతున్నారు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్న ట్టు ప్రచారం చేయిం చడంలో సిద్ధహస్తుడైన ఆయన నిజస్వరూపం ఎన్నికల తేదీ సమీపించడంతో కొంచెం కొంచెంగా బయటపడుతోంది. నామినేషన్ వేసినరోజే వంద ద్విచక్రవాహనాలు, పదుల సంఖ్యలో ఇన్నోవాలు కార్యకర్తల కోసం కొనుగోలు చేసినట్టు ప్రచారం చేసుకున్నారు.
దీంతో తెలుగుతమ్ముళ్లు వీటిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఎక్కడా ఇలాంటి వాహనా లు కనిపించకపోయేసరికి వారంతా నిరాశచెందుతున్నారు. ఇప్పుడు మండలస్థాయి నాయకులను కాదని కిందస్థాయి నాయకులకు రోజుకు రూ.10వేలు చొప్పున అందించడంతో పాటు మహిళా కార్యకర్తలను నియమించి పంచాయితీకి రూ.5లక్షలు ఇవ్వనున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు.గత బుధవారం తగరపువలస కూడలిలో వైఎస్సార్‌సీపీ నిర్వహించిన భారీ ర్యాలీని చూసి గంటా తోకముడివాల్సి వచ్చింది.
ర్యాలీకి ఎదురుగా వస్తున్న వాహనంలో ఉన్న గంటా వైఎస్సార్‌సీపీకి ఉన్న ఆదరణ చూసి విస్తుపోయారని టీడీపీ నాయకులే అంటున్నారు. ఇటీవల సొంత ఖర్చులతో గంటా శ్రీనివాస్ సర్వే చేయించుకోగా భీమిలిలో వైఎస్సార్‌సీపీకి కనీసం ఇరవై వేల మెజార్టీ ఖాయమని తేలిందని, ఆ క్షణం నుంచీ ఆయన మరింత కంగారు పడుతున్నారని కార్యకర్తలే చెవులు కొరుక్కుంటున్నారు. తనకు రావని తెలిసిన ఓటర్లను కూడా మాటలతో ప్రలోభాలకు గురిచేస్తున్నారు.
మతతత్వ పార్టీ అయిన బీజేపీతో టీడీపీ దోస్తీని మైనారిటీలు అసహ్యించుకుంటుంటే శుక్రవారం ఆయన పాస్టర్లను మభ్యపెట్టి సమావేశం నిర్వహించారు. భీమిలిలో తనకో ఓటు,ఎంపీగా బీజేపీకి ఓటు వేయాలని కోరడంతో పాస్లర్టు గంటాను అక్కడే కడిగిపారేసినట్లు తెలిసింది. క్రిస్టియన్లకు అండగా ఉంటామని గంటా చెప్పినా నమ్మకపోవడంతో ఈ షో ఫ్లాప్ అయినట్టు కార్యకర్తలే చెబుతున్నారు. మొదట్నుంచీ క్రైస్తవులు, ముస్లింలు వైఎస్‌ఆర్ వెంటే ఉన్నారన్న విషయాన్ని గంటా గుర్తించకపోవడం ఘోరమని కార్యకర్తలే చెబుతున్నారు.
భీమిలి పట్టణంలో హిందువులతో పాటు క్రిస్టియన్లకు ప్రత్యేకంగా శ్మశానవాటికలు ఉన్నాయని, నియోజకవర్గంలో మిగతాచోట కూడా దీని కోసం స్థలం కేటాయించాలని గతంలో గంటా వద్దకు స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ద్వారా వచ్చినా స్పందించలేదని వారంతా నిలదీసినట్టు తెలిసింది. దీంతో మతం పేరిట ఓట్లు కొల్లగొట్టాలనుకున్న ఆయన పన్నాగం పారలేదని కార్యకర్తలే చెబుతున్నారు.
క్రిస్టియన్లు వైఎస్సార్‌సీపీకి ఆప్తులు..
ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా క్రిస్టియన్లు,ముస్లింలు వైఎస్సార్‌సీపీకు మద్దతు తెలుపుతారు. ఇటీవల ప్రచారంలో ఈ విషయం తెలియడంతో టీడీపీ దొడ్డిదారి ఎంచుకుంది. అయినా గంటా పాచికలు ఇక్కడ పారవు. ఆయనకు ఓటర్లు తగిన రీతిలో బుద్ధి చెబుతారు. -వెంపాడ అప్పలకారురెడ్డి
గంటకో పార్టీ ...ఆయన్ను నమ్మలేం
పార్టీకో మేనిఫెస్టో ఉంటుంది. అందువలన తరచూ పార్టీలు,నియోజకవర్గాలు మారిన వారిని మైనారిటీలు విశ్వసించలేరు. అయినా ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. మళ్లీ ఇక్కడే పోటీ చేస్తారో లేదో కూడా తెలియదు. అలాంటి వ్యక్తిని ఎలా నమ్మగలం
- వంకాయల మారుతీ ప్రసాద్